ముంబైలో తీవ్ర విషాదం.
* పబ్లిక్ టాయిలెట్‌లో విషవాయువు పీల్చి ఇద్దరు యువకుల మృతి.
ముంబై, మహా:
మహారాష్ట్ర రాజధాని ముంబై నగరంలో ఆదివారం తెల్లవారుజామున తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బహిరంగ మరుగుదొడ్డికి వెళ్లిన ఇద్దరు యువకులు అక్కడే స్పృహ తప్పి ప్రాణాలు కోల్పోయారు. ఏదైనా విషపూరిత రసాయన వాయువు లీక్ అవ్వడం వల్లే ఈ దుర్ఘటన జరిగి ఉంటుందని అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు.
వివరాల్లోకి వెళితే..
రామ్ మందిర్ ఈస్ట్ ప్రాంతం, మృణాల్ తాయీ వంతెన సమీపంలోని పార్సీ పంచాయత్ గేట్ వద్ద ఉన్న బీఎంసీ పబ్లిక్ టాయిలెట్‌కు ఆదివారం ఉదయం ఇద్దరు యువకులు వెళ్లారు. అయితే లోపలికి వెళ్లిన వారు ఎంతకూ బయటకు రాకపోవడం, అదే సమయంలో మరుగుదొడ్డి నుంచి బలమైన రసాయన వాసనలు వస్తుండటంతో స్థానికులు వెంటనే అధికారులకు సమాచారం అందించారు. అధికారులు ఘటనాస్థలికి చేరుకునేసరికి ఇద్దరు యువకులు లోపల అపస్మారక స్థితిలో పడి ఉన్నారు.
వెంటనే వారిని ట్రామా కేర్ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతులను ప్రభాకర్ ధనివర్ (24), భవిన్ దేశాయ్ (18)గా పోలీసులు గుర్తించారు.
విషవాయువు ఎక్కడి నుంచి వచ్చింది?
ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే ముంబై అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు, బీఎంసీ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. సమీపంలోని ఏదైనా చిన్న పారిశ్రామిక యూనిట్ నుంచి ఈ విషవాయువు లీకై గాలి ద్వారా ఇక్కడికి చేరిందా? లేక మరుగుదొడ్డి లోపలే ఏదైనా రసాయన చర్య జరిగిందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
ప్రస్తుతం ఘటనాస్థలిలో గాలి, ఇతర పదార్థాల నమూనాలను సేకరించి ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించారు. పోస్టుమార్టం మరియు రసాయన పరీక్షల నివేదికలు వచ్చిన తర్వాతే యువకుల మరణానికి గల ఖచ్చితమైన కారణాలు, ఏ వాయువు లీకైందనే విషయాలు స్పష్టమవుతాయని అధికారులు వెల్లడించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.






