- 2024 ఏప్రిల్ నుంచే ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ
- గెజిట్ నోటిఫికేషన్ జారీ
- ఉప ఎన్నికకు మరో ముందడుగు
హైదరాబాద్, మహా : ఖైరతాబాద్ ఎమ్మెల్యే స్థానం ఖాళీ అయినట్లు అసెంబ్లీ కార్యదర్శి తిరుపతి గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారు. 2024 ఏప్రిల్ 23 నుంచి ఖైరతాబాద్ స్థానం ఖాళీ అయినట్లు అందులో పేర్కొన్నారు. హైకోర్టు తీర్పునకు అనుగుణంగా సెప్టెంబర్ 26వ తేదీతో గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఇటీవల దానం నాగేందర్‌పై హైకోర్టు అనర్హత వేటు పడటంతో ఈ నోటిఫికేషన్ జారీ అయింది.
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచిన దానం నాగేందర్, ఆ తరువాత 2024 లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. దానం నాగేందర్ పార్టీ ఫిరాయించినా ఆయనపై చర్యలు తీసుకోకుండా గతంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పిటిషన్లను కొట్టివేశారని బీఆర్‌ఎస్ పేర్కొంది. స్పీకర్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఆ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.
విచారణ జరిపిన హైకోర్టు డివిజన్ బెంచ్, స్పీకర్ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేసింది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద దానం నాగేందర్ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ తీర్పును ఇచ్చింది. ఎమ్మెల్యేగా అనర్హుడని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్లు ప్రకటించి, ఉప ఎన్నిక నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ అయ్యాయి.
హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ దానం నాగేందర్ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు కూడా హైకోర్టు తీర్పును సమర్థిస్తూ దానం పిటిషన్‌ను తిరస్కరించింది. ఈ సందర్భంగా కోర్టు రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ (పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం) నిబంధనలను గుర్తు చేస్తూ వ్యాఖ్యలు చేసింది.








