Mahaa Daily Exclusive

  అమ్మాయిల పరుగుకు పసిడి కిరీటం!

Share

అమ్మాయిల పరుగుకు పసిడి కిరీటం!
• ఆసియా క్రీడల 4×400 మీటర్ల రిలేలో భారత మహిళల జట్టుకు స్వర్ణం.
• బహ్రెయిన్‌పై ఉత్కంఠ విజయం.
• 42 ఏళ్ల పీటీ ఉష రికార్డును బద్దలు కొట్టిన విథ్యా రామ్‌రాజ్‌.. పురుషుల రిలేలోనూ కాంస్యం.
ఢిల్లీ, మహా.
ఆసియా క్రీడలు–2026లో భారత అథ్లెటిక్స్ బృందం ఎట్టకేలకు పసిడి ఖాతా తెరిచింది. ట్రాక్‌పై భారత మహిళా అథ్లెట్లు అద్భుతం చేశారు. ఉత్కంఠ భరితంగా సాగిన మహిళల 4×400 మీటర్ల రిలేలో కిరణ్ పహల్, పూవమ్మ మాచెట్టిరా, ప్రాచి, విథ్యా రామ్‌రాజ్‌లతో కూడిన భారత బృందం స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. మంగళవారం జరిగిన ఫైనల్లో ఈ చతుష్టయం 3 నిమిషాల 29.69 సెకన్లలో రేసును పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచింది. భారత్‌కు గట్టి పోటీ ఇచ్చిన బహ్రెయిన్ 3:30.21 నిమిషాలతో రజతంతో సరిపెట్టుకోగా, చైనా 3:31.02 నిమిషాలతో కాంస్యం సాధించింది. నాగోయా క్రీడల్లో అథ్లెటిక్స్‌లో భారత్‌కు ఇదే తొలి స్వర్ణం కావడం విశేషం.
ఈ పసిడి పరుగులో ఆఖరి ల్యాప్ అత్యంత ఉత్కంఠ భరితంగా సాగింది. తొలి మూడు దశల్లో కిరణ్, పూవమ్మ, ప్రాచి తమ వంతు బాధ్యతను అద్భుతమైన సమన్వయంతో పూర్తి చేయగా.. ఆఖరి ల్యాప్‌లో భారత బృందానికి బహ్రెయిన్ అథ్లెట్ సల్వా ఈద్ నాసర్ నుంచి తీవ్ర పోటీ ఎదురైంది. అయితే యాంకర్‌గా బరిలోకి దిగిన విథ్యా రామ్‌రాజ్ ఏమాత్రం ఒత్తిడికి లోనుకాకుండా అంచనాలకు మించి రాణించింది. చివరి మీటర్లలో పాదరసంలా దూసుకెళ్లిన ఆమె.. బహ్రెయిన్ కంటే కేవలం 0.52 సెకన్ల ముందుగా గమ్యాన్ని ముద్దాడి భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించింది.
ఈ ఆసియా క్రీడలు భారత అథ్లెట్ విథ్యా రామ్‌రాజ్‌కు వ్యక్తిగతంగా చిరస్మరణీయంగా మారాయి. రిలేలో పసిడికి ముందు రోజు సోమవారం జరిగిన మహిళల 400 మీటర్ల హర్డిల్స్‌లో ఆమె కాంస్య పతకం సాధించింది. ఈ క్రమంలో 42 ఏళ్లుగా పదిలంగా ఉన్న దిగ్గజ అథ్లెట్ పీటీ ఉష జాతీయ రికార్డును విథ్యా బద్దలు కొట్టి చరిత్ర సృష్టించింది. 1984 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో ఉష 55.42 సెకన్లతో నెలకొల్పిన రికార్డును విథ్యా (54.75 సెకన్లు) అధిగమించింది. వాస్తవానికి 2023లో ఉష రికార్డును సమం చేసిన ఆమె, ఈసారి ఏకంగా కొత్త రికార్డును లిఖించింది. తన రికార్డు బ్రేక్ అవ్వడం మహిళా క్రీడా పురోగతికి సంకేతమంటూ పీటీ ఉష ఆమెను ప్రత్యేకంగా అభినందించారు.
మరోవైపు పురుషుల విభాగంలోనూ భారత్‌కు పతకం దక్కింది. మంగళవారం జరిగిన పురుషుల 4×400 మీటర్ల రిలేలో బరిలోకి దిగిన భారత జట్టు 3:01.61 నిమిషాల వ్యవధిలో రేసును పూర్తి చేసి కాంస్య పతకంతో మెరిసింది. వ్యక్తిగత ఈవెంట్లతో పాటు జట్టు విభాగాల్లోనూ అద్భుత ప్రదర్శన చేస్తూ నాగోయా క్రీడల్లో భారత అథ్లెట్లు తమ సత్తా చాటుతున్నారు.