Mahaa Daily Exclusive

  నాలుగు రాష్ట్రాల్లో బ్యాలెట్ తో ఎన్నికలకు సిద్ధమా?

Share

  • నాలుగు రాష్ట్రాల్లో బ్యాలెట్ తో ఎన్నికలకు సిద్ధమా?
  • ఇండీ కూటమికి జనాదరణ లేదు
  • సర్ వల్లే గెలిచామని కాంగ్రెస్ నేత రమేశ్ చెన్నితల చెప్పారు
  • మచ్చార్ ధైర్య సాహసాలపై తెలిసినా స్పందించిన వాళ్లంతా దేశద్రోహులే
  • హిందూ ఆలయాలపై దాడి చేసిన వాళ్లకు పిచ్చోడని ముద్ర వేయడం ప్రభుత్వానికి అలవాటైంది
  • కేంద్ర మంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్

హైదరాబాద్, మహా : కేంద్ర ఎన్నికల కమిషన్ పైన, ఈవీఎం యంత్రాలపై పదేపదే ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సవాల్ విసిరారు. ‘‘ఈవీఎంల వల్లే కాంగ్రెస్ పార్టీ కేరళ, తెలంగాణ, కర్నాటక, హిమాచల్ ప్రదేశ రాష్ట్రాల్లో గెలిచింది కదా? మరి ఆ నాలుగు రాష్ట్రాల సీఎంలు రాజీనామా చేసి కాంగ్రెస్ ప్రభుత్వాలను రద్దు చేసి బ్యాలెట్ పేపర్లతో మళ్లీ ఎన్నికల్లోకి వెళ్లేందుకు సిద్దమా? పదేపదే ఈవీఎంల గురించి, సర్ గురించి మాట్లాడుతున్న కాంగ్రెస్ నేతలు దమ్ముంటే నా సవాల్ ను స్వీకరించాలి’’అని అన్నారు. ప్రపంచమంతా కెప్టెన్ స్మిత్ మచ్చార్ ధైర్య సాహసాలను కొనియాడతుంటే రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ నేతలు కనీసం స్పందించకపోవడం సిగ్గు చేటన్నారు. స్మిత్ మచ్చార్ పై దాడి చేసిన వ్యక్తి సామాజికవర్గం ఓట్లు పోతాయోననే భయంతోనే కాంగ్రెస్ నేతలు నోరు మెదపడం లేదన్నారు. స్మిత్ మచ్చార్ సాహసం, తెగువ తెలిసినా స్పందించని వాళ్లంతా దేశద్రోహులు, దిమాగీ నక్సల్సేనని అన్నారు. శనివారం సాయంత్రం హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి విచ్చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ బీజేపీ నేతలు డాక్టర్ మనోహర్ రెడ్డి, సంగప్ప, శ్రీవర్దన్ రెడ్డి తదితరులతో కలిసి మీడియాతో మాట్లాడారు.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు రాత్రి తెలంగాణకు రావాల్సి ఉన్నప్పటకీ అనివార్య కారణాలవల్ల ఆయన పర్యటన వాయిదా పడిందన్నారు. దిల్ సుఖ్ నగర్ లో సంతోషీమాత దేవాలయంలో దాడి హేయనీయమన్నారు. హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. దాడి చేసిన వాళ్లపై చర్యలు తీసుకుంటే ఈ పరిస్థితి ఉండేది కాదని, దాడి చేసిన మతం వాళ్లు బాధపడతారనే కారణంతో ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ప్రజలు ప్రశ్నిస్తే… దాడి చేసినోడిని పిచ్చోడిగా చిత్రీకరించడం ప్రభుత్వానికి అలవాటైందంటూ పిచ్చోడికి మందిర్, మసీదు అనే తేడా తెలియదు కానీ మందిరాలపైనే ఎందుకు దాడి చేస్తున్నారన్నది ప్రభుత్వం చెప్పాలన్నారు. హిందువులు ధీటుగా స్పందించకపోవడంవల్లే ఈ దుస్థితి ఏర్పడిందని, ప్రభుత్వం పద్దతి మార్చుకుని దాడి చేసిన వాళ్లపై కఠినాతికఠినంగా వ్యవహరించాలన్నారు. లేకపోతే యువత రోడ్లపైకి వచ్చి తిరగబడితే వాళ్లను ఆపే పరిస్థితి ఉండదని హెచ్చరించారు. ఆలయాలపై దాడుల ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావ్రుతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

సీఈసీ జ్ఝానేశ్ కుమార్ కు, బీజేపీకి సంబంధం లేదని, ఆయన ఎన్డీఏ మంత్రి కాదన్నారు. సీఈసీ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన వ్యవస్థ అన్నారు. ఇండీ కూటమికి జనాదరణ లేదని, వాళ్ల ఆందోళన కార్యక్రమాలకు పట్టుమని పది మంది కూడా రావడం లేదన్నారు. ముంబై, ఢిల్లీలో జరిగిన ఆందోళనలకు జనం పెద్దగా రాకపోవడమే నిదర్శనమని చెప్పారు. సర్ ప్రక్రియలో భాగంగా సీపీఎం దొంగ ఓట్లను తొలగించడంవల్లే కేరళలో అధికారంలోకి వచ్చామని కాంగ్రెస్ నేత రమేశ్ చెన్నితల చెప్పారంటూ దీనికి కాంగ్రెస్ నేతలు ఏమంటారని ప్రశ్నించారు. ఈవీఎంలపై ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస నేతలకు సవాల్ విసురుతున్నా. కాంగ్రెస్ పాలిత సీఎంలతో రాజీనామా చేయించి మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయించండి. బ్యాలెట్ తో ఎన్నికల్లోకి వెళదాం. ఎవరు గెలుస్తారో చూద్దామన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ దొందూ దొందేనని, బీఆర్ఎస్ అవినీతిపై కాంగ్రెస్ విచారణ జరిపి చర్యలు తీసుకోదు, కాంగ్రెస్ 6 గ్యారంటీల అమలుపై బీఆర్ఎస్ పోరాడదన్నారు. కాంగ్రెస్ కు నిజాయితీ ఉంటే .బీఆర్ఎస్ నేతల అవినీతిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ 6 గ్యారంటీలపై ఉద్యమాలు ఎందుకు చేయడం లేదో ప్రజలకు చెప్పాలన్నారు. కేసీఆర్ కుటుంబానికి పూర్వమే చింతమడకలో వందల ఎకరాలున్నాయనడం పెద్ద జోక్ అని, నాడు వాళ్లకు అసలు హైదరాబాద్ లో అసలు ఇల్లే లేదన్నారు. అధికారంలోకి వచ్చాకే ఇన్ని హోటళ్లు, ఆస్తులు ఎట్లా వచ్చాయని ప్రశ్నించారు. టీచర్లు, గ్రాడ్యుయేట్లు, నిరుద్యోగ యువత అంతా బీజేపీ పక్షానే ఉందని, గతంలో రెండు ఎమ్మెల్సీ సీట్లను బీజేపీ కైవసం చేసుకోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశామని, ప్రజల్లో బీజేపీకి సానుకూలత ఉంది. ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లోనూ బీజేపీ గెలుపు తథ్యమన్న ధీమా వ్యక్తం చేశారు.