- సాంకేతికతకే సవాల్ విసిరిన వింత ఘటన.
ఢిల్లీ, మహా.
ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌లో చోటుచేసుకున్న ఓ విచిత్ర ఘటన ఆధార్ బయోమెట్రిక్ వ్యవస్థకే సవాల్ విసిరింది. ఎవరి వేలిముద్రలు, కంటిపాప (ఐరిస్) నమూనాలు వారికే ప్రత్యేకం అని, ప్రపంచంలో ఇద్దరు వ్యక్తుల బయోమెట్రిక్స్ ఒకేలా ఉండవని భావించే ఆధునిక సాంకేతికత.. ఇద్దరు కవలల విషయంలో మాత్రం పూర్తిగా బోల్తా పడింది. రాంపూర్‌లోని ఖారీ కువాన్ ప్రాంతానికి చెందిన జుబేర్ ఇలియాస్ కుమార్తెలు ఖిజ్రా జుబేర్, తూబా జుబేర్ పదో తరగతి చదువుతున్నారు. రాబోయే బోర్డు పరీక్షల రిజిస్ట్రేషన్ కోసం వీరు బయోమెట్రిక్ వివరాలు అప్‌డేట్ చేస్తుండగా ఒకరి వేలిముద్రలు, కంటిపాపలు మరొకరితో నూరు శాతం సరిపోలడంతో ఆధార్ సిస్టమ్ దానిని డూప్లికేట్‌గా పరిగణించి రెండో అమ్మాయి అప్లికేషన్‌ను పదేపదే తిరస్కరించింది.
రాంపూర్‌లోని సెయింట్ మేరీస్ స్కూల్‌లో చదువుతున్న ఈ కవలల మధ్య ఉన్న అసాధారణ పోలికలు చూసి వారి కుటుంబ సభ్యులే ఆశ్చర్యపోయేవారు. ఒకసారి తండ్రి తన మొబైల్‌కు ఒక అమ్మాయి ముఖంతో ఫేస్ లాక్ సెట్ చేయగా, రెండో అమ్మాయి ముఖం చూపించినా ఆ ఫోన్ సులభంగా అన్‌లాక్ కావడం గమనార్హం. ముఖ కవళికల్లోనే కాకుండా కంటిపాపలు, వేలిముద్రల్లోనూ ఎటువంటి వ్యత్యాసం లేకపోవడంతో ఆధార్ ప్రక్రియ ముందుకు సాగలేదు. పదో తరగతి పరీక్షల రిజిస్ట్రేషన్ ఆగిపోయి విద్యార్థినుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందన్న తీవ్ర ఆందోళనతో వారి చిన్నాన్న మక్సూద్ అహ్మద్ తదితరులు స్థానిక ఆధార్ కేంద్రాల చుట్టూ తిరిగినా ఎలాంటి ప్రయోజనం శూన్యం.
చివరకు ఇక లాభం లేదనుకున్న కుటుంబ సభ్యులు రాంపూర్ జిల్లా మేజిస్ట్రేట్ (డీఎం) అజయ్ కుమార్ ద్వివేదిని ‘జనతా దర్శన్’ కార్యక్రమంలో కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. సమస్య తీవ్రతను, పిల్లల విద్యాభవిష్యత్తును దృష్టిలో ఉంచుకున్న కలెక్టర్.. దీనిని ‘రేయరెస్ట్ ఆఫ్ ది రేర్’ (అత్యంత అరుదైన) కేసుగా అభివర్ణించారు. కవలల్లో కూడా ఎక్కడో ఒకచోట బయోమెట్రిక్‌లో చిన్నపాటి తేడా ఉంటుందని, కానీ ఈ కేసులో ఏమాత్రం తేడా లేకపోవడం ఆశ్చర్యకరమని ఆయన వ్యాఖ్యానించారు. వెంటనే ఆయన ప్రత్యేక చొరవ తీసుకుని న్యూఢిల్లీలోని యూఐడీఏఐ ప్రధాన కార్యాలయంతో పాటు, లక్నోలోని ఉన్నతాధికారులతో నేరుగా సంప్రదింపులు జరిపారు.
దాదాపు మూడు నుంచి నాలుగు నెలల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ ప్రక్రియలో అధికారులు సాంకేతిక లోపాలను సునిశితంగా పరిశీలించారు. యూఐడీఏఐ నిపుణులు ప్రత్యేక మాన్యువల్ వెరిఫికేషన్ ద్వారా పాత రికార్డులను పూర్తిగా తొలగించి, ఇద్దరు విద్యార్థినులకు వేర్వేరుగా కొత్త ఆధార్ కార్డులను జారీ చేయడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మరోవైపు పదో తరగతి బోర్డు పరీక్షల రిజిస్ట్రేషన్ గడువు మించిపోతుండటంతో, కొత్తగా అప్‌డేట్ అయిన ఆధార్ కార్డులను డీఎం అజయ్ కుమార్ ఏకంగా నేరుగా వారి పాఠశాలకే పంపించి పిల్లల విద్యా సంవత్సరానికి ఎలాంటి ఆటంకం కలగకుండా చూశారు. సుమారు ఏడాదిన్నర పాటు ఎటు తేలని సమస్యకు, కలెక్టర్ చొరవతో పరిష్కారం లభించడంతో మానసిక క్షోభ అనుభవించిన కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకుని జిల్లా యంత్రాంగానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.







