Mahaa Daily Exclusive

  విండీస్‌ విధ్వంసం…

Share

  • విండీస్‌ విధ్వంసం
  • గువాహటిలో పరుగుల వరద..
  • మూడు సెంచరీలతో చెలరేగిన కరేబియన్‌ బ్యాటర్లు

గువాహటి, మహా : వెస్టిండీస్‌ బ్యాటర్లు విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగారు. భారత్‌తో జరుగుతున్న రెండో వన్డేలో కరేబియన్‌ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 405 పరుగుల భారీ స్కోరు చేసింది. వన్డే క్రికెట్‌లో వెస్టిండీస్‌కు ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. టాస్‌ గెలిచిన భారత కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకున్నా.. ఆ నిర్ణయానికి విండీస్‌ బ్యాటర్లు తమ బ్యాట్‌తోనే సమాధానం చెప్పారు. జాన్‌ క్యాంప్‌బెల్‌, షై హోప్‌, అమీర్‌ జాంగూ సెంచరీలతో విరుచుకుపడటంతో గువాహటి మైదానం పరుగుల వ‌ర‌దపారింది. ఇన్నింగ్స్‌ ఆరంభంలోనే కీశీ కార్టీ 9 పరుగులకే ఔటైనా.. ఆ తర్వాత క్యాంప్‌బెల్‌ దూకుడుగా ఆడాడు. కేవలం 68 బంతుల్లోనే 101 పరుగులు చేసిన అతడు 9 ఫోర్లు, 5 సిక్సర్లతో భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 65 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి విండీస్‌ తరఫున భారత్‌పై అత్యంత వేగంగా వన్డే సెంచరీ చేసిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించినట్లు మ్యాచ్‌ రిపోర్టులు పేర్కొన్నాయి. క్యాంప్‌బెల్‌-కార్టీ జోడీ 37 పరుగులు జోడించగా.. క్యాంప్‌బెల్‌ ఔటయ్యే సమయానికి విండీస్‌ స్కోరు 147 పరుగులకు చేరింది.

ఆ తర్వాత కెప్టెన్‌ షై హోప్‌ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. 94 బంతుల్లో 104 పరుగులు చేసిన హోప్‌.. 8 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు. అనంతరం అమీర్‌ జాంగూతో కలిసి భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ జోడీ 131 బంతుల్లో ఏకంగా 182 పరుగులు జోడించింది. జాంగూ మరింత దూకుడుగా ఆడి 77 బంతుల్లో 114 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 13 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. ఈ భాగస్వామ్యంతో 40 ఓవర్లకు విండీస్‌ 329 పరుగులకు చేరింది. హోప్‌ ఔటైన తర్వాత కూడా జాంగూ దూకుడు కొనసాగించాడు.

ఇక‌ చివరి పది ఓవర్లలోనూ విండీస్‌ బ్యాటర్లు తగ్గలేదు. జాంగూ 42.2వ ఓవర్‌లో ఔటయ్యే సమయానికి స్కోరు 348 పరుగులు. అనంతరం రోస్టన్‌ చేజ్‌ 29, షమర్‌ జోసెఫ్‌ 14 పరుగులతో వేగంగా పరుగులు రాబట్టారు. షెర్ఫేన్‌ రూథర్‌ఫోర్డ్‌ డకౌట్‌ కాగా.. కీమో పాల్‌ 3, అల్జారీ జోసెఫ్‌ 8 పరుగులు చేశారు. చివరి వరకు చేజ్‌, షమర్‌ జోసెఫ్‌ క్రీజులో ఉండటంతో విండీస్‌ 405 పరుగుల భారీ స్కోరును అందుకుంది. అదనంగా 23 పరుగులు వచ్చాయి.

భారత బౌలర్లలో గర్నూర్‌ బ్రార్‌ 10 ఓవర్లలో 96 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. రవీంద్ర జడేజా 10 ఓవర్లలో 75 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. కుల్దీప్‌ యాదవ్‌ 10 ఓవర్లలో 65 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. ప్రసిద్ధ్‌ కృష్ణ 5 ఓవర్లలో 45 పరుగులిచ్చి ఒక వికెట్‌ సాధించాడు. ఆకిబ్‌ నబీ 8.5 ఓవర్లలో 84 పరుగులిచ్చినా వికెట్‌ దక్కలేదు. నామన్‌ ధీర్‌ 6.1 ఓవర్లలో 38 పరుగులు ఇచ్చాడు.