Mahaa Daily Exclusive

  రూ.2,700 మందుకు రూ.27,000 ఎంఆర్‌పీ ఎలా?

Share

Nరూ.2,700 మందుకు రూ.27,000 ఎంఆర్‌పీ ఎలా?
• ఔషధాల ధరల దోపిడీపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం.
• లాభాలపై 16 శాతం పరిమితి ఎందుకు విధించకూడదని కేంద్రానికి ప్రశ్న.
• రోగుల జేబులు గుల్ల చేస్తున్న ఆసుపత్రుల తీరుపై ఆందోళన.
• తదుపరి విచారణ అక్టోబర్ 12కు వాయిదా.

న్యూఢిల్లీ, మహా.
ప్రాణాలను కాపాడే ఔషధాల ధరల్లో నెలకొన్న భారీ వ్యత్యాసాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. చిల్లర వ్యాపారులకు కేవలం రూ.2,700కు లభించే క్యాన్సర్ మందుపై గరిష్ఠ చిల్లర ధర (ఎంఆర్‌పీ) ఏకంగా రూ.27,000 ముద్రించడం వెనుక ఆంతర్యమేమిటని కేంద్రాన్ని నిలదీసింది. ఔషధాల ధరలపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాలను జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం విచారించింది. తయారీదారుడి ధరకు, రోగి చెల్లించే ధరకు మధ్య పదిరెట్ల వ్యత్యాసం ఉండటాన్ని తీవ్రంగా పరిగణించిన న్యాయస్థానం.. ఔషధ ధరల నియంత్రణకు దేశవ్యాప్తంగా ఒక సమగ్ర విధానం ఎందుకు ఉండకూడదని ప్రశ్నించింది. ప్రస్తుతం కొన్ని ఔషధాలు మాత్రమే ధరల నియంత్రణ పరిధిలో ఉన్నాయని, అన్ని రకాల మందులపై వ్యాపారుల లాభాల శాతాన్ని 16 శాతానికి ఎందుకు పరిమితం చేయకూడదో పరిశీలించాలని ప్రభుత్వానికి సూచించింది.
మందుల ధరల్లో ఇంతటి అసాధారణ వ్యత్యాసం ఉన్నప్పుడు ఆ భారం నేరుగా రోగిపైనే పడుతుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. దీర్ఘకాలిక చికిత్స అవసరమయ్యే క్యాన్సర్ లాంటి వ్యాధుల విషయంలో ఈ దోపిడీ సామాన్యుల నడ్డి విరుస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది. రూ.27 వేల ఎంఆర్‌పీ ఉన్న మందును వ్యాపారి రూ.3 వేలకు ఇస్తానంటే, ఆ మందు నకిలీదేమోనన్న భయం రోగిలో కలగడం సహజమని న్యాయస్థానం అభిప్రాయపడింది. దీనికితోడు పలు ప్రైవేటు ఆసుపత్రులు తమ సొంత ఫార్మసీల నుంచే రోగులు మందులు కొనుగోలు చేసేలా ఒత్తిడి తెస్తూ, గరిష్ఠ ధరలకే విక్రయిస్తూ జేబులు గుల్ల చేస్తున్న తీరును ఆక్షేపించింది. ప్రాణరక్షక ఔషధాలను కేవలం వాణిజ్య వస్తువులుగా చూడకుండా, ప్రభుత్వ ఆరోగ్య పథకాల ద్వారా చెల్లించే ప్రజాధనం దుర్వినియోగం కాకుండా పారదర్శక వ్యవస్థను తీసుకురావాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పింది.
సుప్రీంకోర్టు ప్రశ్నలపై కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందిస్తూ.. ప్రభుత్వం ఈ సమస్యను తీవ్రంగా పరిగణిస్తోందని ధర్మాసనానికి విన్నవించారు. ఔషధ తయారీదారులు, పంపిణీదారులు, ఆసుపత్రులు, రోగులు.. ఇలా అన్ని వర్గాల ప్రయోజనాలను సమతుల్యం చేసేలా ఒక స్పష్టమైన పరిష్కారం కనుగొనే దిశగా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. దీనిపై వివిధ మంత్రిత్వ శాఖల మధ్య అంతర్గత సంప్రదింపులు జరుగుతున్నాయని, విధానపరమైన నిర్ణయాన్ని, పూర్తి వివరాలను కోర్టుకు సమర్పించేందుకు కొంత సమయం కావాలని కోరారు. కేంద్రం వాదనలను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు, ఔషధ ధరల నియంత్రణపై తదుపరి విచారణను అక్టోబర్ 12కు వాయిదా వేసింది.