Mahaa Daily Exclusive

  ప్రభుత్వ విద్యాసంస్థలు, అంగన్‌వాడీ కేంద్రాలకు నాణ్యమైన ఆహారం అందేలా చర్యలు చేపట్టాలి…

Share

  • ప్రభుత్వ విద్యాసంస్థలు, అంగన్‌వాడీ కేంద్రాలకు నాణ్యమైన ఆహారం అందేలా చర్యలు చేపట్టాలి
  • ఆహార భద్రత పై డీఎల్‌ఏసీ సమావేశం

వరంగల్,కలెక్టరేట్ మహా ;

వరంగల్ జిల్లా కలెక్టరేట్‌ లో బుధవారం ఆహార భద్రతపై జిల్లా స్థాయి సలహా కమిటీ (డీఎల్‌ఏసీ) సమావేశం జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సత్య శారద అధ్యక్షతన నిర్వహించారు.
ఈ సందర్భంగా రెసిడెన్షియల్‌ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో విద్యార్థులు, చిన్నారులకు అందించే ఆహార నాణ్యత, పరిశుభ్రత, ఆహార భద్రత పై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. వంటశాలలు, ఆహార పదార్థాల నిల్వ ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు, నాణ్యమైన ఆహార పదార్థాలను మాత్రమే వినియోగించేలా పర్యవేక్షించాలని సూచించారు.

అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు అందించే ఆహార పదార్థాల నాణ్యతను ఎప్పటికప్పుడు పరిశీలించాలని, ఆహార పదార్థాల నిల్వ, తయారీ, పంపిణీలో తగిన జాగ్రత్తలు పాటించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. రెసిడెన్షియల్‌ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆహార భద్రత ప్రమాణాల అమలుపై సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.
చిరు వీధి ఆహార వ్యాపారులకు పరిశుభ్రత, ఆహార భద్రత ప్రమాణాలపై తగిన శిక్షణ అందించి, ప్రజలకు పరిశుభ్రమైన, నాణ్యమైన ఆహార పదార్థాలు అందించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ సూచించారు. ఆహార పదార్థాల తయారీ, నిల్వ, విక్రయ సమయంలో పాటించాల్సిన పరిశుభ్రత ప్రమాణాలపై వారికి అవగాహన కల్పించాలని తెలిపారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు ఆహారం అందించే డైట్‌ క్యాంటీన్ల లో తరచూ తనిఖీలు నిర్వహించాలని, ఆహార నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలను పరిశీలించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రోగులకు నాణ్యమైన, సురక్షితమైన ఆహారం అందేలా పటిష్టమైన పర్యవేక్షణ ఉండాలని తెలిపారు.
అలాగే పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో వినియోగించే తాగునీటి నాణ్యతను నిర్ధారించేందుకు నీటి నమూనాలను పరీక్షలకు పంపించాలని గ్రౌండ్‌వాటర్‌ శాఖ అధికారిని ఆదేశించారు. తాగునీటి నాణ్యతపై క్రమం తప్పకుండా పరీక్షలు నిర్వహించాలని సూచించారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) ఎల్‌. కిషోర్‌ కుమార్‌, అదనపు కలెక్టర్‌ (లోకల్‌ బాడీస్‌) వై.వి. గణేష్‌, జిల్లా ఫుడ్‌ సేఫ్టీ అధికారి కృష్ణమూర్తి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ రాజారెడ్డి, ఏడీ ఫిషరీస్‌ శ్రీపతి,ఆహార పరిరక్షణ అధికారి సీహెచ్ మౌనిక తదితరులు పాల్గొన్నారు.