- ఆస్పత్రుల నిర్మాణాల వేగం పెంచండి
- ఉస్మానియా, వరంగల్, ఎల్బీనగర్, అల్వాల్ టిమ్స్ నిర్మాణ పనులపై సీఎం రేవంత్ రెడ్డి
- కొత్త ఆస్పత్రుల్లో మౌలిక సౌకర్యాలపై ఇప్పటి నుంచే దృష్టి పెట్టాలని ఆదేశం
- కలెక్టర్లు టూర్లు చేయాల్సిందేనని మరోసారి స్పష్టం
- గ్లోబల్ సమ్మిటి ఏర్పాట్లపై పలు సూచనలు చేసిన సీఎం
హైదరాబాద్, మహా : రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రుల పనులను వేగవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఉస్మానియా, వరంగల్ సూపర్ స్పెషాలిటీ, ఎల్బీనగర్, అల్వాల్ టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణ పురోగతిని శనివారం సమీక్షించిన సీఎం ఆసుపత్రులు పూర్తయ్యే సమయానికి డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది అందుబాటులో ఉండేలా నియామక ప్రక్రియను ముందుగానే ప్రారంభించాలని సూచించారు. అత్యాధునిక వైద్య పరికరాల కొనుగోళ్లను కూడా వేగవంతం చేయాలని చెప్పారు.
జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో సీఎంవో అధికారులతో నిర్వహించిన సమీక్షలో విద్య, వైద్యం, సీజనల్ వ్యాధులు, ఫ్యూచర్ సిటీ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై సీఎం రేవంత్ రెడ్డి పలు సూచనలు చేశారు.
ఉస్మానియా ఆస్పత్రి, వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, ఎల్బీనగర్ టిమ్స్ , అల్వాల్ టిమ్స్ ఆస్పత్రుల నిర్మాణ పనుల పురోగతిని సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్ణీత గడువులోగా పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులు వేగంగా సాగాలని గతంలోనూ సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. నిధులు అందుబాటులో ఉన్నప్పటికీ పనుల్లో జాప్యం జరుగుతుండటంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన.. పనులు 24 గంటలూ కొనసాగించాలని, క్షేత్రస్థాయిలో ప్రతిరోజూ పర్యవేక్షణ ఉండాలని సూచించారు. కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్య ప్రాజెక్టుగా చేపట్టింది. ఆధునిక వైద్య సేవలకు అనుగుణంగా బిల్డింగ్, ల్యాబొరేటరీలు, ఇతర మౌలిక వసతులను రూపొందించడంతో పాటు అత్యాధునిక వైద్య పరికరాలను ముందుగానే సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గత సమీక్షల్లో ఆదేశించారు. ఆసుపత్రుల నిర్మాణం పూర్తయ్యే సమయానికి వైద్య సేవలు వెంటనే ప్రారంభమయ్యేలా ఇప్పటి నుంచే ప్రణాళిక సిద్ధం చేయాలని రేవంత్ రెడ్డి సూచించారు. అవసరమైన వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, ఇతర ఉద్యోగుల సంఖ్యను గుర్తించి నియామక ప్రక్రియను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.
అదేవిధంగా కొత్త ఆసుపత్రులకు అవసరమైన అత్యాధునిక వైద్య పరికరాల కొనుగోలు ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని సీఎం చెప్పారు. భవనాలు పూర్తయిన తర్వాత పరికరాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి రాకుండా ముందుగానే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఉస్మానియా, వరంగల్ టిమ్స్, అల్వాల్ టిమ్స్ , ఎల్బీనగర్ టిమ్స్, సనత్‌నగర్ టిమ్స్, నిమ్స్ వంటి ఆసుపత్రుల ద్వారా పెద్ద ఎత్తున పడకల సామర్థ్యాన్ని పెంచే ప్రణాళికతో ముందుకెళ్తోంది. సుమారు రూ.10 వేల కోట్ల పెట్టుబడితో 10 వేల పడకల సామర్థ్యాన్ని పెంచే ఆసుపత్రుల నిర్మాణం చేపడుతున్నట్లు రేవంత్ రెడ్డి గతంలో వెల్లడించారు. జిల్లా కలెక్టర్లు కేవలం కేవలం ఆఫీసులకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించాలని సీఎం సూచించారు. ప్రభుత్వ పాఠశాలలు, సాంఘిక సంక్షేమ హాస్టళ్లు, ప్రభుత్వ ఆసుపత్రులను అధికారులు తప్పనిసరిగా సందర్శించి అక్కడి పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించాలని ఆదేశించారు. ప్రతి జిల్లాలో విద్య, వైద్య రంగాల పరిస్థితిపై వారానికి ఒకసారి సమీక్ష నిర్వహించాలని, పాఠశాలల్లో అవసరమైన చోట మరమ్మతు పనులను వెంటనే చేపట్టాలని చెప్పారు. ప్రస్తుత సీజన్‌లో వచ్చే సీజనల్ వ్యాధులపై వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ముందస్తు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.
విద్య, వైద్య రంగాల సమీక్షతో పాటు డిసెంబరులో భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026 ఏర్పాట్లపైనా సీఎం అధికారులతో చర్చించారు. సమ్మిట్‌కు వచ్చే అతిథులు, పెట్టుబడులు, ఇతర ఏర్పాట్ల విషయంలో పకడ్బందీ ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. సమ్మిట్‌కు సంబంధించిన ఏర్పాట్లను త్వరలో తానే క్షేత్రస్థాయిలో పరిశీలిస్తానన్నారు. రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు, పారిశ్రామిక అవకాశాలు, అంతర్జాతీయ స్థాయి భాగస్వామ్యాలను దృష్టిలో పెట్టుకుని అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని అధికారులకు సూచించారు.








