హైదరాబాద్, మహా.
రాష్ట్రంలో పోలీసు యంత్రాంగం తమ అసలు పనులను గాలికొదిలేసి, గద్దల్లా ప్రజల భూములపై పడుతున్న నాయకులకు వత్తాసు పలుకుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శంషాబాద్ మండలం బహదూర్‌గూడలో ప్రతిపాదిత బుల్లెట్ రైలు ప్రాజెక్టు కోసం భూములు కోల్పోతున్న రైతులు సోమవారం తెలంగాణ భవన్‌లో ఆయనతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం, పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. భూములు అమ్మడం, కమీషన్లు దండుకోవడమే రేవంత్ రెడ్డి ఏకైక పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. బుల్లెట్ రైలు ప్రాజెక్టు పేరుతో బడా నేతలను వదిలేసి, పేదల ఆస్తులను గుంజుకోవడం దారుణమని ప్రభుత్వాన్ని నిలదీశారు.
ప్రభుత్వానికి కాంగ్రెస్ నేతలు బలరాం నాయక్, వివేక్ వెంకటస్వామి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు రేవంత్‌రెడ్డి సోదరుల ఇళ్లు, భూములు ఎందుకు కనిపించడం లేదని కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు. వాస్తవానికి ఎయిర్‌పోర్ట్ భూముల్లో 13 శాతం రాష్ట్ర ప్రభుత్వానికి హక్కు ఉంటుందని, ఆ స్థలాన్ని బుల్లెట్ ట్రైన్ కోసం వాడుకోకుండా నాలుగు తరాలుగా సాగు చేసుకుంటున్న రైతుల భూములను లాక్కోవాలని చూడటం దుర్మార్గమన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి కేవలం రూ. 5,000 కోట్ల కమీషన్ మాత్రమే కనిపిస్తోందని, నిరుపేదల భూములు మాత్రం కనిపించడం లేదని విమర్శించారు. ఇందిరమ్మ రాజ్యం అంటే పేదల భూములు తీసుకోవడమేనా అని ఆయన మండిపడ్డారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో రైతుల భూముల జోలికి కేసీఆర్ ఏనాడూ వెళ్లలేదని, ఆయన మంచి చేశాడు కాబట్టే ప్రజలు ఇప్పటికీ స్వచ్ఛందంగా కేసీఆర్ పాటలు పెట్టుకుంటున్నారని గుర్తుచేశారు.
తమ గోడు వెళ్లబోసుకునేందుకు తెలంగాణ భవన్‌కు వస్తున్న రైతుల ఫొటోలను పోలీసులు ఉద్దేశపూర్వకంగా తీసుకుంటున్నారని, వాటిని తీసుకువెళ్లి ఏం చేస్తారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు 420 హామీలిచ్చి ప్రజలను నిలువునా మోసం చేసిన రేవంత్ రెడ్డి ఫొటోలను పోలీస్ స్టేషన్లలో పెట్టాలని ఎద్దేవా చేశారు. భూములు కోల్పోతున్న రైతులు అధైర్యపడవద్దని, న్యాయస్థానాలు కచ్చితంగా అండగా ఉంటాయని ఆయన భరోసా ఇచ్చారు. అవసరమైతే ఈ సమస్యపై సుప్రీంకోర్టు వరకు వెళ్లి న్యాయపోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. రైతులు కేవలం ఒక్క ఏడాది పాటు ధైర్యంగా పోరాటం చేయాలని, మరో ఏడాదిలో కేసీఆర్ మళ్లీ రావడం ఖాయమని, ఈ ప్రభుత్వ ఆటలు ఇంకో ఏడాది మాత్రమే సాగుతాయని కేటీఆర్ స్పష్టం చేశారు.








