Mahaa Daily Exclusive

  దళిత, ఆదివాసీల హక్కుల సాధనకు ఐక్య పోరాటం…

Share

దళిత, ఆదివాసీల హక్కుల సాధనకు ఐక్య పోరాటం.
• వివక్ష, దాడులకు వ్యతిరేకంగా సంఘటితం కావాలి.
• డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.

న్యూఢిల్లీ, మహా.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా దళితులు, ఆదివాసీలపై వివక్ష, దాడులు పూర్తిగా ఆగిపోలేదని తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు. తమ హక్కుల పరిరక్షణ, ఆత్మగౌరవం కోసం ఈ వర్గాలన్నీ ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌లో కాంగ్రెస్‌ ఎస్సీ, ఎస్టీ ఎంపీల ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన ‘దళిత–ఆదివాసీ ఆత్మగౌరవ సమావేశం’లో భట్టి విక్రమార్క పాల్గొని ప్రసంగించారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు, సమానత్వ స్ఫూర్తి అణగారిన వర్గాలకు అందేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులపై ఉందని ఆయన స్పష్టం చేశారు.
రాజ్యాంగమే రక్షణ కవచం
చట్టపరంగా అందరికీ సమాన హక్కులు ఉన్నప్పటికీ సామాజికంగా కొన్ని వర్గాలు ఇంకా వివక్షను ఎదుర్కొంటూనే ఉన్నాయని భట్టి విక్రమార్క విచారం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో దళితులు, ఆదివాసీలు తమ హక్కుల సాధన కోసం ప్రజాస్వామ్య పద్ధతుల్లో గొంతు వినిపించాలన్నారు. సామాజిక సమానత్వం, స్వేచ్ఛ, సమాన అవకాశాలను భారత రాజ్యాంగం హామీ ఇస్తోందని, ఆ రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పాలన సాగినప్పుడే అణగారిన వర్గాలకు నిజమైన న్యాయం జరుగుతుందని ఆయన ఉద్ఘాటించారు. రాజ్యాంగ హక్కులపైన, వాటి అమలుపైన ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని సూచించారు. దళితులు, ఆదివాసీలు వేర్వేరుగా కాకుండా ఉమ్మడి సమస్యలపై కలిసికట్టుగా పోరాడితే హక్కుల సాధనకు బలమైన వేదిక ఏర్పడుతుందని ఆకాంక్షించారు.
సామాజిక న్యాయంపై విస్తృత చర్చ
ఈ ఆత్మగౌరవ సభలో దళితులు, ఆదివాసీలు ఎదుర్కొంటున్న సామాజిక సమస్యలు, విద్యా, ఉపాధి అవకాశాలు, రాజకీయ ప్రాతినిధ్యం, సామాజిక భద్రత వంటి కీలక అంశాలపై ప్రతినిధులు లోతుగా చర్చించారు. సామాజిక వివక్ష పూర్తిగా అంతరించాలంటే గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని తీర్మానించారు. చట్టసభల్లో సమస్యలను బలంగా ప్రస్తావించినప్పుడే విధాన నిర్ణయాల్లో ఈ వర్గాల భాగస్వామ్యం పెరుగుతుందని పలువురు నేతలు అభిప్రాయపడ్డారు. తెలంగాణలోనూ సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తున్నామని, ఆదివాసీ, గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతులు, సమగ్ర అభివృద్ధి కోసం ప్రత్యేక దృష్టి సారించినట్లు నేతలు ఈ సందర్భంగా గుర్తుచేశారు.
ఈ ప్రతిష్ఠాత్మక సమావేశంలో తెలంగాణకు చెందిన పలువురు కీలక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు రాష్ట్ర మంత్రులు సీతక్క, వివేక్‌ వెంకటస్వామి, పార్లమెంటు సభ్యులు మల్లు రవి, బలరాం నాయక్‌, గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యే వినోద్‌ వెంకటస్వామి తదితర కాంగ్రెస్ నాయకులు, దళిత, ఆదివాసీ సంఘాల ప్రతినిధులు భారీ సంఖ్యలో హాజరై తమ వాణిని వినిపించారు.