Mahaa Daily Exclusive

  దేశంలోనే తొలి ఎల్‌ఎన్‌జీ రైలును ప్రారంభం…

Share

దేశంలోనే తొలి ఎల్‌ఎన్‌జీ రైలును ప్రారంభం.
• రైల్వేలో విప్లవాత్మక మార్పులు.
• కాంగ్రెస్ హయాంలో కుంభకోణాలే.
• కేంద్ర హోంమంత్రి అమిత్ షా.
అహ్మదాబాద్,మహా.
గుజరాత్‌లోని సబర్మతి రైల్వే స్టేషన్ నుంచి ఆదివారం దేశంలోనే మొట్టమొదటి ఎల్‌ఎన్‌జీ (లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్) రైలును కేంద్ర హోంమంత్రి అమిత్ షా జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించడంతో పాటు, ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో రైల్వే శాఖలో చోటుచేసుకున్న విప్లవాత్మక మార్పులను ప్రజలకు వివరించారు.
కాంగ్రెస్ హయాంలో కుంభకోణాలే.. కాంగ్రెస్ పాలన అంతా కుంభకోణాల మయమేనని, కానీ గత 12 ఏళ్ల మోదీ పాలనలో ఆయనపై ఎవరూ ఒక్క అవినీతి ఆరోపణ కూడా చేయలేకపోయారని అమిత్ షా స్పష్టం చేశారు. అర్థరహితంగా మాట్లాడే కాంగ్రెస్ పార్టీకి దమ్ముంటే వాస్తవాలు, గణాంకాల ఆధారంగా చర్చకు రావాలని ఆయన సవాల్ విసిరారు. 2014లో మోదీ అధికారంలోకి వచ్చిన నాటినుంచి రైల్వే వ్యవస్థలో అనేక నూతన సదుపాయాలు కల్పించి, ఆధునీకరించారని ఆయన కొనియాడారు.
రైల్వేలో విప్లవాత్మక మార్పులు.. మోదీ ప్రభుత్వ హయాంలో 11,000 కిలోమీటర్ల రైలు కారిడార్‌ను 4-ట్రాక్ నెట్‌వర్క్‌గా మార్చే పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, దీనివల్ల రవాణా ఎంతో సులభతరమవుతుందని అమిత్ షా తెలిపారు. ప్రత్యేక సరకు రవాణా కారిడార్, ర్యాపిడ్ రైల్ సిస్టమ్, ప్రీమియం స్టేషన్లు మోదీ ప్రారంభించినవేనని గుర్తుచేశారు. దేశంలో హైడ్రోజన్‌తో నడిచే రైలును ప్రవేశపెట్టడం ద్వారా, సాంకేతికత కలిగిన ప్రపంచంలోని టాప్ 4 దేశాల సరసన భారత్‌ను నిలబెట్టారని ప్రశంసించారు. అలాగే, సరుకు రవాణా సామర్థ్యాన్ని పెంచేందుకు ముంబై నుంచి వడోదరకు నడిపిన మొట్టమొదటి ‘లాంగ్ డబుల్ స్టాక్ కంటైనర్ రైలు’ ట్రయల్ రన్ విజయవంతమైందని వెల్లడించారు.
డీజిల్ వాడకం సున్నాకి.. 100 శాతం విద్యుదీకరణే లక్ష్యం ‘మేక్ ఇన్ ఇండియా’, ‘ఆత్మనిర్భర్ భారత్’ స్ఫూర్తితో రైళ్లలో 97 శాతం బయో-టాయిలెట్లను ఏర్పాటు చేశామని, 87 శాతం ఎల్‌హెచ్‌బీ కోచ్‌లను భారతదేశంలోనే తయారు చేశామని అమిత్ షా పేర్కొన్నారు. రైల్వే భద్రత బడ్జెట్‌ను 67 శాతం, లోకోమోటివ్ (ఇంజిన్) తయారీ సామర్థ్యాన్ని 66 శాతం పెంచినట్లు వివరించారు. 2015-16లో రైల్వేలు 293 కోట్ల లీటర్ల డీజిల్‌ను వినియోగించగా, 2024-25 నాటికి అది 108 కోట్ల లీటర్లకు తగ్గిందని తెలిపారు. 2030 నాటికి డీజిల్ వాడకాన్ని పూర్తిగా సున్నాకి చేర్చి, భారీగా విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేస్తామన్నారు.
కాంగ్రెస్ హయాంలో (2010-11) ఏటా కేవలం 75 కి.మీ. మేర మాత్రమే రైల్వే మార్గాల విద్యుదీకరణ జరగ్గా, మోదీ పాలనలో (2023-24) ఆ సంఖ్య ఏకంగా 7,188 కిలోమీటర్లకు పెరిగిందని షా గణాంకాలను వివరించారు. చైనా (92%), స్పెయిన్ (68%), ఫ్రాన్స్ (60%), బ్రిటన్ (49%) వంటి దేశాలతో పోలిస్తే.. భారత రైల్వే ఇప్పటికే 99.6 శాతం విద్యుదీకరణను పూర్తి చేసుకుందని, మిగిలిన 0.4 శాతాన్ని కూడా త్వరలోనే పూర్తి చేసి 100 శాతం లక్ష్యాన్ని చేరుకుంటామని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు.