- తీవ్ర సంక్షోభంలో రాష్ట్ర రైతాంగం
- రాష్ట్ర ప్రభుత్వ అసమర్ధతే ఇందుకు కారణం
- వేలాది ఎకరాల్లో ఎండిపోయిన పంటలు
- నల్గొండ జిల్లా పర్యటనలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు ధ్వజం
నల్గొండ, మహా : రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు, ముందస్తు ప్రణాళిక లేమి, నిర్లక్ష్య వైఖరి కారణంగానే నేడు వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయి రైతాంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నల్గొండ జిల్లాలోని పలు మండలాలు, గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి ఎండిన పంట పొలాలను, బోర్లపై ఆధారపడి సాగుచేస్తున్న రైతుల దుస్థితిని స్వయంగా పరిశీలించిన అనంతరం నాగార్జునసాగర్ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
జిల్లాలోని కనగల్, నల్గొండ రూరల్ మండలాలతో పాటు చిన్న మాదారం తదితర గ్రామాల్లో వేలాది ఎకరాల ఆయకట్టు పూర్తిగా బోరుబావులపైనే ఆధారపడి సాగవుతోందని రాంచందర్ రావు గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రకటనల ప్రకారం 12 నుంచి 15 గంటల విద్యుత్ ఇస్తున్నామని ప్రచారం చేసుకుంటున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో అందుతున్నది గరిష్టంగా ఐదు గంటలు మాత్రమేనని రైతులు వాపోతున్నారని తెలిపారు.
అది కూడా తీవ్రమైన ట్రిప్పింగ్‌లు, బ్రేక్డౌన్లతో సరఫరా అవుతుండటంతో భూగర్భ జలాలు తోడలేక కళ్లముందే పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కరెంట్ లేక ఒకవైపు పొలాలు ఎండుతుంటే, మరోవైపు గ్రామాల్లో ప్రజలు, చిన్నారులు ఫ్యాన్లు తిరగక తీవ్ర ఉక్కపోత, దోమలతో నరకయాతన అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వరంగల్ ‘రైతు డిక్లరేషన్’ సభలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కంటే మెరుగైన బీమా పథకాన్ని తెస్తామని నమ్మబలికి, అధికారంలోకి వచ్చాక రైతులకు కనీస బీమా రక్షణ లేకుండా మోసం చేశారని విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2018 నుంచి ప్రీమియం చెల్లించకుండా ఫసల్ బీమాను పక్కనబెట్టగా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే నిర్లక్ష్యాన్ని కొనసాగిస్తూ రైతుల నోట్లో మట్టికొడుతోందని ద్వజమెత్తారు.
పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఎల్-నినో ప్రభావం వల్ల వర్షాభావం, ప్రకృతి వైపరీత్యం సంభవిస్తుందనే సంకేతాలు ముందే తెలిసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టకపోవడం దారుణమని విమర్శించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం మేల్కొని, కర్ణాటక ప్రభుత్వం తరహాలోనే కేంద్ర ప్రభుత్వ సహాయం కోరి కేంద్ర బృందాన్ని రప్పించి పంట నష్టాన్ని సమగ్రంగా అంచనా వేయించాలని, రైతులకు తక్షణ పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతులను ఆదుకునే విషయంలో కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరించేందుకు సిద్ధంగా ఉందన్నారు. అలాగే పంటలు వేయవద్దని రైతులకు చెప్పడం కాకుండా, ప్రత్యామ్నాయ పంటలు, ఆరుతడి పంటలు, కూరగాయలు, వైవిధ్యమైన సాగు పద్ధతులపై ఎఫ్‌పీవోలు, వ్యవసాయ అధికారులతో రైతులకు అవగాహన కల్పించే బాధ్యతను ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు.
హైదరాబాద్ నగరవాసుల తాగునీటి అవసరాలు నాగార్జునసాగర్ నుంచి ఫేజ్-1, ఫేజ్-2, ఫేజ్-3 ద్వారా తీరుతున్నాయని, నగరంలోనూ, పట్టణాల్లోనూ తీవ్ర తాగునీటి ఎద్దడి రాకుండా ఉండాలంటే ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్ రిజర్వాయర్లలో నిల్వ ఉన్న నీటిని వెంటనే కిందికి విడుదల చేయించేలా రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. కృష్ణా నదీ జలాల కేటాయింపుల్లో 811 టీఎంసీలలో తెలంగాణ ప్రవాహ ప్రాంతం ఎక్కువగా ఉండి కనీసం 500 టీఎంసీలు రావాల్సి ఉండగా, గత కేసీఆర్ ప్రభుత్వం కేవలం 299 టీఎంసీలకే సంతకం పెట్టి తెలంగాణకు తీరని ద్రోహం చేసిందని మండిపడ్డారు. ఎగువన కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం ఉల్లంఘించి ఆల్మట్టి డ్యామ్ ఎత్తును 5 మీటర్లు పెంచుతుంటే గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రేక్షకపాత్ర వహించాయని ధ్వజమెత్తారు.
రాబోయే కేఆర్ఎంబీ, అపెక్స్ కౌన్సిల్ సమావేశాల్లో మన న్యాయమైన వాటాపై రాజీలేకుండా బలంగా వాదనలు వినిపించాలని డిమాండ్ చేశారు. మరోవైపు వెలిగొండ ప్రాజెక్టు ద్వారా ఏపీ ప్రభుత్వం ఫ్లడ్ వాటర్‌తో పాటు తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన నికర జలాలను తరలించుకుపోతున్న వ్యవహారంపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు వాస్తవాలు వెల్లడించాలని పేర్కొంటూ తెలంగాణ నికర జలాల పరిరక్షణ కోసం బీజేపీ రాజీలేని పోరాటం చేస్తుందని హెచ్చరించారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల విషయంలో సరైన డిజైనింగ్ లేకపోవడం, నాణ్యతా లోపాలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు. కేంద్ర నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన సూచనల ప్రకారం ఆ మూడు బ్యారేజీలకు ఏ విధంగా మరమ్మతులు చేపట్టాలని, వాటిని తిరిగి ఎలా వినియోగంలోకి తీసుకురావాలనే విషయాలను ప్రభుత్వం బహిర్గతం చేయాలని స్పష్టం చేశారు.








