బీసీ సంక్షేమానికి పెద్దపీట.
* నవంబర్ నుంచి ‘రాజీవ్ యువ వికాసం’
• విద్యార్థుల ఖాతాల్లోకి నేరుగా రూ.450 కోట్లు జమ
• విదేశీ విద్య దరఖాస్తుల గడువు అక్టోబర్ 15 వరకు పొడిగింపు
• బీసీ సంక్షేమ శాఖ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
హైదరాబాద్, మహా.
బీసీ సంక్షేమ పథకాల అమలులో వేగం పెంచడంతో పాటు, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఫలాలు అందేలా చూడాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ప్రజాభవన్లో సోమవారం బీసీ సంక్షేమ శాఖపై ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా విద్యార్థులకు చెల్లించే ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాలను ప్రభుత్వం ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) ద్వారా నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేస్తోందని భట్టి తెలిపారు. ఈ విధానం ద్వారా ఇప్పటికే 1.30 లక్షల మంది విద్యార్థుల ఖాతాల్లో ఎలాంటి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా రూ.450 కోట్లు జమ చేసినట్లు వెల్లడించారు. అలాగే, వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు ఏ నెలకు సంబంధించిన డైట్, కాస్మెటిక్ ఛార్జీలను అదే నెలలో వారి ఖాతాల్లో జమ చేయాలని, నిధుల విడుదలలో ఎలాంటి జాప్యం ఉండకూడదని అధికారులను స్పష్టంగా ఆదేశించారు.
బీసీ వర్గాల్లోని నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించి, వారిని ఆర్థికంగా ఉన్నత స్థితికి చేర్చే లక్ష్యంతో రూపొందించిన ‘రాజీవ్ యువ వికాసం’ పథకాన్ని నవంబర్ నుంచి ప్రారంభించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇప్పటికే వచ్చిన దరఖాస్తులను జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో పారదర్శకంగా పరిశీలించి, అర్హులను ఎంపిక చేయాలని సూచించారు. మరోవైపు విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించే బీసీ విద్యార్థులకు అందించే ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకం కింద ఈ ఏడాది రెండు విడతల్లో 180 మందికి రూ.18.40 కోట్లు విడుదల చేశామన్నారు. అర్హులైన విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా దరఖాస్తు గడువును అక్టోబర్ 15 వరకు పొడిగిస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
గీత కార్మికుల భద్రత కోసం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘కాటమయ్య రక్షణ కవచం’ పథకం కింద రూ.60 కోట్ల వ్యయంతో 50 వేల మందికి రక్షణ కిట్లు మంజూరు చేయగా, ఇప్పటికే 40 వేల మందికి పంపిణీ చేసినట్లు భట్టి వివరించారు. ప్రస్తుతం శిక్షణ పొందుతున్న మరో 10 వేల మందికి శిక్షణ పూర్తయిన వెంటనే కిట్లు అందజేస్తామన్నారు. ఈ సమీక్షలో పాల్గొన్న బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.. మహాత్మా జ్యోతిబా పూలే గురుకులాలకు సొంత భవనాలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేయగా, ఉప ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. గురుకులాలకు సంబంధించిన పెండింగ్ బిల్లులను త్వరలోనే క్లియర్ చేయడంతో పాటు, వివిధ బీసీ కుల సంఘాల ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి అవసరమైన నిధులను వెంటనే విడుదల చేస్తామని భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. సమావేశంలో ఆ శాఖ ముఖ్య కార్యదర్శి బాలామాయదేవి, గురుకులాల కార్యదర్శి సైదులు తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.








