Mahaa Daily Exclusive

  దుర్మార్గులు.. సన్నాసులు.. గంగిరెద్దుల్లా విమర్శలు….

Share

దుర్మార్గులు.. సన్నాసులు.. గంగిరెద్దుల్లా విమర్శలు.
* చేతనైతే అసెంబ్లీకి రండి.. లెక్కలు తేల్చుకుందాం.
*’పదేళ్ల పాలన.. మా పాలన.. బేరీజు వేసుకోండి.
* సిరిసిల్ల గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం.
* ప్రజలకు చేసిన పనులపై చర్చకు సిద్ధం.
* సిరిసిల్ల గడ్డపై రేవంత్‌ రాజకీయ పంచ్‌లు.

కరీంనగర్,మహా.

వెయ్యి రోజుల పాలనలో అద్భుతమైన పథకాలు అమలు చేస్తుంటే కొందరు దుర్మార్గులు, సన్నాసులు ప్రభుత్వం విఫలమైందని ఊరూరా తిరుగుతున్నారు. గంగిరెద్దుల్లా కాంగ్రెస్‌ పాలనను విమర్శిస్తున్నారు’’ అంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలన.. మా పాలనను బేరీజు వేసుకోండి. రైతు భరోసాపై అసెంబ్లీలో చర్చకు సిద్ధం. ధైర్యముంటే రండి.. లెక్కలు తేల్చుకుందాం’’ అని సవాల్‌ విసిరారు. సిరిసిల్ల, సిద్దిపేట గడ్డపై కాంగ్రెస్‌ జెండా ఎగరేస్తామని ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో పర్యటించారు. మధ్యాహ్నం కరీంనగర్‌కు చేరుకున్న ముఖ్యమంత్రి నూతన సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయాన్ని ప్రారంభించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆ తర్వాత సిరిసిల్లకు చేరుకుని అంబేడ్కర్ చౌరస్తా నుంచి సభా ప్రాంగణం వరకు నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. రగుడు సమీపంలోని సభా ప్రాంగణంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి బహిరంగ సభలో ప్రసంగించారు.

“దుర్మార్గులు.. సన్నాసులు”

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తుంటే కొందరు దుర్మార్గులు, సన్నాసులు ప్రభుత్వం విఫలమైందంటూ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రివర్గం రాజీనామా చేయాలని ఊరూరా తిరుగుతున్నారని, పండుగ సమయంలో గంగిరెద్దుల్లా విమర్శలు చేస్తున్నారని ఘాటుగా వ్యాఖ్యానించారు.

“చేతనైతే అసెంబ్లీకి రండి”

గత పాలనకు, ప్రస్తుత ప్రభుత్వ పాలనకు సంబంధించిన లెక్కలను ప్రజల ముందే తేల్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. గత పాలనలో ఏం చేశారు.. ప్రస్తుత ప్రభుత్వం ఏం చేస్తోంది అనే అంశాలపై అసెంబ్లీ వేదికగా చర్చకు రావాలని సవాల్‌ చేశారు. ప్రజలకు చేసిన పనులు, ఖర్చు చేసిన నిధులు, అమలు చేసిన కార్యక్రమాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.

“పదేళ్లు.. రెండేళ్లు బేరీజు వేసుకోండి”

గత పదేళ్ల పాలనను, తమ ప్రభుత్వ పాలనను ప్రజలు బేరీజు వేసుకోవాలని ముఖ్యమంత్రి కోరారు. గత ప్రభుత్వ హయాంలో అమలైన పథకాలను సైతం కొనసాగిస్తూ.. ప్రజలకు మరింత ప్రయోజనం కలిగేలా తమ ప్రభుత్వం ముందుకు వెళ్తోందని చెప్పారు. ప్రభుత్వ పనితీరుపై విమర్శలు చేసే వారు ప్రజల కోసం తాము చేసిన పనులపై కూడా మాట్లాడాలని అన్నారు.

సిరిసిల్ల గడ్డపై రాజకీయ సవాల్‌

సిరిసిల్ల, సిద్దిపేట ప్రాంతాల్లో కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని రేవంత్‌రెడ్డి గతంలో చేసిన వ్యాఖ్యలను ఈ పర్యటన మరింత రాజకీయ ప్రాధాన్యంతో నిలిపింది. సెప్టెంబరు 5న నకిరేకల్‌లో జరిగిన సభలోనే సిరిసిల్లకు వచ్చి తేల్చుకుంటామని ఆయన ప్రకటించారు. “కాస్కోండి కల్వకుంట్ల కుటుంబమా.. ఈ నెలాఖరుకు సిరిసిల్ల వస్తా” అంటూ సవాల్‌ విసిరారు.

కరీంనగర్‌లో కలెక్టరేట్ ప్రారంభం

బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు కరీంనగర్‌ చేరుకున్న ముఖ్యమంత్రి నూతన సమీకృత కలెక్టరేట్‌ భవన సముదాయాన్ని ప్రారంభించారు. కలెక్టరేట్‌ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించడంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అనంతరం జిల్లా ఉన్నతాధికారులతో సమావేశమై జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుపై సమీక్ష నిర్వహించారు.

సిరిసిల్లలో భారీ బహిరంగ సభ

కరీంనగర్‌ కార్యక్రమాల అనంతరం ముఖ్యమంత్రి సిరిసిల్లకు చేరుకున్నారు. అంబేడ్కర్‌ చౌరస్తా నుంచి రగుడు సమీపంలోని సభా ప్రాంగణం వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ సుమారు రూ.345.78 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. సభ రాత్రి వరకు కొనసాగించేలా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది.

ఉద్యోగులే ప్రభుత్వానికి ముఖచిత్రం

కరీంనగర్‌లో ఉద్యోగుల పాత్రను కూడా ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరవేసే బాధ్యత ఉద్యోగులదేనని అన్నారు. ప్రభుత్వానికి మంచి పేరు వచ్చినా, చెడ్డ పేరు వచ్చినా అందులో ఉద్యోగుల పాత్ర ఉంటుందని పేర్కొన్నారు. ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రభుత్వం రూ.944 కోట్లతో పనులు ప్రారంభించిందని తెలిపారు.

ప్రజల సమస్యలకు తక్షణ పరిష్కారం

ప్రభుత్వ కార్యాలయాలకు సమస్యలతో వచ్చే ప్రజలను కుటుంబ సభ్యులుగా భావించి వారి సమస్యలను పరిష్కరించాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. ముఖ్యంగా పేద ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం కార్యాలయాలకు వచ్చినప్పుడు వారిని తిప్పుకోకుండా తక్షణ పరిష్కారం చూపాలని ఆదేశించారు.

కేంద్రం–రాష్ట్రం కలిసి పనిచేయాలి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర సహకారంతో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో రాజకీయ విభేదాలు సహజమే అయినా, ఎన్నికలు లేని సమయంలో ప్రజల ప్రయోజనాల కోసం కేంద్రం, రాష్ట్రం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు.

సిరిసిల్ల నుంచే రాజకీయ ఘాటు

కరీంనగర్‌లో పాలన, ఉద్యోగులు, సంక్షేమం, అభివృద్ధిపై మాట్లాడిన ముఖ్యమంత్రి.. సిరిసిల్లకు చేరుకున్న తర్వాత రాజకీయ విమర్శలపై తనదైన శైలిలో స్పందించారు. గత పాలనను, ప్రస్తుత పాలనను పోల్చుతూ ప్రజల ముందే లెక్కలు తేల్చుకోవాలన్న సవాల్‌ను ప్రధానంగా ప్రస్తావించారు. సిరిసిల్ల పర్యటనకు ముందే ప్రకటించిన రాజకీయ సవాల్‌కు అనుగుణంగా ఈ పర్యటన సాగింది.