Mahaa Daily Exclusive

  భూభారతి రీ-సర్వేను సద్వినియోగం చేసుకోవాలి..

Share

  • భూభారతి రీ-సర్వేను సద్వినియోగం చేసుకోవాలి
  • రైతులు భూ వివరాలను క్షుణ్ణంగా పరిశీలించుకోవాలి
  • వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

నర్సంపేట,మహా ;

రైతులు, భూ యజమానులు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి రీ-సర్వే ప్రక్రియను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద సూచించారు.
నర్సంపేట రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఖానాపూర్ మండలం రంగంపేట, నర్సంపేట మండలం రామవరం గ్రామాల్లో భూభారతి రీ-సర్వేలో భాగంగా నిర్వహించిన గ్రామ సభల్లో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భూభారతి కార్యక్రమం ద్వారా రైతుల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. సుమారు 100 సంవత్సరాల తర్వాత చేపడుతున్న రీ-సర్వేలో భూముల హద్దులు, విస్తీర్ణం, యాజమాన్య వివరాలను పకడ్బందీగా నమోదు చేయనున్నట్లు తెలిపారు.

రీ-సర్వే ప్రక్రియలో భాగంగా భూ యజమానులు, రైతులు తమ భూములకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని సూచించారు.
భూ వివరాల్లో ఏవైనా తప్పులు లేదా అభ్యంతరాలు ఉంటే గ్రామ సభలో అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు.
ప్రజలకు రీ-సర్వే ప్రక్రియపై పూర్తి అవగాహన కల్పించి, వారి సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

భూముల హద్దులు, రికార్డులను సక్రమంగా నమోదు చేయడం ద్వారా భవిష్యత్‌లో భూ వివాదాలు, ప్రజలకు ఎదురయ్యే ఇబ్బందులను నివారించవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు. గతంలో గొలుసుల సహాయంతో నిర్వహించే సర్వే ప్రక్రియకు భిన్నంగా ప్రస్తుతం ఆధునిక రోవర్ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ రీ-సర్వేను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

రీ-సర్వేపై రైతులకు, గ్రామస్థులకు పూర్తి అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.

నేటి నుంచి రీ-సర్వే..

నర్సంపేట మండలం రామవరం, ఖానాపూర్ మండలం రంగంపేట గ్రామాల్లో రీ-సర్వే పనులు సోమవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
రీ-సర్వే సజావుగా జరిగేలా గ్రామస్థులు, రైతులు అధికారులకు అవసరమైన సహకారం అందించాలని కోరారు.

ఎల్‌నినో పై అప్రమత్తంగా ఉండాలి

ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో భవిష్యత్‌లో తాగునీరు, పశువులకు నీటి లభ్యతపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని కలెక్టర్ తెలిపారు. రైతులు నీటి వనరులను దృష్టిలో ఉంచుకొని ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో నర్సంపేట ఆర్డీవో ఉమారాణి, ఏడీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శ్రీనివాసులు, నర్సంపేట, ఖానాపూర్ తహసీల్దార్లు రవిచంద్ర రెడ్డి, రమేష్, రంగంపేట సర్పంచ్ ఏ. రాజు, రామవరం సర్పంచ్ అర్ణం అనితతో పాటు రెవెన్యూ, సర్వే శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు, గ్రామస్థులు పాల్గొన్నారు.