సీఎం రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాల్సిందే.
* దేవుళ్లలో పేద.. ధనిక నిర్వచనం తీసుకొచ్చారు.
* హిందూ దేవుళ్లపై విద్వేష ప్రసంగాలు మానుకోవాలి.
* నోటికి వచ్చినట్టు మాట్లాడటం మంచిది కాదు.
* రేవంత్ వ్యాఖ్యలపై భానుప్రకాశ్‌రెడ్డి ఆగ్రహం.
న్యూఢిల్లీ, మహా:
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇటీవల ఢిల్లీలో చేసిన శ్రీరాముడు, శివుడికి సంబంధించిన వ్యాఖ్యలపై తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యుడు భానుప్రకాశ్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి కొత్తగా దేవుళ్లకు పేద, ధనిక అనే నిర్వచనం తీసుకొచ్చారని విమర్శించారు. హిందూ దేవుళ్లపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని, రేవంత్‌రెడ్డి తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
“దేవుళ్లకు పేద.. ధనిక తేడానా?”
భానుప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ.. దేవుళ్లను కూడా పేదలు, ధనికులుగా విభజించే విధంగా ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ధనం మీద ధ్యాస ఉన్నవారికి అదే కనిపిస్తుందని విమర్శించారు. ధర్మం, దేశం కోసం పనిచేసేది భారతీయ జనతా పార్టీ అని, ధనం కోసం పనిచేసేది కాంగ్రెస్ అని ఆయన వ్యాఖ్యానించారు.
“క్షమాపణ చెప్పాల్సిందే”
హిందూ దేవుళ్లపై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు ఆక్షేపణీయంగా ఉన్నాయని భానుప్రకాశ్‌రెడ్డి అన్నారు. ఉద్దేశపూర్వకంగా హిందూ దేవుళ్లపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపిస్తూ.. రేవంత్‌రెడ్డి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
“మోదీ కాశీ నుంచే గెలిచారు”
ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పుడైనా ‘హర హర మహాదేవ్’ అంటారా అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించడాన్ని భానుప్రకాశ్‌రెడ్డి ప్రస్తావించారు. ప్రధాని మోదీ స్వయంగా కాశీ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. శివుడిని, రాముడిని రాజకీయ కోణంలో చూడటం సరికాదని పేర్కొన్నారు.
“భగవంతుడు లోకకల్యాణం కోసం”
భగవంతుడు ఉన్నదే లోకకల్యాణం కోసం అని భానుప్రకాశ్‌రెడ్డి అన్నారు. కేరళ, ఢిల్లీ పర్యటనల్లో ముఖ్యమంత్రి ఇష్టానుసారంగా మాట్లాడారని విమర్శించారు. నోటికి వచ్చినట్లు మాట్లాడటం మంచిది కాదని హితవు పలికారు.
“ఇకనైనా విద్వేషాలు మానుకోవాలి”
ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించేలా వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని భానుప్రకాశ్‌రెడ్డి సూచించారు. భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతమైతే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. దేశ ప్రజలను విభజించే వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని కోరారు.
రేవంత్ వ్యాఖ్యలతో రాజకీయ దుమారం
సెప్టెంబరు 28న న్యూఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో రేవంత్‌రెడ్డి ఉత్తర, దక్షిణ భారత రాజకీయ, మతపరమైన ప్రతీకలపై మాట్లాడారు. ఆ సందర్భంగా శివుడు పేదల దేవుడని, రాముడు ధనికుల దేవుడని వ్యాఖ్యానించడంతో రాజకీయ వివాదం చెలరేగింది. బీజేపీ నేతలు ఈ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు.







