*బీఆర్ఎస్ బీసీ సమావేశం రసాభాస
*నాయకులను ఆహ్వానించ లేదన్న వివాదం
*ఇరువర్గాల మధ్య వాగ్వివాదం తోపులాట, దాడులు
పెద్దపల్లి మహా ;
పెద్దపల్లి పట్టణంలోని ఆర్ఆర్ గార్డెన్లో శనివారం నిర్వహించిన బీఆర్ఎస్ బీసీ సమావేశం రసాభాసగా మారింది. బీసీ వర్గాలకు చెందిన పలువురు నాయకులను సమావేశానికి ఆహ్వానించలేదన్న అంశం వివాదానికి దారితీయడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మాటామాటా పెరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారి తోపులాట, ఘర్షణకు దారితీసినట్లు సమాచారం.
సమావేశానికి గంట రాములు యాదవ్, దాసరి ఉష తదితర బీసీ నాయకులను ఆహ్వానించలేదన్న అంశంపై కొందరు నాయకులు, కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. బీసీ నాయకులందరినీ కలుపుకొని సమావేశం నిర్వహించాల్సిన సమయంలో కొందరిని విస్మరించడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం.
ఈ క్రమంలో సమావేశంలో పాల్గొన్న కొందరు నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం ఇరువర్గాలు పరస్పరం తోపులాటకు దిగడంతో కొద్దిసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడినట్లు కూడా సమాచారం. దీంతో సమావేశానికి హాజరైన కార్యకర్తలు, నాయకులు ఆందోళనకు గురయ్యారు.
*నాయకత్వం పై అసంతృప్తి!?*
సమావేశంలో కొందరు బీఆర్ఎస్ బీసీ నాయకులు మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలోని అన్ని వర్గాల నాయకులను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లడం లేదని వారు ఆరోపించినట్లు సమాచారం. పార్టీ కార్యక్రమాల్లో బీసీ నాయకులందరికీ సముచిత ప్రాధాన్యం కల్పించాలని వారు కోరినట్లు తెలిసింది.
అన్ని వర్గాలను కలుపుకొని పార్టీని ముందుకు తీసుకెళ్లకపోవడం వల్లే గత ఎన్నికల్లో పార్టీకి ప్రతికూల ఫలితాలు ఎదురయ్యాయని కొందరు నాయకులు సమావేశంలో వ్యాఖ్యానించినట్లు సమాచారం.
బీసీ ఐక్యతపై చర్చించాల్సిన వేదికలోనే విభేదాలు
బీసీ వర్గాల సమస్యలు, రాజకీయ ప్రాతినిధ్యం, పార్టీ బలోపేతం తదితర అంశాలపై చర్చించాల్సిన సమావేశం నాయకుల మధ్య విభేదాలతో ఉద్రిక్తంగా మారడం చర్చనీయాంశంగా మారింది. బీసీ నాయకులందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చి పార్టీని బలోపేతం చేయాల్సిన సమయంలో అంతర్గత విభేదాలు బహిర్గతం కావడంపై పలువురు కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది.
సమావేశం సందర్భంగా చోటుచేసుకున్న ఘర్షణతో కొంతసేపు ఆర్ఆర్ గార్డెన్ ప్రాంగణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనంతరం నాయకులు, కార్యకర్తలు జోక్యం చేసుకోవడంతో పరిస్థితి సద్దుమణిగినట్లు సమాచారం.
తాజా పరిణామాలతో పెద్దపల్లి బీఆర్ఎస్లో బీసీ నాయకుల మధ్య సమన్వయం, పార్టీ అంతర్గత వ్యవహారాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. సమావేశంలో జరిగిన పరిణామాలపై సంబంధిత నాయకుల పూర్తి స్పందన వెలువడాల్సి ఉంది.
బీఆర్ఎస్లో బీసీలకు ప్రాధాన్యత లేదా!? గంట రాములు యాదవ్, దాసరి ఉష బీసీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి బీసీ నాయకులు, కార్యకర్తలకు సమాచారం ఇవ్వకపోవడంపై వివాదం నెలకొంది. దీనిపై ప్రశ్నించిన కార్యకర్తలపై దాడి జరిగిందని, పలువురికి గాయాలయ్యాయని వారు ఆరోపించారు. గాయపడిన వారిని గంట రాములు దాసరి ఉష ఆసుపత్రి నందు పరామర్శించారు.
ఇది వ్యక్తిగత పార్టీ కాదు.. బీఆర్ఎస్ పార్టీ” అంటూ దాసరి మనోహర్‌రెడ్డిని ఉద్దేశించి బీసీ కార్యకర్తలు ప్రశ్నించారు. సీనియర్ బీసీ నాయకుడు గంట రాములు యాదవ్ పాటు ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలకు కనీస సమాచారం ఇవ్వకపోవడం పై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.








