Mahaa Daily Exclusive

  నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టప్రకారం చర్యలు…

Share

  • నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టప్రకారం చర్యలు
  • వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

వరంగల్, కలెక్టరేట్ మహా ;

వరంగల్ జిల్లాలో ప్రైవేట్ క్లినిక్స్‌, ఆస్పత్రులు క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ యాక్ట్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద సూచించారు. రిజిస్ట్రేషన్ లేకుండా నిర్వహించే ఆసుపత్రులు, క్లినిక్స్, డయాగ్నస్టిక్ కేంద్రాల పై నోటీసులు జారీ చేసి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

కలెక్టరేట్‌లో శనివారం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన తెలంగాణ క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ యాక్ట్ జిల్లా రిజిస్ట్రేషన్ అథారిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లాలో క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ రిజిస్ట్రేషన్లు, రెన్యువల్స్, నిబంధనల అమలు పై డీఎంహెచ్‌ఓ డాక్టర్ బి. రాజా రెడ్డి నివేదిక సమర్పించారు.
కొత్త రిజిస్ట్రేషన్, రెన్యువల్ కోసం వచ్చిన దరఖాస్తులను కమిటీ పరిశీలించింది. నిబంధనలు పాటిస్తున్న సంస్థలకు అనుమతులు మంజూరు చేయగా, ఫైర్ సేఫ్టీ తదితర అంశాల్లో లోపాలు ఉన్న సంస్థలకు వాటిని సరిచేసుకునేందుకు అవకాశం కల్పించాలని నిర్ణయించారు.

ఆసుపత్రులు, క్లినిక్స్‌ లో వైద్యులు, సిబ్బంది, రిజిస్ట్రేషన్ వివరాలు, అందించే వైద్య సేవలు, ఫీజుల వివరాలను రోగులకు స్పష్టంగా కనిపించేలా ప్రదర్శించాలని అధికారులు సూచించారు. బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ, రికార్డుల నిర్వహణ, ఫైర్ సేఫ్టీ తదితర నిబంధనలను కూడా తప్పనిసరిగా పాటించాలని తెలిపారు.

ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ వై.వి. గణేష్, డీసీపీ కవిత, డీఎంహెచ్‌ఓ డాక్టర్ బి. రాజా రెడ్డి, ఐఎంఏ ప్రతినిధి డాక్టర్ వెంకటస్వామి, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ రాజమౌళి, ఫైర్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.