Mahaa Daily Exclusive

  ఆనాటి కరెంట్ కోతల రోజులను తిరిగితెచ్చారు…

Share

ఆనాటి కరెంట్ కోతల రోజులను తిరిగితెచ్చారు.
• 6 గంటల నాణ్యమైన కరెంట్ కూడా ఇవ్వలేకపోతున్నారు.
• బిఆర్ఎస్ మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు.

హైదరాబాద్, మహా.

రాష్ట్రంలో ఉచిత, నాణ్యమైన విద్యుత్ అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని హరీశ్ రావు విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలోని మంచి రోజులను తిరిగి తీసుకొస్తానని చెప్పారని, అయితే ఇప్పుడు చీకటి రోజులు, విద్యుత్ కోతలు పునరావృతమయ్యాయని ఆయన ఎక్స్ వేదికగా విమర్శించారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా చేయడం పక్కన పెడితే, కనీసం రోజుకు 6 గంటల నాణ్యమైన విద్యుత్ కూడా ఇవ్వలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని హరీశ్ రావు ఆరోపించారు. విద్యుత్ సరఫరాలో ఇబ్బందుల కారణంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. వర్షాభావం లేదా ఎల్‌నినో పరిస్థితులను సాకుగా చూపి ప్రభుత్వం తన బాధ్యతల నుంచి తప్పుకోవాలని చూస్తోందని హరీశ్ రావు ఆరోపించారు. నీళ్లు, కరెంట్ అందక పొలాల్లో పంటలు ఎండిపోతుంటే రైతుల వేదనను ఎవరు పట్టించుకుంటారని ప్రశ్నించారు. విద్యుత్ కోతలకు నిరసనగా మెదక్ జిల్లా రామాయంపేట సబ్‌స్టేషన్ ముందు రైతులు రోడ్డెక్కి ధర్నాకు దిగాల్సిన పరిస్థితి ఏర్పడిందని హరీశ్ రావు తెలిపారు. విద్యుత్ సరఫరా సమస్యలపై రైతులు ఆందోళనకు దిగడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని ఆయన ఆరోపించారు.
రేవంత్ రెడ్డి గారూ.. పరిపాలన అంటే కేవలం మైకుల ముందు నిలబడి ఉపన్యాసాలు దంచడం కాదు.. కష్టాల్లో ఉన్న అన్నదాతకు అండగా నిలవడం’’ అని హరీశ్ రావు ఘాటుగా వ్యాఖ్యానించారు. రైతుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు సాగునీరు, నాణ్యమైన విద్యుత్ అందించాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. పంటలు ఎండిపోకుండా రైతాంగానికి అవసరమైన సహకారం అందించాలని కోరారు. విద్యుత్ సరఫరాపై రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.