- నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి
- ఏపీకి ఏం చేయగలనో గైడ్ చేయండి
- సీఎం చంద్రబాబును కోరిన అనంత్ అంబానీ
- మదనపల్లెలో గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ప్రారంభోత్సవంలో మాట్లాడిన అనంత్ అంబాని
మదనపల్లె, మహా : తనను ఆంధ్రా బిడ్డగా భావించాలని.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తానేం చేయగలనో గైడ్ చేయాలని సీఎం చంద్రబాబును అనంత్ అంబానీ కోరారు. అన్నమయ్య జిల్లాలోని మదనపల్లెలో ఏర్పాటు చేస్తున్న గ్లోబల్ హార్టికల్చర్ హబ్ దేశ అభివృద్ధిలో కీలక భాగమవుతుందని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ అనంత్ అంబానీ అన్నారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఎంతో మంది యువ పారిశ్రామికవేత్తలు, రైతులకు కొత్త ఆశలు కల్పించగా, వారి కల సాకారం చేసుకునే దిశగా ఏపీ ప్రభుత్వం అవకాశాలు సృష్టిస్తుందన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభివృద్ధి చేస్తున్న గ్రామీణ ప్రాంతాలు, పంచాయతీ రాజ్ వ్యవస్థలో చేస్తున్న మార్పులు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. అటవీ శాఖ, పర్యావరణం పట్ల ఆయన చూపిస్తున్న ప్రేమ.. వాటిని పరిరక్షించేందుకు ఆయన తీసుకుంటున్న చర్యలు అభినందనీయమన్నారు.
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో శుక్రవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో కలిసి రాయలసీమ హార్టికల్చర్ హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ (ఐఎస్ఏ)లకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. తనను ఈ కార్యక్రమంలో భాగం చేసినందుకు సీఎం చంద్రబాబుకు రిలయన్స్ డైరెక్టర్ అనంత్ అంబానీ ధన్యవాదాలు తెలిపారు. ఈ చారిత్రక ఘట్టంలో తాను భాగస్వామి అయినందుకు హర్షం వ్యక్తం చేశారు. మదనపల్లెలో హైటెక్ అగ్రికల్చర్ విధానం కోసం ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ను ప్రారంభించినందుకు సంతోషంగా ఉంది. ఏపీ సీఎం చంద్రబాబు హైదరాబాద్ కు తీసుకొచ్చిన ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ద్వారా ఎంతో మంది పారిశ్రామికవేత్తలుగా ఎదిగారు. ప్రపంచంలోని అగ్ర సంస్థలకు సీఈఓలుగా అవకాశాలు దక్కించుకున్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో ‘ఆంధ్ర భూమి.. సువర్ణ భూమి’గా మారుతోంది. రాష్ట్రానికి నేనేం చేయగలనో గైడ్ చేయాలని సీఎం చంద్రబాబును కోరారు. వికసిత్ భారత్ లక్ష్యాలు నెరవేరేందుకు తన వంతు కృషి చేసేందుకు సిద్ధంగా ఉన్నానని అనంత్ అంబానీ పేర్కొన్నారు.
1990లలో మదనపల్లెలో విశ్వగురు రవీంద్రనాథ్ ఠాగూర్ జాతీయ గీతాన్ని బెంగాళీ నుంచి ఇంగ్లీష్ లోకి అనువదించారు. ఈరోజు మదనపల్లెలో ఎంతో మంది రైతులకు ప్రయోజనం కలిగించే గ్లోబల్ హార్టికల్చర్ హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్‌కు శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందన్నారు. మహాత్మాగాంధీ కలలు కన్నట్లుగా రైతులు, గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయి. మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి చెప్పినట్లుగా జై జవాన్.. జై జవాన్ కిసాన్ నినాదంతో మరెన్నో విజయాలు సాధిద్దాం. దివంగత ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి దీనికి మరో విషయం జై విజ్ఞాన్ చేర్చారు. నేడు ప్రధాని మోదీ జై అనుసంధాన్ అన్నారు. జై జవాన్.. జై కిసాన్.. జై విజ్ఞాన్.. జై అనుసంధాన్ గా మార్చేశారు. రైతులకు టెక్నాలజీ అవసరం ఉందని సీఎం చంద్రబాబు గుర్తించారు. అందువల్లే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, టెక్నాలజీ సహాయంతో రైతుల వ్యవసాయంలో మరింత ప్రయోజనం చేకూరుతుంది. గ్రీన్ హౌస్ ఎనర్జీతో పర్యావరణానికి హాని కాకుండా అభివృద్ధి కోసం చంద్రబాబు కృషి చేస్తున్నారు. అందుకే రిలయన్స్ సంస్థ తమకు బయో ప్లాంట్స్, సహా ఇతర పెట్టుబడి అవకాశాలు కల్పించినందుకు ఏపీ ప్రభుత్వానికి, సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు.
భారత్ గ్రామీణ ప్రాంతాల్లోనే జీవిస్తుందని గాంధీజి సర్వోదయ అంత్యోదయ అని పిలుపునిచ్చారు. టెక్నాలజీతో రైతుల ఆదాయం పెరగాలని సీఎం చంద్రబాబు ఈ మిషన్ చేపట్టారు. రైతులు వేసే పంటలకు చీడపీడలు సోకకుండా ఏఐ, డ్రోన్లు రోబోటిక్స్ సాంకేతికతతో ప్రెసిషన్ ఫార్మింగ్ చేయడానికి ఐఎస్ఏ సహకరిస్తుంది. నీరు, ఎరువులను పంటలకు అందించేలా సహకారం అందిస్తాం. ఏఐ ద్వారా సంప్రదాయ ఇంటెలిజెన్స్ జోడించి రైతులకు సహకారం అందించేలా చేస్తాం. రిలయన్స్ గ్రీన్ బిజినెస్ ద్వారా అన్నదాతలను ఉర్జా దాతలుగా మారుస్తాం. రిలయన్స్ సీబీజీ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి రూ.1 లక్ష కోట్ల పెట్టుబడులు పెడుతోంది. మదనపల్లె టమాటో రైతులకు ఎప్పుడు ఎక్కడ తమ ఉత్పత్తులు విక్రయించాలో చెబుతాం. మా తాత ధీరుబాయ్ అంబానీ కలలను సాకారం చేయడానికి కృషి చేస్తున్నాం. ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ తో కలిసి జియో పని చేస్తుంది. రైతుల ఇంటి వరకు వెళ్లి సహకారం అందించేలా మేం పని చేస్తామన్నారు. ఏపీ ప్రభుత్వం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పెద్ద ఎత్తున పెట్టుబడులు సాధిస్తోంది. 388 మెగా ఇన్వెస్ట్మెంట్స్ రాష్ట్రానికి వచ్చాయి. 14 లక్షల కోట్లు, 11 లక్షల మందికి ఉద్యోగాలు ఏపీ ప్రభుత్వం సాధించింది. రాయలసీమలో హార్టికల్చర్ హబ్ కు రిలయన్స్ సహకారం అందిస్తుంది. వంతారా ద్వారా పశువులకు, జంతువులకు సేవలు అందిస్తున్నాం. పశుసంవర్ధకం, వ్యవసాయం, ఉద్యాన రంగాల అభివృద్ధికి పని చేస్తామని అనంత్ అంబానీ పేర్కొన్నారు.
ఫ్రూట్ బౌల్‌గా రాయలసీమ
నీళ్లుంటే రైతులు బంగారం పండిస్తారు
సీఎం చంద్రబాబు
కరవు ప్రాంతం రాయలసీమ దశ-దిశను సమూలంగా మార్చేందుకు గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ఏర్పాటు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. రాయలసీమను ఫ్రూట్ బౌల్ గా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ప్రాథమిక రంగం వృద్ధిలో హార్టికల్చర్‌ది కీలక పాత్ర అని, రాబోయే రోజుల్లో మరో 6 లక్షల హెక్టార్లలో ఉద్యాన పంటలను విస్తరించి రాయలసీమ ప్రాంతాన్ని ఫ్రూట్ బౌల్ గా తీర్చిదిద్దుతామని ధీమా వ్యక్తం చేశారు. రాయలసీమ రైతుల శ్రమను కొనియాడిన సీఎం సరిపడా సాగునీరు అందిస్తే ఈ నేలలో బంగారం పండించే సత్తా ఇక్కడి రైతులకు ఉందన్నారు. 20 రకాల పంటల్లో ఏ పంటనైనా పండించగల ప్రతిభ ఈ ప్రాంత రైతుల సొంతమని, ఉత్పత్తులకు సరైన మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తే సంపద సృష్టిస్తారని కితాబిచ్చారు.
ఈ గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ద్వారా పంటల సాగుతో పాటు ధరల స్థిరీకరణ సాధ్యమని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఎన్టీఆర్ హయాంలో ప్రారంభమైన సాగునీటి ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్తున్నామని.. హంద్రీనీవా ప్రాజెక్ట్ నీళ్లు రాకపోతే మదనపల్లె నుంచి పెద్ద ఎత్తున వలసలు ఉండేవన్నారు. రాయలసీమను కరవు నుంచి కాపాడేందుకు డ్రిప్ ఇరిగేషన్, వాటర్ షెడ్ పథకాలు, పంటకుంటల ద్వారా జలసంరక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. రూ.35 వేల కోట్లతో 36 ప్రాజెక్టులను వచ్చే మూడేళ్లలో పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే హంద్రీనీవా ఫేజ్-2, వెలిగొండ ఫేజ్-2, మడకశిర బ్రాంచ్ కెనాల్ విస్తరణ ప్రాజెక్టు పనులను వేగవంతం చేస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అథితిగా పాల్గొన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీపై ఏపీ సీఎం చంద్రబాబు ప్రశంసల వర్షం కురిపించారు. అనంత్ అంబానీ కేవలం ఒక విజన్ ఉన్న యువ పారిశ్రామికవేత్త మాత్రమే కాదని, గొప్ప పర్యావరణ పరిరక్షకుడని కొనియాడారు. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఏకంగా 3,500 ఎకరాలలో వంతార పేరుతో జంతువుల పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసి మూగజీవులను సంరక్షిస్తున్నారని పేర్కొన్నారు. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిపై ఉన్న అపారమైన భక్తిశ్రద్ధలతో పర్యావరణహితం కోసం ఇటీవల తిరుమలకు ఉచితంగా ఎలక్ట్రిక్ బస్సులను అందజేశారని సీఎం చంద్రబాబు గుర్తుచేసుకున్నారు.








