Mahaa Daily Exclusive

  ఆరుతడి పంటలకే ప్రాధాన్యం ఇవ్వండి…

Share

ఆరుతడి పంటలకే ప్రాధాన్యం ఇవ్వండి.
• రైతులకు భారీ సబ్సిడీపై యాసంగి విత్తనాల పంపిణీ.
• వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
హైదరాబాద్, మహా:
రాష్ట్రంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎల్‌నినో ప్రభావం కారణంగా తలెత్తిన నీటి కొరతను దృష్టిలో ఉంచుకుని రైతులు తమ పంటల సాగులో కీలక మార్పులు చేసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. తక్కువ నీటితో పాటు, తక్కువ పెట్టుబడితో స్వల్పకాలంలో చేతికొచ్చే పంటలను మాత్రమే రైతులు ఎంపిక చేసుకోవాలని ఆయన సూచించారు. శనివారం రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన ‘రైతు నేస్తం’ 109వ ఎపిసోడ్‌లో పాల్గొన్న ఆయన.. యాసంగి (రబీ) సీజన్‌కు సంబంధించిన విత్తన పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రానున్న యాసంగి సీజన్‌లో రైతాంగం వరికి బదులుగా పప్పుధాన్యాలు, నూనెగింజల సాగుకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలోని వివిధ సాగునీటి ప్రాజెక్టుల్లో ఉన్న నీటి నిల్వలకు అనుగుణంగా వ్యవసాయ, నీటిపారుదల శాఖలు సమన్వయంతో కచ్చితమైన సాగునీటి ప్రణాళికను సిద్ధం చేస్తున్నాయని మంత్రి తెలిపారు. ఈ ప్రణాళికలను ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో పటిష్ఠంగా అమలు చేసేలా అధికారులకు దిశానిర్దేశం చేశారు.
యాసంగి సీజన్‌కు సంబంధించి ఎన్ఎఫ్ఎస్ఎం (NFSM), ఎన్ఎంఈఓ-ఓఎస్ (NMEO-OS) పథకాల కింద రైతులకు విత్తనాలను పంపిణీ చేస్తున్నట్లు మంత్రి తుమ్మల వివరించారు. మారుతున్న కాలానికి, మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా రైతులు లాభసాటి ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రధానంగా ఆరుతడి పంటైన వేరుశనగలో నూతన వంగడాలను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించామని, నీటి ఆదా కోసం వ్యవసాయంలో ఆధునిక పద్ధతులను ప్రోత్సహిస్తూ ఇతర పంటలకు సైతం స్ప్రింక్లర్లను సబ్సిడీపై అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని స్పష్టం చేశారు. అలాగే, ఆయిల్‌పామ్ సాగు చేస్తున్న రైతుల నుంచి గెలలను ఎలాంటి ఆలస్యం లేకుండా వేగంగా ఫ్యాక్టరీలకు తరలించేలా ముందస్తు చర్యలు తీసుకోవడంతో పాటు, రైతులకు అందాల్సిన చెల్లింపులు కూడా త్వరితగతిన జరిగేలా ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు.
రైతులకు ఆర్థికంగా దన్నుగా నిలిచేందుకు రబీ విత్తనాల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ.52 కోట్లకు పైగా నిధులను సబ్సిడీ రూపంలో వెచ్చిస్తోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. విత్తనాలపై 50 నుంచి 75 శాతం వరకు సబ్సిడీని అందిస్తున్నామని, కొన్ని ప్రత్యేక రకాల విత్తనాలకు ఏకంగా వంద శాతం సబ్సిడీని సైతం వర్తింపజేస్తున్నామని ఆయన ప్రకటించారు. నూనెగింజల విత్తనాల కొనుగోలు కోసం ప్రభుత్వం రూ.49.35 కోట్లను కేటాయించగా, అందులో ఇప్పటికే రూ.34.55 కోట్లను విడుదల చేశామని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 52,425 ఎకరాలకు సరిపడా 29,375 క్వింటాళ్ల నూనెగింజల విత్తనాలను ధ్రువీకరించినట్లు చెప్పారు. ఇందులో భాగంగా రూ.36.76 కోట్ల సబ్సిడీతో వేరుశనగ, కుసుమ, పొద్దుతిరుగుడు, నువ్వుల విత్తనాలను రైతులకు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఇక పప్పుధాన్యాల సాగును మరింత ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రూ.34.60 కోట్లను ప్రత్యేకంగా కేటాయించిందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 21 జిల్లాలకు చెందిన రైతులకు 29,008 క్వింటాళ్ల శనగ, మినుము, పెసర విత్తనాలను సబ్సిడీపై పంపిణీ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు.