Mahaa Daily Exclusive

  గడ్డపార చేతబట్టి.. డొంక రోడ్డుకు శ్రీకారం…

Share

గడ్డపార చేతబట్టి.. డొంక రోడ్డుకు శ్రీకారం.
• కొకులవారిపల్లిలో శ్రమదానం చేసిన చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, మాధవ్‌.
• పొలాల మధ్య డొంక రోడ్డుకు పనులు ప్రారంభం.
• పల్లెపండుగ అభివృద్ధి పనుల పరిశీలన.

ఉదయగిరి,మహా:

గడ్డపారలు చేతబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ డొంక రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. పల్లెపండుగ 3.0 కార్యక్రమంలో భాగంగా ఉదయగిరి నియోజకవర్గం పరిధిలోని కొకులవారిపల్లి గ్రామంలో పొలాల మధ్య నిర్మించనున్న డొంక రోడ్డుకు ముగ్గురు నేతలు శ్రమదానం ద్వారా పనులు ప్రారంభించారు.

శ్రామికులతో కలిసి శ్రమదానం

డొంక రోడ్డు పనుల ప్రారంభంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ గడ్డపారలు చేతబట్టి మట్టిని తవ్వారు. అనంతరం గ్రామానికి చెందిన వీబీ జీ రాంజీ శ్రామికులు గంపలతో మట్టిని తీసుకెళ్లి రోడ్డు నిర్మాణానికి ఉపయోగించారు. శ్రామికులతో కలిసి ముగ్గురు నేతలు పనుల్లో పాల్గొన్నారు.

167 నియోజకవర్గాల్లో డొంక రోడ్లు

పల్లెపండుగ 3.0 కార్యక్రమంలో భాగంగా డొంక రోడ్ల నిర్మాణానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. పైలట్‌ ప్రాజెక్టు కింద గ్రామీణ ప్రాంతాలు ఉన్న 167 నియోజకవర్గాల పరిధిలో ఒక్కో నియోజకవర్గానికి ఒక డొంక రోడ్డు నిర్మించనున్నారు. ఇందులో భాగంగా ఉదయగిరి నియోజకవర్గంలోని కొకులవారిపల్లిలో నిర్మించనున్న డొంక రోడ్డు పనులను ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి శ్రమదానం ద్వారా ప్రారంభించారు.

అభివృద్ధి పనుల పరిశీలన

డొంక రోడ్డు పనులకు శ్రీకారం చుట్టే ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ కొకులవారిపల్లి గ్రామంలో పల్లెపండుగ ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులను కాలినడకన పరిశీలించారు. గ్రామంలో చేపట్టిన వివిధ పనులను పరిశీలిస్తూ ముందుకు సాగారు.

నీటి తొట్టెతో స్వాగతం

గ్రామ సరిహద్దుల్లో పశువుల దాహార్తి తీర్చేందుకు నిర్మించిన నీటి తొట్టె ముగ్గురు నేతలకు స్వాగతం పలికింది. అనంతరం గ్రామంలో వేసిన బీటీ రోడ్డు, నిర్మించిన సీసీ రోడ్డు, రహదారికి సమీపంలో ఏర్పాటు చేసిన మినీ గోకులాన్ని వారు పరిశీలించారు. రోడ్డు నిర్మాణ నాణ్యతను కూడా తనిఖీ చేశారు.

కిలోమీటరు మేర కాలినడకన పర్యటన

కొకులవారిపల్లి గ్రామంలో సుమారు కిలోమీటరు మేర ముగ్గురు నేతలు కాలినడకన పర్యటించారు. అభివృద్ధి పనులను పరిశీలిస్తూ గ్రామ సచివాలయం వరకు వెళ్లారు. అక్కడ వీబీ జీ రాంజీ శ్రామికులతో కలిసి గ్రూప్‌ ఫొటో దిగారు.

పూల జల్లులతో ఘన స్వాగతం

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ కొకులవారిపల్లి గ్రామానికి రావడంతో గ్రామస్థులు ఘనంగా స్వాగతం పలికారు. గ్రామ సరిహద్దుల వద్ద మహిళలు పూల జల్లులతో నేతలకు స్వాగతం పలికారు. మహిళలతో ముగ్గురు నేతలు ముచ్చటిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ గ్రామంలోకి నడిచి వెళ్లారు.

వేదికపై ర్యాంప్‌పై నడుస్తూ అభివాదం

పల్లెపండుగ 3.0 కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సభా వేదిక వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌లకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. ప్రజలు తమ మెడల్లోని కండువాలను గాల్లో ఊపుతూ జయజయధ్వానాలు చేశారు. అనంతరం చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, పీవీఎన్‌ మాధవ్‌ వేదిక వద్ద ఏర్పాటు చేసిన ర్యాంప్‌పై నడుస్తూ ప్రజలకు అభివాదం చేశారు.

అభిమానుల సందడి

నేతలను చూసేందుకు వచ్చిన మహిళలు ఆనందం వ్యక్తం చేశారు. అభిమానులు తమ ఫోన్లలో సెల్ఫీలు తీసుకునేందుకు పోటీ పడ్డారు. పల్లెపండుగ కార్యక్రమానికి ముందు గ్రామాల్లో ఉన్న పరిస్థితులు, పల్లెపండుగ అనంతరం చేపట్టిన అభివృద్ధి పనులను వివరిస్తూ రూపొందించిన వీడియో ప్రజెంటేషన్‌ సభికులను ఆకట్టుకుంది.

పవన్‌ కల్యాణ్‌కు ప్రత్యేక స్వాగతం

పల్లెపండుగ 3.0 కార్యక్రమానికి ఉదయగిరి నియోజకవర్గాన్ని ఎంపిక చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌పై స్థానిక ప్రజలు తమ అభిమానాన్ని చాటుకున్నారు. జనసేన జెండా రంగులతో కూడిన గొడుగులతో ప్రత్యేకంగా స్వాగతం పలికారు. పవన్‌ కల్యాణ్‌కు స్వాగతం తెలుపుతూ ఆంగ్ల అక్షరాల ఆకృతిలో నిలబడి తమ అభిమానాన్ని, కృతజ్ఞతలను వ్యక్తం చేశారు.

గ్రామీణ అభివృద్ధికి పల్లెపండుగ

పల్లెపండుగ 3.0 కార్యక్రమంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు, ఇతర మౌలిక వసతుల అభివృద్ధికి పనులు చేపడుతున్నారు. కొకులవారిపల్లిలో డొంక రోడ్డు నిర్మాణానికి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు స్వయంగా శ్రమదానం చేయడంతో కార్యక్రమం ప్రత్యేకంగా నిలిచింది. గ్రామస్థులు, వీబీ జీ రాంజీ శ్రామికులతో కలిసి నేతలు పనులను ప్రారంభించారు.