Mahaa Daily Exclusive

  సర్కారు బడులను మూసేస్తే సహించం..

Share

  • సర్కారు బడులను మూసేస్తే సహించం
  • పేద పిల్లల విద్యా హక్కుల కోసం ఉద్యమిస్తాం
  • బీఆర్ఎస్ నేత దేవీ ప్రసాద్

హైదరాబాద్‌, మహా : తెలంగాణ పబ్లిక్‌ స్కూల్స్‌ (టీపీఎస్‌) పేరుతో ప్రభుత్వ పాఠశాలలను విలీనం చేసి మూసివేసే ప్రతిపాదనలను వెంటనే ఉపసంహరించుకోవాలని బీఆర్ఎస్ నేత దేవీ ప్రసాద్, ఎస్టీయూ మాజీ అధ్యక్షుడు బి.భుజంగరావు డిమాండ్‌ చేశారు. సర్కారు బడులను బలోపేతం చేయాలే తప్ప మూసివేయడం సరికాదన్నారు. పేద, మధ్య తరగతి కుటుంబాల పిల్లలకు సమీపంలోనే నాణ్యమైన విద్య అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న పాఠశాలలను మూసివేయడం కాకుండా అందుకు కారణాలను గుర్తించి ఉపాధ్యాయులు, మౌలిక వసతులు పెంచాలని సూచించారు. గ్రామాలు, తండాలు, మారుమూల ప్రాంతాల్లోని పిల్లలు దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తే చదువుకు దూరమయ్యే ప్రమాదం ఉందన్నారు.

పాఠశాలల సంఖ్య తగ్గింపు, టీపీఎస్‌ల ఏర్పాటు ప్రతిపాదనలపై ప్రభుత్వం ప్రజలకు పూర్తి వివరాలు వెల్లడించాలని డిమాండ్‌ చేశారు. బడుల పేర్లు మార్చడం, విలీనం చేయడం, క్లస్టర్లుగా ఏర్పాటు చేయడం విద్యా సంస్కరణ కాదన్నారు. పేద పిల్లలకు నివాస ప్రాంతాలకు సమీపంలో నాణ్యమైన విద్య అందించడమే అసలైన సంస్కరణ అని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు తగ్గడానికి గల కారణాలను ప్రభుత్వం అధ్యయనం చేయాలని కోరారు. ఉపాధ్యాయుల కొరత, మౌలిక వసతుల లోపాలు, విద్యా నాణ్యతకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని అన్నారు. బడులను మూసివేస్తే సమస్య పరిష్కారం కాదని స్పష్టం చేశారు.
ప్రభుత్వ పాఠశాలల మూసివేత, విలీన నిర్ణయాలను విరమించుకోకపోతే విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజలతో కలిసి పేద పిల్లల విద్యా హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.