- ఖైరతాబాద్ మాదే
- బీఆర్ఎస్ తో పత్తు ఉండదు
- తెలంగాణ ప్రాజెక్టులకు కేంద్రం సహకారం
- ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
న్యూఢిల్లీ, మహా : ఖైరతాబాద్ లో బీజేపీ గెలుపొందడం ఖాయమని కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో చేపడుతున్న వివిధ ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తోందని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాల్లో కేంద్రం నుంచి అవసరమైన సహకారం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. గురువారం ఢిల్లీలో మీడియతో మాట్లాడిన కిషన్ రెడ్డి తెలంగాణలో బీఆర్‌ఎస్‌తో బీజేపీ పొత్తు ఉండదని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. రెండు పార్టీల మధ్య పొత్తుపై వస్తున్న ఊహాగానాలకు ఆయన తెరదించారు. ఈ విషయంపై బీజేపీ వైఖరి స్పష్టంగా ఉందని తెలిపారు.
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌కు అవసరమైన బొగ్గు సరఫరా అంశంపైనా కిషన్‌రెడ్డి స్పందించారు. కోల్ లింకేజీకి సంబంధించి తనకు గురువారం వాట్సాప్ ద్వారా లేఖ వచ్చిందని, దీనిపై సానుకూలంగా నిర్ణయం తీసుకునే దిశగా చర్యలు ఉంటాయని వెల్లడించారు. యాదాద్రి థర్మల్ ప్లాంట్‌కు జీ-9 గ్రేడ్ బొగ్గు అవసరమని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పేర్కొంది. ఖైరతాబాద్ ఉప ఎన్నికపైనా కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో పొరపాటున ఖైరతాబాద్‌లో బీజేపీ ఓడిపోయిందని పేర్కొంటూ రానున్న ఉప ఎన్నికలో బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.








