ఐరాస భద్రతా మండలిలో భారత్‌కు రష్యా పూర్తి మద్దతు.
* పాశ్చాత్య దేశాల ప్రతిపాదనపై వ్యతిరేకత.
ఢిల్లీ, మహా.
ఐక్యరాజ్యసమితి 81వ సర్వసభ్య సమావేశాల వేదికగా అంతర్జాతీయ స్థాయిలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్ చేస్తోన్న సుదీర్ఘ ప్రయత్నాలు ఓ కొలిక్కి వస్తున్నట్లు కనిపిస్తున్నాయి. భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశంగా భారత్‌ను చేర్చుకోవాలన్న ప్రతిపాదనకు రష్యా నుంచి పూర్తి స్థాయి మద్దతు లభించింది. ప్రస్తుతం అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, చైనా దేశాలు భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశాలుగా కొనసాగుతుండగా.. త్వరలోనే వాటి సరసన చేరేందుకు భారత్‌కు ద్వారాలు తెరుచుకుంటున్నాయి.
ఈ సర్వసభ్య సమావేశాల్లో ప్రసంగించిన రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్.. భారత్‌కు శాశ్వత స్థానం కల్పించాలనే డిమాండ్‌ను అత్యంత గట్టిగా సమర్థించారు. ప్రపంచ వేదికలపై అభివృద్ధి చెందుతున్న గ్లోబల్ సౌత్ దేశాల ప్రాతినిధ్యాన్ని పెంచాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. ఆయా దేశాల ఆకాంక్షలను ప్రతిబింబించేలా భద్రతా మండలిని పునర్వ్యవస్థీకరించాలని, అందులో భాగంగా ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలకు సముచిత ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన బలంగా కోరారు. ఈ క్రమంలో భారత్‌తో పాటు బ్రెజిల్ అభ్యర్థిత్వాన్ని కూడా రష్యా సమర్థిస్తోందని లావ్రోవ్ వెల్లడించారు. భద్రతా మండలి సంస్కరణలు ప్రస్తుత ఐదు శాశ్వత దేశాల అధికారాల ప్రాముఖ్యతను తగ్గించేలా మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు.
భద్రతా మండలిలో పాశ్చాత్య దేశాలకు అదనపు స్థానాలు కేటాయించడాన్ని రష్యా తీవ్రంగా వ్యతిరేకించింది. మెజారిటీ పాశ్చాత్య దేశాలు ఉక్రెయిన్‌కు మద్దతు ఇస్తున్న నేపథ్యంలో వాటి సంఖ్యను భద్రతా మండలిలో పెంచాలన్న ప్రతిపాదనలను లావ్రోవ్ తప్పుపట్టారు. ప్రత్యేకించి జర్మనీ, జపాన్ దేశాలకు శాశ్వత స్థానాలు కల్పించడాన్ని ఆయన ఆక్షేపించారు. ఆ రెండు దేశాలు కూడా ప్రస్తుతం ప్రతీకార ధోరణి వైపు అడుగులు వేస్తున్నాయని లావ్రోవ్ ఆరోపించారు. పాశ్చాత్య దేశాల చేరికతో భద్రతా మండలిలో పశ్చిమ దేశాల ఆధిపత్యం మరింత పెరుగుతుందే తప్ప, ప్రపంచ శాంతికి ఎలాంటి ఉపయోగం ఉండబోదని ఆయన తేల్చిచెప్పారు.
ఐరాస సంస్కరణల విషయంలో రష్యాతో పాటు మారిషస్ నుంచి కూడా భారత్‌కు విశేష మద్దతు లభించింది. ఆ దేశ విదేశాంగ మంత్రి ధనంజయ్ రామ్‌ఫుల్ ఐరాస వేదికపై ప్రసంగిస్తూ.. అంతర్జాతీయ వ్యవహారాల్లో భారత్ అత్యంత బాధ్యతాయుతంగా, నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తోందని ప్రశంసించారు. ఈ నేపథ్యంలోనే భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించాలన్న ప్రతిపాదనలకు తమ దేశం తరపున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.






