- ‘హిజాబ్ తీయాలా, గడ్డం కత్తిరించాలా అనేది మీ ఇష్టం’
- ముస్లిం యువతకు ఓవైసీ కీలక సూచనలు
- అభిప్రాయాలను నిర్భయంగా వెల్లడించాలని సూచన
హైదరాబాద్, మహా : ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. యువత, ముఖ్యంగా అమ్మాయిలు తమ అభిప్రాయాలను ధైర్యంగా వ్యక్తం చేయాలని హితవు పలికారు. హిజాబ్ తీయాలా వద్దా.. గడ్డం కత్తిరించాలా లేదా అనేది వారి ఇష్టమని ముస్లిం యువతీయువకులకు సూచించారు. అంతేకాకుండా విద్యతో పాటు తమ హక్కులు, వ్యక్తిగత నిర్ణయాల విషయంలో ఎవరూ వెనక్కి తగ్గొద్దని చెప్పారు. హిజాబ్ ధరించడం మహిళల ఇష్టమని తేల్చి చెప్పారు. మహిళలు హిజాబ్ వేసుకోవాలా వద్దా.. యువకులు గడ్డం కత్తిరించాలా వద్దా అని ఎవరూ ఆదేశించలేరని పేర్కొన్నారు. విద్యార్థులతో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న అక్బరుద్దీన్ ఓవైసీ.. తన విద్యాభ్యాసం గురించి ప్రస్తావించారు. తాను 12వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నానని చెప్పారు. అయితే అసెంబ్లీలో తాను భయపడకుండా, స్పష్టంగా తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తానని తెలిపారు. తాను చెప్పే విషయాలకు అప్పటి ముఖ్యమంత్రులు కూడా స్పందించాల్సి వచ్చేదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా యువత కూడా భయపడకుండా తమ అభిప్రాయాలను చెప్పాలని సూచించారు.
జెన్‌జీని ప్రస్తావిస్తూ ప్రస్తుతం ప్రపంచం ధైర్యంగా, స్పష్టంగా మాట్లాడే యువత గురించి చర్చిస్తోందని అక్బరుద్దీన్ ఓవైసీ తెలిపారు. నిజమని నమ్మిన విషయాన్ని చెప్పేందుకు భయపడాల్సిన అవసరం లేదని సూచించారు. తన ప్రసంగంలో అక్బరుద్దీన్ ఓవైసీ వ్యక్తిగత నమ్మకాలు, సూత్రాల గురించి కూడా మాట్లాడారు. ఎమ్మెల్యేను, మంత్రిని, ప్రధానమంత్రిని సంతోషపెట్టేందుకు పనిచేయకూడదని పేర్కొన్నారు. పనిచేయాల్సి వస్తే అల్లాను సంతోషపెట్టేలా పనిచేయాలని హితవు పలికారు. తన గురించి అవతలి వ్యక్తులు ఏం అనుకుంటున్నారనే విషయాన్ని తాను పట్టించుకోనని అసదుద్దీన్ ఓవైసీ చెప్పారు. తన గౌరవాన్ని దెబ్బతీసేందుకు, తనను అవమానించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. హిజాబ్ విషయంపైనా అక్బరుద్దీన్ ఓవైసీ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. హిజాబ్ ధరించినందుకు ఎవరినీ చూసి భయపడాల్సిన అవసరం లేదని.. అది మహిళ వ్యక్తిగత ఎంపిక అని పేర్కొన్నారు.
మహిళలు విద్యను అందిపుచ్చుకుని ప్రపంచంలో ముందుకు వెళ్లాలని అక్బరుద్దీన్ ఓవైసీ పిలుపునిచ్చారు. తండ్రిగా, సోదరుడిగా, కుమారుడిగా మహిళల హక్కుల కోసం తాను అండగా ఉంటానని పేర్కొన్నారు. తన గౌరవం, ప్రతిష్ఠపై కూడా అక్బరుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. తనను అవమానించేందుకు, తన పరువు తీసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని.. అలాంటి ప్రయత్నాలకు తాను భయపడబోనని స్పష్టం చేశారు. తన గౌరవాన్ని అల్లా కాపాడతాడని.. తాను ఎవరి గురించి పట్టించుకోనని అక్బరుద్దీన్ ఓవైసీ తేల్చి చెప్పారు. అవసరమైతే అజ్ఞాతంగా జీవించడానికి సిద్ధంగా ఉన్నానని.. అడవుల్లో తిరగాల్సి వచ్చినా.. ఆకులు తింటూ బతకాల్సి వచ్చినా ఎవరి ముందు తలవంచబోనని పేర్కొన్నారు. అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. ముఖ్యంగా యువత ధైర్యంగా మాట్లాడాలన్న ఆయన పిలుపుతో పాటు హిజాబ్, మహిళల విద్యపై చేసిన వ్యాఖ్యలు ప్రధానంగా ప్రస్తావనకు వస్తున్నాయి.








