పేద పిల్లల విద్య గాలికి వదిలేస్తారా?
* విద్యాహక్కు చట్టం అమలుపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి.
* గణాంకాలు ఇస్తే సరిపోదు.. బాలల హక్కుల కమిషన్ తీరుపై ఆగ్రహం.
* క్షేత్రస్థాయి సమస్యలను పరిష్కరించాలని ధర్మాసనం స్పష్టీకరణ.
న్యూఢిల్లీ, మహా .
పేద, బలహీన వర్గాల విద్యార్థులకు ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత విద్యను అందించాలన్న విద్యాహక్కు చట్టం లక్ష్యం నీరుగారుతోందని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. చట్టంలోని 25 శాతం ఉచిత సీట్ల కేటాయింపు నిబంధన క్షేత్రస్థాయిలో అమలయ్యేలా చూడాల్సిన జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎన్సీపీసీఆర్).. కేవలం గణాంకాలు సేకరిస్తూ కాలయాపన చేయడంపై ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. వ్యవహారం ఇదే తీరులో కొనసాగితే కమిషన్ చైర్‌పర్సన్‌ను స్వయంగా కోర్టుకు పిలిపించి వివరణ కోరాల్సి వస్తుందని తీవ్ర స్థాయిలో హెచ్చరించింది.
విద్యాహక్కు చట్టంలోని 12(1)(సి) నిబంధన ప్రకారం గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలల్లో ప్రవేశ స్థాయిలో పాతిక శాతం సీట్లను పేద, వెనుకబడిన వర్గాలకు ఉచితంగా కేటాయించాలి. అయితే, ఈ ప్రక్రియలో కేటాయించిన సీట్లు ఎందుకు ఖాళీగా ఉంటున్నాయి, అర్హులైన పిల్లలకు ప్రవేశాలు ఎందుకు నిరాకరిస్తున్నారు, దరఖాస్తు సమయంలో తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న వాస్తవ ఇబ్బందులు ఏమిటి అనే కోణంలో విశ్లేషించకుండా.. కేవలం రాష్ట్రాల నుంచి అంకెలు తెప్పించి కోర్టుకు అఫిడవిట్ రూపంలో సమర్పించడంపై న్యాయస్థానం మండిపడింది. సామాజిక సమైక్యత, సమానత్వ భావనను పెంపొందించే ఈ విద్యాహక్కు చట్టం కాగితాలకే పరిమితం కాకూడదని, దీనిని ఒక జాతీయ లక్ష్యంగా ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు అమలు చేయాలని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
క్షేత్రస్థాయిలో అడ్డంకులు, పరిష్కార మార్గాలు
పేద కుటుంబాలకు డిజిటల్ పరిజ్ఞానం లేకపోవడం, ఆన్లైన్ దరఖాస్తుల్లో ఎదురయ్యే సాంకేతిక ఇబ్బందులు, భాషా సమస్యలు ప్రైవేటు బడుల్లో ప్రవేశాలకు ప్రధాన అవరోధాలుగా మారుతున్నాయని కోర్టు గుర్తించింది. దరఖాస్తులో చిన్నపాటి తప్పులున్నా వెంటనే దాన్ని తిరస్కరించకుండా, వాటిని సరిదిద్దుకునే అవకాశం తల్లిదండ్రులకు ఇవ్వాలని సూచించింది. పేదలకు మార్గదర్శనం చేసేందుకు విద్యాశాఖ కార్యాలయాలు, స్థానిక సంస్థలు, పాఠశాలల వద్ద ప్రత్యేక సహాయ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఒక పాఠశాలలో సీట్లు వరుసగా ఖాళీగా ఉంటుంటే అధికారుల పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలని, ఒకవేళ ప్రవేశం నిరాకరిస్తే అందుకు గల కారణాలను యాజమాన్యాలు విధిగా పారదర్శకంగా నమోదు చేయాలని స్పష్టం చేసింది.
కొత్త నియమావళి దిశగా కేంద్రం అడుగులు
సుప్రీంకోర్టు ఈ ఏడాది జనవరిలో ఇచ్చిన తీర్పు, తాజా ఆదేశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా కదిలింది. ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం సీట్ల అమలుకు సంబంధించి స్పష్టమైన నియమావళిని రూపొందించేందుకు ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు ఏప్రిల్‌లో కోర్టుకు నివేదించింది. ప్రైవేటు పాఠశాలల్లో ప్రవేశ ప్రక్రియను మరింత పారదర్శకంగా మార్చేందుకు ఈ కమిటీ కసరత్తు చేస్తోంది.
మొత్తంగా విద్యాహక్కు చట్టం అమలు అనేది కేవలం ప్రభుత్వాలకే పరిమితం కాదని, పాఠశాలలు కూడా సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని కోర్టు తేల్చిచెప్పింది. ప్రవేశాల నుంచి మొదలుకొని తరగతి గదిలో విద్యార్థుల పట్ల ఎలాంటి వివక్ష లేకుండా చూసే వరకు పటిష్టమైన పర్యవేక్షణ వ్యవస్థ ఉండాలని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు తాజా వ్యాఖ్యలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ల తదుపరి కార్యాచరణ అత్యంత కీలకంగా మారింది.






