- మరోసారి అట్టుడికిన ఢిల్లీ
- రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
- దాదాపు రెండు గంటల పాటు ఎంపీలు, పోలీసుల మధ్య తోపులాట
- రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు
- ఎఫ్ఐఆర్ లన్నీ తనకు మెడల్స్ అని వ్యాఖ్య
న్యూఢిల్లీ, మహా : దిల్లీలో మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. విపక్ష ఎంపీల సమావేశం అనంతరం, ఈసీ కార్యాలయానికి వెళ్లడానికి ప్రతిపక్ష ఎంపీలు సిద్ధంకావడంతో ఎన్నికల కమిషన్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తీరును ఖండిస్తూ, ఆయన రాజీనామా డిమాండ్‌తో విపక్ష ఇండియా కూటమి ఎంపీలు జంతర్‌మంతర్ వద్ద ఆందోళనకు దిగారు. జంతర్ మంతర్ నిరసనలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమత్రి అమిత్‌షాలు జ్ఞానేశ్ ద్వారా ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఈ అక్రమాలకు వ్యతిరేకంగా పోరాడితే తనపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేస్తున్నారని, వాటిని తాను మెడల్స్ భావిస్తానని తెలిపారు. ఇప్పటి వరకు తనపై 45 ఎఫ్‌ఐఆర్‌లు ఉన్నాయని, 100 మెడల్స్ సాధించడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. “లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు ఈసీని కలుద్దామని 300 మంది వెళితే మాకు అనుమతి నిరాకరించారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు పదవిలో కొనసాగే అర్హత లేదు. మా దృష్టిలో ఆయన చట్టబద్ధమైన అధికారి కాదు. దేశద్రోహులపై చర్యలు తీసుకునే వరకు మా పోరాటం ఆగదు” అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
సీఈసీకి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టేందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే సహా విపక్ష ఎంపీలు బస్సుల్లో జంతర్‌మంతర్‌కు బయలుదేరగా, వారిని అడ్డుకోవడానికి వందలాది మంది భద్రతా బలగాలు మోహరించాయి. ఈ క్రమంలో జంతర్‌మంతర్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. దిల్లీ పోలీసుల తీరుపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, “ఎంపీలతో ప్రవర్తించే తీరు ఇదేనా? ఎంపీలను కొడతారా? ఈడ్చి పడేస్తారా? ఈసీని కలుద్దామని ఎంపీలు అడగడం నేరమా?” అంటూ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, విపక్ష ఎంపీలను పోలీసులు అరెస్టు చేశారు. దాదాపు రెండు గంటల పాటు ఎంపీలను నిలువరించేందుకు ప్రయత్నించిన పోలీసులు రాహుల్ గాంధీ, ప్రయాంకలతో పాటు విపక్ష ఎంపీలందరినీ బలవంతంగా అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. ఎంపీల అరెస్టు సందర్భంగా కార్యకర్తలు, నేతలు కొందరు పోలీసులను అడ్డుకున్నప్పటికీ వారందరినీ చెదరగొట్టిన పోలీసులు జంతర్ మంతర్ నుంచి ఎంపీలందరినీ తరలించారు.







