- తొమ్మిది రోజులు బతుకమ్మ వేడుకలు
- ఈనెల 10 వ తేదీనుండి 18 వ తేదీ వరకు ఘనంగా నిర్వహణ
- 18 న ట్యాంక్ బండ్ పై సద్దుల బతుకమ్మ
- వేడుకల ఏర్పాట్లపై సి.ఎస్ సంజయ జాజు సమీక్ష
హైదరాబాద్, మహా : తెలంగాణా సంస్కృతికి ప్రత్యేకంగా నిలిచిన బతుకమ్మ పండగను ఈనెల 10 వ తేదీనుండి 18 వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు వెల్లడించారు. తొమ్మిది రోజుల పాటు నిర్వహించే బతుకమ్మ వేడుకల ఏర్పాట్లపై శనివారం సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల కార్యదర్శులు, పోలీస్ అధికారులు హాజయ్యారు. ఈ సందర్భంగా సిఎస్ ఈనెల 18 వ తేదీన సద్దుల బతుకమ్మ ను పురస్కరించుకొని ట్యాంక్ బండ్ పై వేలాది మంది మహిళలచే సద్దుల బతుకమ్మ ఉత్సవాన్ని అత్యంత వైభంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 18వ తేదీ సాయంత్రం 4 గంటలకు సచివాలయం ఎదురుగాగల అమరవీరుల స్మారక కేంద్రం నుండి వేలాది మంది మహిళలు బతుకమ్మలతో ఊరేగింపుగా వచ్చి ట్యాంక్ బండ్ పైకి చేరుకుంటారని, వీరితోపాటు వందలాది మంది కళాకారులు తమ కళారూపాలతో ర్యాలీగా వస్తారని వివరించారు. ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేసే ప్రత్యేక వేదిక వద్ద జరిగే ఈ బతుకమ్మ ఉత్సవాలకు ప్రజాప్రతినిధులు హాజరవుతారని అన్నారు.
ఈ ఉత్సవాలను పురస్కరించుకొని పండగ శోభ వచ్చేలా నగరంలోని ప్రధాన కూడళ్లలో బతుకమ్మలను ఏర్పాటు చేయడమే కాకుండా పలు జంక్షన్ల కేంద్రాల వద్ద విధ్యుత్ దీపాలతో అలంకరించాలని ఆదేశించారు. నగరంలోని అన్ని ప్రధాన కార్యాలయాలను కూడా విద్యుత్ దీపాలతో అలంకరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ట్యాంక్ బండ్ పై బతుకమ్మ ఆడేందుకు సమీపంలోని వాడలు, కాలనీలు, బస్తీల నుండి పెద్ద ఎత్తున మహిళలు వచ్చే అవకాశమున్నందున వారికి ఏవిధమైన ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అదేవిధంగా, ట్యాంక్ బండ్ చిల్డ్రన్స్ పార్క్ లో ఉన్న బతుకమ్మ ఘాట్ తోపాటు నెక్లెస్ రోడ్డులో బతుకమ్మ ల నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని హెచ్ఎండీఏ, జీహెచ్ ఎంసీ అధికారులను సిఎస్ ఆదేశించారు. సాయంత్రం 5 నుండి రాత్రి 10 గంటల మధ్య ట్యాంకు బండ్ పై బతుకమ్మ ఉత్సవాలు జరుగుతున్నందున ట్రాఫిక్ డైవర్షన్, బారికేడింగ్, కనీస సౌకర్యాల ఏర్పాట్లను చేపట్టాలని తెలిపారు. అమరవీరుల స్మారక కేంద్రం నుండి ట్యాంక్ బండ్ వరకు ప్రత్యేకంగా బారికేడింగ్, లైటింగ్ సౌకర్యాలను కల్పించాలని సూచించారు. బతుకమ్మ జరిగే పది రోజుల పాటు రవీంద్ర భారతిలో బతుకమ్మ ఉత్సవాలను నిర్వహిస్తున్నందున అక్కడ కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టాలని అన్నారు. రాష్ట్రంలోని అన్ని టూరిజం కేంద్రాలు, ప్రముఖ ప్రాంతాల్లోనూ బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించాలని అన్నారు.
బతుకమ్మ ఉత్సవాలను ప్రతిబింబించేలా ఈసారి ప్రత్యేక లోగోను రూపొందిస్తున్నామని వెల్లడించారు. డిసెంబర్ లో జరుగనున్న తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ను కూడా ఈ లోగోలో తెలియచేసే విధంగా రూపొందించనున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి వాణి ప్రసాద్, హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్, పంచాయితీ రాజ్ కమిషనర్ దివ్య, జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్.వి.కర్ణన్, ఆర్టీసీ ఎం.డి. నాగిరెడ్డి, మల్కాజిగిరి సీపీ బి.సుమతి, జాయింట్ పోలీస్ కమిషనర్ (ట్రాఫిక్), హైదరాబాద్ జోయెల్ డేవిస్, స్పెషల్ కమిషనర్, సమాచార పౌర సంబంధాల శాఖ ముకుంద రెడ్డి, హార్టికల్చర్ కమిషనర్ షేక్ యాస్మీన్ బాషా, జలమండలి ఎండీ అశోక్ రెడ్డి, టూరిజం డైరెక్టర్ రంజిత్ నాయక్, శిల్పారామం, సంస్కృతిక శాఖ డైరెక్టర్ ఎ. నర్సింహారెడ్డి, ప్రత్యేక అధికారి కిషన్ రావు తదితరులు పాల్గొన్నారు.








