- డిసెంబర్‌లో నంది ఫిల్మ్ అండ్ టీవీ అవార్డులు
- ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన
- తిరుపతి వేదికగా ప్రదానం
- 2012 నుంచి 2025 వరకు అవార్డుల ఎంపికకు కమిటీల ఏర్పాటు
అమరావతి, మహా : నంది ఫిల్మ్ అవార్డులపై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. నంది ఫిల్మ్, టీవీ అవార్డులకు సెప్టెంబర్‌లో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలిపారు. అక్టోబర్‌లో ప్రకటన వెలువడుతుందని, డిసెంబర్ లో అవార్డుల ప్రధానోత్సవం ఉంటుందని మంత్రి దుర్గేష్ వెల్లడించారు. ‘ఇది వరలో ప్రకటించిన 2012 నుండి 2016 వరకు నంది ఫిల్మ్ అండ్ టీవీ అవార్డులను ఇవ్వాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2017 నుండి 2024 వరకు సంవత్సరానికి 4 అవార్డుల చొప్పున (2 ప్రొడక్షన్, 2 స్పెషల్ జ్యూరీ) ఫిల్మ్ అండ్ టీవీ అవార్డులను ప్రదానం చేయడానికి ప్రభుత్వం అంగీకరిస్తూ జీవో జారీ చేసింది. 2025 సంవత్సరానికి నంది ఫిల్మ్ అండ్ టీవీ అవార్డులు అందించనున్నాం.’ అని మంత్రి దుర్గేష్ చెప్పారు. నంది ఫిల్మ్ అండ్ జాతీయ చలన చిత్ర (నేషనల్ ఫిల్మ్) అవార్డులను అమరావతి లేదా విజయవాడ వేదికగా ఇవ్వాలని నిర్ణయించామని మంత్రి తెలిపారు. నంది టీవీ అవార్డులను తిరుపతి వేదికగా ఇవ్వాలని నిర్ణయించామన్నారు. ఈ అవార్డులన్నీ కూడా డిసెంబర్ – 2026 లోగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని దుర్గేష్ పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిశా నిర్దేశం మేరకు వైభవంగా నంది అవార్డులు వేడుకలు ఉంటాయని ప్రకటించారు.
నంది నాటకోత్సవాలు
మరోవైపు నాటక సమాజాలు, కళాకారులు, రచయితలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త అందించింది. ప్రతిష్టాత్మక నంది నాటకోత్సవాలు-2025తో పాటు కందుకూరి పురస్కారాలు-2026 కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైనట్లు తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర చలనచిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ నిర్వహణ కమిటీ ప్రకటన విడుదల చేసింది. నంది నాటకోత్సవాలు-2025 కోసం పోటీ పడేందుకు నాటక సమాజాలు, పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, వ్యక్తుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. పద్య నాటకాలు, సాంఘిక నాటకాలు, సాంఘిక నాటికలు, పిల్లల నాటకాలు (చైల్డ్ ఆర్టిస్ట్స్/చిల్డ్రన్ ప్లేస్), కాలేజీ/యూనివర్సిటీ నాటకాలు, నాటకరంగం, ప్రదర్శన కళలపై రాసిన గ్రంథాలు/పుస్తకాల కోసం సేవలు అందించిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. కందుకూరి పురస్కారాలు – 2026 నాటకరంగానికి విశేష సేవలు అందించిన పౌరాణిక, సాంఘిక నాటక కళాకారులు, దర్శకులు, సాంకేతిక నిపుణులు, రచయితలు, నాటక సంస్థల నుండి ఈ పురస్కారాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో కందుకూరి రంగస్థల ప్రతిభా పురస్కారం అందించనున్నారు. జిల్లా స్థాయిలో కందుకూరి విశిష్ట పురస్కారాలు అందజేస్తారు.
ఆసక్తి ఉన్న అభ్యర్థులు డిపార్ట్‌మెంట్ అధికారిక వెబ్‌సైట్ www.apsftvtdc.in సందర్శించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్ 20, 2026గా నిర్ణయించారు. హార్డ్ కాపీల సమర్పణకు చివరి తేదీ అక్టోబర్ 26 సాయంత్రం లోపు ఉంది. దరఖాస్తులు పంపవలసిన చిరునామా మేనేజింగ్ డైరెక్టర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టీవీ మరియు నాటకరంగ అభివృద్ధి సంస్థ, 4వ అంతస్తు, ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, పండిట్ నెహ్రూ బస్ స్టేషన్, విజయవాడ – 520013.








