- రామ మందిరంలో భారీ కుంభకోణం
- 105 సార్లు విరాళాల చోరీ
- సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిర్ధారించిన ప్రత్యేక దర్యాప్తు బృందం
- ఇప్పటి వరకు 8 మంది అరెస్ట్
- సెప్టెంబర్ 25 నాటికి ఛార్జిషీట్ దాఖలుకు ఏర్పాట్లు
అయోధ్య, మహా : అయోధ్య రామ మందిరంలో భక్తులు సమర్పించిన విరాళాల చోరీకి సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆలయంలో ఏకంగా 105 సార్లు విరాళాల అపహరణ జరిగినట్లు సీసీటీవీ దృశ్యాల ఆధారంగా ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నిర్ధారించింది. ఈ మేరకు సోమవారం సుప్రీంకోర్టుకు సిట్ తన నివేదికను సమర్పించింది. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ కేసుకు సంబంధించిన సిట్ నివేదికలోని కీలక అంశాలను ధర్మాసనం ముందుంచారు. సీసీటీవీ ఫుటేజీతో పాటు ఇతర ఆధారాలను విశ్లేషించి నిందితులను గుర్తించినట్లు ఆయన తెలిపారు. సాధారణంగా విరాళాలకు సాఫ్ట్‌వేర్ ద్వారా రశీదులు జారీ చేసి, ఆ నగదును స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాకర్‌లో భద్రపరుస్తారు. అయితే, ఈ ప్రక్రియలో భారీగా అవకతవకలు జరిగినట్లు దర్యాప్తులో తేలింది. ప్రస్తుతం దర్యాప్తు తుది దశకు చేరుకుందని, సెప్టెంబర్ 25 నాటికి ఛార్జిషీట్ దాఖలు చేసే అవకాశం ఉందని మెహతా కోర్టుకు వివరించారు.
ఈ కేసులో ఇప్పటివరకు ఎనిమిది మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో అవినాష్ శుక్లా, అనుకల్ప్ మిశ్రా, లవకుశ్ మిశ్రా, మనీశ్ కుమార్ యాదవ్, కరుణేశ్ పాండే, రామాశంకర్ మిశ్రా, సుభాష్ శ్రీవాస్తవ, రామ్ శంకర్ యాదవ్ ఉన్నారు. నిందితులపై భారతీయ న్యాయ సంహితతో పాటు అవినీతి నిరోధక చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలు వెలుగులోకి రావడంతో రామ్ మందిర్ ట్రస్టులో కీలక మార్పులు చేశారు. చంపత్ రాయ్, అనిల్ మిశ్రాలు తప్పుకున్న అనంతరం, ఆలయ పరిపాలన కోసం సీఈఓ నేతృత్వంలో కొత్త వ్యవస్థను ఏర్పాటు చేశారు. రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రాను నూతన సీఈఓగా నియమించారు. కాగా, సిట్ నివేదిక ప్రతిని తమకు అందజేయాలన్న పిటిషనర్ల అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.






