Mahaa Daily Exclusive

  మా పాలనలో ఉద్యోగులదే కీలక పాత్ర…

Share

  • మా పాలనలో ఉద్యోగులదే కీలక పాత్ర
  • రాష్ట్రంలో 4 కోట్ల జనాభాకు ఉద్యోగులు కేవలం 10.5 లక్షలే
  • ఉద్యోగుల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నాం
  • కేంద్రం, రాష్ట్రం ఇచ్చిపుచ్చుకునే దోరణిలో వెళ్తున్నాయి
  • నా ఢిల్లీ పర్యటనలను లెక్కించడం అవివేకమే
  • కరీంనగర్‌లో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు!

 

కరీంనగర్, మహా :  ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి ఫలాలు క్షేత్రస్థాయిలోని ప్రతి పేదవానికి చేరువ కావడంలో ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర అత్యంత కీలకమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లా పర్యటనలో భాగంగా సీఎం నూతన కలెక్టరేట్ భవన సముదాయాన్ని అధికారికంగా ప్రారంభించారు. అనంతరం కలెక్టరేట్ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించి, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఉన్నతాధికారుల సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్‌కు వచ్చే సామాన్య ప్రజలను అధికారులు తమ కుటుంబ సభ్యుల్లా భావించి ఆదరించాలని ముఖ్యమంత్రి సూచించారు.

 

రాష్ట్రంలోని 4 కోట్ల మంది ప్రజలకు సేవ చేయడానికి కేవలం 10.5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే ఉన్నారని, ఇది ఎంతో శ్రమతో కూడుకున్న బాధ్యత అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. పాలనకు మంచి పేరు వచ్చినా, చెడ్డ పేరు వచ్చినా అది అధికారుల పనితీరుపైనే ఆధారపడి ఉంటుందన్నారు. ప్రభుత్వ చట్టాలు, నిధులు ఎంత ఉన్నా వాటిని ప్రజలకు చేరవేసే వారధి ఉద్యోగులేనని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని, వారి సంక్షేమమే లక్ష్యంగా రూ. 944 కోట్ల అంచనా వ్యయంతో పలు సంక్షేమ పనులను ప్రారంభించినట్లు రేవంత్ రెడ్డి వెల్లడించారు. క్షేత్రస్థాయిలో సమస్యలు ఎదురవుతున్నప్పటికీ, సేవలు అందిస్తూనే వాటిని అధిగమించాలని పిలుపునిచ్చారు.

 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ముందుకెళ్లినప్పుడే వేగవంతమైన అభివృద్ధి సాధ్యమవుతుందని సీఎం తెలిపారు. ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు చేయాలని, ఎన్నికలు లేని సాధారణ సమయంలో కేంద్రం, రాష్ట్రం ఇచ్చిపుచ్చుకునే ధోరణితో అభివృద్ధిపై దృష్టి సారించాలని స్పష్టం చేశారు. రాష్ట్రాభివృద్ధి కోసం సహకరించాలంటూ కేంద్రాన్ని కోరడం తప్పేమీ కాదని, కేంద్ర మంత్రులను కలిసేందుకు ఢిల్లీ వెళ్తే కొంత మంది లెక్కిస్తున్నారని సీఎం వ్యాఖ్యానించారు. రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం ఎన్ని సార్లైనా ఢిల్లీకి వెళ్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు సహా పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.