*పదవీ విరమణ తో ప్రతి ఉద్యోగి సేవలు చిరస్మరణీయం
*బల్దియా ప్రత్యేకాధికారి, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్
వరంగల్, కార్పొరేషన్ మహా;
ప్రతి ఉద్యోగి జీవితంలో పదవీ విరమణ సహజమైన ఘట్టమని , అయితే ప్రజలకు అంకితభావంతో పనిచేసిన సేవలు ఎప్పటికీ చిరస్మరణీయంగా నిలుస్తాయని బల్దియా ప్రత్యేకాధికారి, హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అన్నారు.
బల్దియా ఇంజనీరింగ్ విభాగం ఈఈ సంతోష్ బాబు, డీఈ రంగారావు, ఆపరేటర్ రాజకోమురయ్య పదవీ విరమణ సందర్భంగా బల్దియా జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన వీడ్కోలు కార్యక్రమానికి చాహత్ వాజ్పాయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పదవీ విరమణ పొందుతున్న ఉద్యోగులను శాలువాలతో సత్కరించి, జ్ఞాపికలను అందజేశారు.
జేఏసీ ప్రధాన కార్యదర్శి బాకం సంతోష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, సుదీర్ఘకాలం మున్సిపల్ సర్వీసులో నిబద్ధతతో పనిచేస్తూ వృత్తి ధర్మానికి వన్నెతెచ్చిన ముగ్గురి సేవలను కొనియాడారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు.
ఇంజనీరింగ్ విభాగంలో బాధ్యతలు నిర్వర్తించిన ఈఈ సంతోష్ బాబు, డీఈ రంగారావు అనేక అభివృద్ధి పనులు, కీలక ప్రాజెక్టులను నాణ్యతా ప్రమాణాలతో, నిర్ణీత గడువులో పూర్తి చేయడంలో విశేష కృషి చేశారని పలువురు అధికారులు, సహచరులు గుర్తుచేశారు. శాఖాపరమైన సవాళ్లు ఎదురైన సందర్భాల్లో సంయమనంతో వ్యవహరిస్తూ, సమస్యలకు పరిష్కార మార్గాలు చూపిన వారి అనుభవం, చొరవ ఇతర ఉద్యోగులకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఆపరేటర్ రాజకోమురయ్య సైతం తన బాధ్యతలను అంకితభావంతో నిర్వర్తించి సంస్థకు సేవలందించారని అభినందించారు.
*భావోద్వేగ వీడ్కోలు.. ఘనమైన సత్కారం*
పదవీ విరమణ పొందుతున్న ముగ్గురిని తోటి ఇంజనీర్లు, అధికారులు, సిబ్బంది ఘనంగా సన్మానించారు. శాలువాలు కప్పి జ్ఞాపికలు అందజేసి, వారి భవిష్యత్ జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా పదవీ విరమణ పొందుతున్న వారు తమ ఉద్యోగ జీవితంలోని అనుభవాలను, సహచరులు అందించిన సహకారాన్ని గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రజలకు సేవ చేసే అవకాశం లభించడం తమకు ఎంతో సంతృప్తినిచ్చిందని, సుదీర్ఘ సేవా ప్రయాణంలో సహకరించిన అధికారులు, సహచరులు, సిబ్బందికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ జోనా, సూపరింటెండెంట్ ఇంజనీర్ రాజ్‌కుమార్, సిపి రవీందర్ రాడేకర్, ఎంహెచ్ఓ డాక్టర్ రాజేష్ ముఖ్య హార్టికల్చర్ అధికారి లక్ష్మారెడ్డి, ఇన్‌చార్జి డిప్యూటీ కమిషనర్ ప్రసన్నరాణి, ఎంహెచ్‌ఓ డా. రాజేష్, ఈఈలు రవి కుమార్, సంజయ్ కుమార్ తదితర ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్లు సుధాకర్, పూజారి శ్రీనివాస్, కర్రు రమేష్, సిబ్బంది, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.








