డిసెంబర్ 9 నుంచి రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు అల్పాహారం.
* నవంబర్ 30లోగా ఏర్పాట్లు పూర్తి చేయాలి.
* సీఎం రేవంత్ రెడ్డి.
హైదరాబాద్, మహా.
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అల్పాహారం అందించే పథకాన్ని డిసెంబర్ 9న రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు వేగవంతం చేసింది. నవంబర్ 30లోగా సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ల ఏర్పాటు సహా అన్ని సన్నాహాలు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు పోషకాహారం అందించడంతో పాటు పాఠశాలల్లో హాజరుశాతం పెంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. విద్యార్థులకు అందించే అల్పాహారంలో పోషక విలువలు, కేలరీల పరిమాణాన్ని పర్యవేక్షించేందుకు ప్రత్యేక యాప్‌లను వినియోగించాలని సీఎం సూచించారు. ఆయా ప్రాంతాల్లోని విద్యార్థుల ఆహారపు అలవాట్లకు అనుగుణంగా మెనూ రూపొందించాలని చెప్పారు. వంటశాలల్లో తయారయ్యే ఆహారం నాణ్యతను నిరంతరం తనిఖీ చేసే వ్యవస్థను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. సెంట్రలైజ్డ్ కిచెన్ల పనితీరును నిరంతరం పర్యవేక్షించేందుకు కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయాలని రేవంత్‌రెడ్డి సూచించారు. కిచెన్ల నుంచి పాఠశాలలకు ఆహారం సరఫరా, నాణ్యత, విద్యార్థులకు అందుతున్న పరిమాణం వంటి అంశాలను పర్యవేక్షించేలా వ్యవస్థను రూపొందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమం దీర్ఘకాలం కొనసాగేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను ముందుగానే సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డి, హరేకృష్ణ ఫౌండేషన్ ప్రతినిధి సత్య గౌర చంద్రదాస్ స్వామీజీ తదితరులు పాల్గొన్నారు. డిసెంబర్ 9న పథకం ప్రారంభానికి ముందే వంటశాలలు, ఆహార సరఫరా వ్యవస్థ, నాణ్యత పర్యవేక్షణ ఏర్పాట్లను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.








