- వివేకా హత్య కేసు
- ఎంపీ అవినాష్ రెడ్డికి ఈడీ నోటీసులు
- 14 న విచారణకు రావాలని ఆదేశం
కడప, మహా : ఉమ్మడి ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అనూహ్య మలుపు చోటుచేసుకుంది. కేసు విచారణలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. ఆక్టోబర్ 14వ తేదీన తమ ముందు విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావాలని ఈడీ అధికారులు ఆ నోటీసులో పేర్కొన్నారు. మాజీ ఎంపీని హత్య చేయడం వెనుక రూ. 40 కోట్ల మేర భారీ నగదు లావాదేవీలు జరిగాయనే ఆరోపణలున్నాయి. ఈ కోణంలో ఈడీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేసింది. మనీ లాండరింగ్ కోణంలో ఇప్పటికే పలువురు వ్యక్తులను ఈడీ ప్రశ్నించింది. వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరితో పాటు ప్రధాన నిందితులు సునీల్‌యాదవ్, ఎర్రగంగిరెడ్డి, ఉమాశంకర్‌రెడ్డిలను సుదీర్ఘంగా విచారించి పలు కీలక ఆధారాలు, వివరాలను ఈడీ సేకరించింది. ఆ విచారణలో వెలుగుచూసిన అంశాల ఆధారంగానే తాజాగా ఎంపీ అవినాష్‌రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.








