Mahaa Daily Exclusive

  మహిళా సంఘాల ఆర్థికాభివృద్ధికి కొత్త ఉపాధి కేంద్రాలు…

Share

  • మహిళా సంఘాల ఆర్థికాభివృద్ధికి కొత్త ఉపాధి కేంద్రాలు
  • ఉత్పత్తులకు వరంగల్‌ జిల్లా బ్రాండ్‌ గుర్తింపు తీసుకురావాలి
  • వరంగల్ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సత్య శారద

 

వరంగల్‌, కలెక్టరేట్ మహా ;

వరంగల్‌ జిల్లా డీఆర్‌డీఏ సమావేశ మందిరంలో రాణి రుద్రమదేవి జిల్లా సమాఖ్య 12వ వార్షికోత్సవ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సత్య శారద పాల్గొని మండల సమాఖ్య ను ఉద్దేశించి మాట్లాడుతూ వరంగల్‌ జిల్లాలోని 11 మండలాల్లో మహిళా సంఘాల ఆధ్వర్యంలో మొబైల్‌ సూపర్‌ మార్కెట్లు, జిరాక్స్‌ కేంద్రాలు, మిల్లెట్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు, పప్పు మిల్లులను ఏర్పాటు చేసి మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

మంజూరైన గ్రామ సంఘ భవనాల నిర్మాణాలను నెల రోజుల్లోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మహిళా సంఘాల ఉత్పత్తులకు మార్కెటింగ్‌ సౌకర్యాలు కల్పించి, వాటికి వరంగల్‌ జిల్లా బ్రాండ్‌ గుర్తింపు తీసుకువచ్చేలా ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

వరంగల్‌ జిల్లా ప్రత్యేకతను ప్రతిబింబించే ఉత్పత్తులను తయారు చేసి రాష్ట్రవ్యాప్తంగా మార్కెటింగ్‌ చేసేలా మహిళా సంఘాలకు అవసరమైన శిక్షణ అందించాలని తెలిపారు.
ఉత్పత్తుల నాణ్యత, ప్యాకేజింగ్‌, బ్రాండింగ్‌, మార్కెటింగ్‌పై దృష్టి సారించాలని సూచించారు.

ఈ సందర్భంగా డీఆర్‌డీఓ కే. నాగపద్మ మాట్లాడుతూ, మహిళా సంఘాలకు వివిధ జీవనోపాధి కార్యక్రమాలను ఏర్పాటు చేసేందుకు అవసరమైన ఆర్థిక సహాయం అందిస్తామని తెలిపారు.
మహిళా సంఘాల సభ్యులు అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు రజిత, కార్యదర్శి ఉమ, కోశాధికారి స్వప్న, పాలకవర్గ సభ్యులు, అదనపు డీఆర్‌డీఓ శ్రీనివాస్‌, డీపీఎం అనిల్‌కుమార్‌, డీపీఎంలు, ఏపీఎంలు తదితరులు పాల్గొన్నారు.