Mahaa Daily Exclusive

  న‌టి ర‌కుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ఐటీ సోదాలు….

Share

  • న‌టి ర‌కుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ఐటీ సోదాలు..
  • వాసు భగ్నానీ, పనోరమా స్టూడియోస్‌ కార్యాలయాల్లోనూ తనిఖీలు
  • విదేశీ లావాదేవీలపై ఆరా

ముంబై, మహా : బాలీవుడ్‌ నటి రకుల్‌ప్రీత్‌ సింగ్‌, నిర్మాత వాసు భగ్నానీ, పనోరమా స్టూడియోస్‌కు సంబంధించిన పలు ప్రాంతాల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోమవారం సోదాలు నిర్వహించారు. ముంబైలో మొత్తం 12 ప్రాంతాల్లో ఈ తనిఖీలు జరిగాయి. సినిమా ప్రాజెక్టులకు సంబంధించిన నిధుల లావాదేవీలు, ముఖ్యంగా విదేశాలకు పంపిన నిధులపై తలెత్తిన అనుమానాల నేపథ్యంలో ఈ సోదాలు జరిగినట్లు సమాచారం. ఆర్థిక పత్రాలు, ఖాతాలకు సంబంధించిన రికార్డులు, ఇతర సంబంధిత డాక్యుమెంట్లను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. అయితే సోదాల్లో ఏం గుర్తించారన్న విషయంపై ఆదాయపు పన్ను శాఖ అధికారికంగా వివరాలు వెల్లడించలేదు. సినిమా నిర్మాణం, ప్రాజెక్టుల కోసం నిధుల సమీకరణ, వాటి విదేశీ లావాదేవీలకు సంబంధించిన వివరాలను అధికారులు పరిశీలించారని నివేదికలు పేర్కొంటున్నాయి. పనోరమా స్టూడియోస్‌తో పాటు నిర్మాతలు, సినీ రంగానికి చెందిన వ్యక్తులకు సంబంధించిన కొన్ని కార్యాలయాలు, నివాస ప్రాంతాల్లోనూ తనిఖీలు నిర్వహించినట్లు సమాచారం.

ఇదిలా ఉండగా.. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ సోదరుడు అమన్‌ప్రీత్‌ సింగ్‌ పేరు 2025 డిసెంబర్‌లో హైదరాబాద్‌లో నమోదైన డ్రగ్స్‌ కేసులో తెరపైకి వచ్చింది. డిసెంబర్‌ 19న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసి వారి నుంచి 43.7 గ్రాముల కొకైన్‌, 11.5 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం చేసుకున్నారు. విచారణలో అమన్‌ప్రీత్‌ సింగ్‌ పేరు వినియోగదారుల్లో ఒకరిగా వెల్లడైందని పోలీసులు అప్పట్లో తెలిపారు. ఆయన ఆ ఇద్దరి నుంచి ఐదుసార్లు డ్రగ్స్‌ కొనుగోలు చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానించినట్లు వార్తా సంస్థలు పేర్కొన్నాయి.