ఫిబ్రవరి 3న అమరావతి నుంచే తొలి క్వాంటమ్ కంప్యూటర్.
* అమరావతిని క్వాంటమ్ వ్యాలీగా తీర్చిదిద్దుతాం.
* ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.
విజయవాడ, మహా.
అమరావతిని క్వాంటమ్ వ్యాలీగా తీర్చిదిద్దాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. శనివారం అంబేడ్కర్ కళావేదికలో జరిగిన పాన్ ఐఐటీ ఏపీ సమ్మిట్ 2026లో ముఖ్యమంత్రి, వివిధ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు.. భారతదేశంలో క్వాంటమ్ సాంకేతికత గురించి ఎవరైనా ప్రస్తావించినప్పుడు అమరావతి గుర్తుకు వచ్చేలా నగరాన్ని అభివృద్ధి చేయాలని తన ఆకాంక్షను వెల్లడించారు. తాను ఐటీ రంగాన్ని ప్రారంభించే సమయంలో పలువురు తనను ఎగతాళి చేశారని చంద్రబాబు గుర్తుచేశారు. పరిజ్ఞానం లేని సమాజంలో సెల్‌ఫోన్ల గురించి మాట్లాడుతున్నారని కొందరు వ్యాఖ్యానించారని తెలిపారు. అయితే గత 25 సంవత్సరాల్లో ఐటీ రంగంలో తెలుగు వారు సాధించిన ప్రగతి తమ ట్రాక్ రికార్డుగా నిలిచిందని చెప్పారు. ప్రస్తుతం ఐటీ నుంచి కృత్రిమ మేధ, క్వాంటమ్ సాంకేతికత వైపు అడుగులు వేయాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఐటీ సాంకేతిక రంగంలో భారతీయుల్లో 33 శాతం నుంచి 35 శాతం వరకు తెలుగు వారు ఉన్నారని చంద్రబాబు తెలిపారు. ఇది తెలుగు వారి ఐటీ రంగ బలానికి నిదర్శనమని పేర్కొన్నారు. గతంలో సిలికాన్ వ్యాలీ గురించి మాట్లాడుకున్నామని, ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ గురించి మాట్లాడాల్సిన సమయం వచ్చిందని అన్నారు. ఆ క్వాంటమ్ వ్యాలీ అమరావతి కావాలన్నదే తన ఆకాంక్ష అని స్పష్టం చేశారు.
ఫిబ్రవరి 3న తొలి క్వాంటమ్ కంప్యూటర్
క్వాంటమ్ కంప్యూటింగ్‌ను భారత్‌కు తీసుకురావాలన్న ప్రతిపాదన నేపథ్యంలో ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ కామకోటి తనకు ఫోన్ చేసిన విషయాన్ని చంద్రబాబు వివరించారు. అనంతరం భారత ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపినట్లు చెప్పారు. రాష్ట్రానికి సంబంధించిన ప్రత్యామ్నాయాలపై చర్చలు జరిగిన తరువాత ఐ బి యం తో పాటు టీసీఎస్, ఎల్‌అండ్‌టీతో చర్చించి ముగ్గురు భాగస్వాములతో కలిసి ముందుకు వెళ్లినట్లు తెలిపారు. ఈ భాగస్వామ్యంతో అమరావతికి క్వాంటమ్ కంప్యూటింగ్ తీసుకురావాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఫిబ్రవరి 3న తొలి క్వాంటమ్ కంప్యూటర్ అమరావతి నుంచి పనిచేయడం ప్రారంభిస్తుందని ప్రకటించారు.
అమరావతిలోనే తయారు చేసిన ఐదు క్వాంటమ్ వ్యవస్థలను ప్రారంభిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. వాటికి క్యూశివ అనే పేరు పెట్టినట్లు చెప్పారు. హార్డ్‌వేర్, సమీకరణ, ధ్రువీకరణ, నిర్మాణ రూపకల్పనకు సంబంధించిన క్వాంటమ్ వ్యవస్థలను అమరావతిలోనే అభివృద్ధి చేసే సామర్థ్యాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. అమెరికాలోని సంస్థ నుంచి క్వాంటమ్ కంప్యూటర్‌ను తీసుకురావడంతో పాటు, మనమే ఎందుకు తయారు చేయకూడదన్న ఆలోచనతో ముందుకు వెళ్లినట్లు చంద్రబాబు తెలిపారు. భాగస్వాములు, ఇతర సాంకేతిక సంస్థలను కలుపుకుని క్వాంటమ్ సాంకేతికతకు సంబంధించిన పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. మేధా టవర్స్‌లో క్యూశివకు సంబంధించిన ఐదు వ్యవస్థలు సిద్ధమైనట్లు పేర్కొన్నారు. రెండేళ్ల వ్యవధిలో అమరావతి నుంచే క్వాంటమ్ కంప్యూటర్లను పూర్తిస్థాయిలో తయారు చేసే స్థాయికి చేరుకోవచ్చని తెలిపారు. భవిష్యత్తులో దేశంలోని అవసరాలకు సరఫరా చేయడంతో పాటు, క్వాంటమ్ కంప్యూటర్లను ఎగుమతి చేసే అవకాశం కూడా ఉంటుందని చంద్రబాబు పేర్కొన్నారు.








