Mahaa Daily Exclusive

  హైదరాబాద్ సీపీ సజ్జనార్‌కు.. హైకోర్టు ధిక్కరణ నోటీసులు…

Share

 

హైదరాబాద్, మహా : రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్‌కు షాక్ ఇచ్చింది. ఓ కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు, ఈ వ్యవహారంలో వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ ఆయనకు నోటీసులు జారీ చేసింది. తనపై ఎలాంటి ఎఫ్‌ఐఆర్‌ నమోదు లేకపోయినప్పటికీ భవానీనగర్‌ సీఐ, ఎస్సై, ఇతర సిబ్బంది తన చేతులు, కాళ్లు కట్టేసి, కళ్లలో కారం చల్లి తీవ్రంగా కొట్టారని తలాబ్‌కట్ట ప్రాంతానికి చెందిన షానవాజ్‌ ఆలం ఆరోపించారు. ఈ విషయంపై పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు.

బాధితుడి పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ టీ మాధవీదేవి ధర్మాసనం సంబంధిత ఫిర్యాదును మరోసారి పరిశీలించాలని, సీసీటీవీ ఫుటేజ్‌లను చెక్ చేసి, బాధ్యులైన పోలీసులపై తగిన చర్యలు తీసుకోవాలని హైదరాబాద్‌‌ సీపీ సజ్జనార్‌కు ఆదేశాలు జారీ చేసింది. అయితే, కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా కూడా ఉన్నతాధికారులు పోలీసులపై ఎలాంటి విచారణ చేపట్టలేదని, చర్యలు తీసుకోలేదని పేర్కొంటూ షానవాజ్ ఆలం మరొకసారి కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు. తాజాగా ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్‌ మాధవీదేవి ధర్మాసనం సజ్జనార్‌‌ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, హైదరాబాద్ సీపీ సజ్జనార్ కు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది.