క్రిప్టోపై అప్రమత్తత.. సాంకేతికతకు మద్దతు.
• క్రిప్టోతో ద్రవ్య వ్యవస్థపై ప్రభావం ఉండొచ్చు.
• ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా.
న్యూఢిల్లీ, మహా.
క్రిప్టోకరెన్సీల విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పటికీ అప్రమత్తంగానే ఉందని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. అయితే క్రిప్టోకరెన్సీల వెనుక ఉన్న సాంకేతికతలను వినియోగించుకోవడంపై ఎలాంటి వ్యతిరేకత లేదని స్పష్టం చేశారు. ముఖ్యంగా డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ టెక్నాలజీ, టోకెనైజేషన్ వంటి సాంకేతికతలకు భారత్ మద్దతు ఇస్తోందని పేర్కొన్నారు.
న్యూఢిల్లీలో జరిగిన కౌటిల్య ఆర్థిక సదస్సులో మాట్లాడిన సంజయ్ మల్హోత్రా.. క్రిప్టోకరెన్సీల వినియోగం దేశ ద్రవ్య వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం ఉందని వివరించారు. ముఖ్యంగా ద్రవ్య విధానం, అంతర్జాతీయంగా నగదు ప్రవాహాలపై క్రిప్టో ఆస్తులు ప్రభావం చూపే అవకాశాలు ఉన్నందున ఆర్బీఐ అప్రమత్తంగా వ్యవహరిస్తోందని తెలిపారు. దేశంలో ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి డబ్బు బదిలీ చేయడానికి క్రిప్టోకరెన్సీల అవసరం పెద్దగా కనిపించడం లేదని గవర్నర్ పేర్కొన్నారు. భారత్లో దేశీయ డిజిటల్ చెల్లింపులు ఇప్పటికే వేగంగా, తక్కువ వ్యయంతో జరుగుతున్నాయని తెలిపారు. అంతర్జాతీయ సరిహద్దులు దాటి డబ్బు పంపడం, స్వీకరించడం విషయంలోనే అసలు సవాలు ఉందని సంజయ్ మల్హోత్రా తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర బ్యాంకు డిజిటల్ కరెన్సీలు వంటి ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకునే అవకాశం ఉందని చెప్పారు. క్రిప్టోకరెన్సీలను, వాటి వెనుక పనిచేసే సాంకేతికతను ఒకే కోణంలో చూడకూడదని ఆర్బీఐ గవర్నర్ స్పష్టం చేశారు. క్రిప్టో ఆస్తులకు ఆధారంగా ఉపయోగించే డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ టెక్నాలజీ, టోకెనైజేషన్ వంటి సాంకేతికతలను మరింత అభివృద్ధి చేయడాన్ని భారత్ ప్రోత్సహిస్తోందని తెలిపారు.
డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ టెక్నాలజీ, టోకెనైజేషన్ వంటి విధానాల్లోని అవకాశాలను భారత్ పరిశీలిస్తోందని సంజయ్ మల్హోత్రా తెలిపారు. వీటిలో కొన్ని సాంకేతికతలు ఇప్పటికే కేంద్ర బ్యాంకు పరిధిలోనూ, ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్య విధానంలోనూ ఉపయోగిస్తున్నట్లు వెల్లడించారు. దీంతో క్రిప్టో ఆస్తుల విషయంలో అప్రమత్త వైఖరిని కొనసాగిస్తూనే, వాటి వెనుక ఉన్న ఉపయోగకరమైన సాంకేతికతలను అభివృద్ధి చేసుకునే విధానాన్ని భారత్ అనుసరిస్తున్నట్లు ఆయన వ్యాఖ్యలు స్పష్టం చేశాయి.







