అరుణాచల్ సరిహద్దులో ఉగ్రదాడి.
* అస్సాం రైఫిల్స్ జవాను వీరమరణం.
* మిలిటెంట్ల కాల్పుల్లో మరో నలుగురు సైనికులకు గాయాలు.
* ఎన్‌ఎస్‌సీఎన్-కె వర్గం పనేనని అనుమానాలు.
* ఉగ్రవాదుల కోసం ముమ్మర కూంబింగ్.
ఇటానగర్, మహా.
భారత్-మయన్మార్ సరిహద్దుల్లో ఉగ్రవాదులు బరితెగించారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని చాంగ్లాంగ్ జిల్లాలో గస్తీ నిర్వహిస్తున్న భద్రతా బలగాలే లక్ష్యంగా మెరుపుదాడికి పాల్పడ్డారు. మంగళవారం ఉదయం చోటుచేసుకున్న ఈ ఘటనలో 21 అస్సాం రైఫిల్స్‌కు చెందిన ఓ హవిల్దార్ వీరమరణం పొందగా, మరో నలుగురు సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. దేశ సరిహద్దుల్లో కంచె నిర్మాణ పనులను అడ్డుకునే కుట్రతోనే మిలిటెంట్లు ఈ దుర్మార్గానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది.
మంగళవారం ఉదయం 6.30 గంటల సమయంలో చాంగ్లాంగ్ జిల్లా పరిధిలోని నాంపాంగ్ నల్లా సమీపంలో ఈ దాడి జరిగింది. ఇండో-మయన్మార్ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి కంచె నిర్మాణ పనులు జరుగుతున్న అత్యంత సున్నితమైన ప్రాంతంలో 21 అస్సాం రైఫిల్స్ సిబ్బంది విధుల్లో ఉన్నారు. ఆ బృందం గస్తీ నిర్వహిస్తుండగా పక్కా పథకం ప్రకారం కాపు కాసిన సాయుధ మిలిటెంట్లు ఒక్కసారిగా వారిపైకి కాల్పులకు తెగబడ్డారు. ఉగ్రవాదుల తూటాలకు ఎదురొడ్డి వీరోచితంగా పోరాడిన హవిల్దార్ జంఖోకై కుకీ (42) తీవ్ర గాయాలతో ప్రాణాలు కోల్పోయి అమరుడయ్యారు. గాయపడిన మరో నలుగురు జవాన్లను హుటాహుటిన సైనిక ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు.
మిలిటెంట్ల కాల్పుల అనంతరం అప్రమత్తమైన భద్రతా బలగాలు వెంటనే ఎదురుదాడికి దిగాయి. ఈ దాడి వెనుక నిషేధిత ఎన్‌ఎస్‌సీఎన్-కె (వైఏ- యుంగ్ ఆంగ్) వర్గానికి చెందిన మిలిటెంట్ల హస్తం ఉన్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రాథమికంగా అనుమానిస్తున్నాయి. ఘటన జరిగిన వెంటనే రంగంలోకి దిగిన సైన్యం, స్థానిక పోలీసు బలగాలతో సమన్వయం చేసుకుంటూ పరిసర అటవీ ప్రాంతాల్లో భారీ ఎత్తున గాలింపు చర్యలు చేపట్టింది. ఉగ్రవాదులు ఏ మార్గంలో వచ్చారు, కాల్పుల అనంతరం ఎటువైపు తప్పించుకున్నారనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. మయన్మార్ సరిహద్దుకు ఆనుకుని ఉండే చాంగ్లాంగ్ జిల్లాలో గతంలోనూ మిలిటెంట్ల కదలికలు నమోదయ్యాయి. తాజా దాడి నేపథ్యంలో సరిహద్దుల వెంబడి భద్రతను, నిఘాను బలగాలు మరింత కట్టుదిట్టం చేశాయి. దాడికి పాల్పడిన వారిని మట్టుబెట్టేందుకు ఆపరేషన్ కొనసాగుతోంది.






