Mahaa Daily Exclusive

  ఉగ్రవాదంపై ఉక్కుపాదం….

Share

ఉగ్రవాదంపై ఉక్కుపాదం.
* భారత్ విధానం ‘జీరో టాలరెన్స్’
• 2016 సర్జికల్ స్ట్రైక్స్‌ను గుర్తుచేసిన ప్రధాని మోదీ
• జనగణన జాతీయ బాధ్యత.. ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి.
• మాదకద్రవ్యాల రహిత సమాజం కోసం యువత కృషి అభినందనీయం
• ‘మన్ కీ బాత్’ 138వ ఎపిసోడ్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
న్యూఢిల్లీ, మహా.
ఉగ్రవాదంపై రాజీలేని పోరాటం చేస్తున్నామని, ఉగ్రవాద చర్యల పట్ల భారత్ ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని అవలంబిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఆదివారం ఆయన 138వ ‘మన్ కీ బాత్’ (మనసులోని మాట) కార్యక్రమంలో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. 2016లో పాక్ ఉగ్రస్థావరాలపై భారత సైన్యం జరిపిన సర్జికల్ స్ట్రైక్స్‌ను ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా గుర్తుచేశారు.
సర్జికల్ స్ట్రైక్స్‌తో దీటైన బదులు
2016 సెప్టెంబర్ 18న ఉరీలోని ఆర్మీ క్యాంపుపై జరిగిన ఉగ్రదాడికి ప్రతిస్పందనగా, సెప్టెంబర్ 28-29 రాత్రి భారత సైన్యం నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) దాటి ఉగ్రవాదుల లాంచ్ ప్యాడ్‌లపై సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించిందని మోదీ గుర్తుచేశారు. ఉగ్రవాదానికి భారత్ ఎంత దీటుగా, నిర్ణయాత్మకంగా బదులిస్తుందో చెప్పడానికి ఈ ఆపరేషన్ సరికొత్త ఉదాహరణగా నిలిచిందని, ఇది ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైందని పేర్కొన్నారు.
జాతీయ బాధ్యతగా జనగణన
దేశవ్యాప్తంగా జరగనున్న జనగణన (సెన్సస్) ప్రక్రియను ప్రధాని ప్రస్తావించారు. ఇది ప్రతి పౌరుడి జాతీయ బాధ్యత అని, అందరూ ఇందులో చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు. దేశ జనాభా, సామాజిక, ఆర్థిక సమాచార సేకరణలో పౌరుల భాగస్వామ్యం అత్యంత కీలకమని, ఇందుకు అందుబాటులో ఉన్న ఆన్‌లైన్ విధానాన్ని కూడా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
మోధేరా.. దేశంలోనే తొలి సోలార్ గ్రామం
గుజరాత్‌లోని చారిత్రక మోధేరా సూర్య దేవాలయం వెయ్యేళ్ల ప్రస్థానాన్ని మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. విదేశీ దండయాత్రల్లో విధ్వంసానికి గురైన ఆ ఆలయ పునర్నిర్మాణాన్ని గుర్తుచేశారు. ఆ గ్రామం నేడు దేశంలోనే మొట్టమొదటి ‘24×7 సోలార్ విలేజ్’గా ఆవిర్భవించడం గర్వకారణమన్నారు. మకర సంక్రాంతి తర్వాత ఇక్కడ జరిగే ‘మోధేరా నృత్య ఉత్సవం’లో భారతీయ శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని, జీవితంలో ఒక్కసారైనా భారతీయులంతా ఈ ప్రాంతాన్ని సందర్శించాలని కోరారు.
డ్రగ్స్ రహిత సమాజం.. స్వచ్ఛ భారత్
మాదకద్రవ్యాల మహమ్మారిని తరిమికొట్టేందుకు ‘నషా ముక్త్ యువ అభియాన్’ ద్వారా యువత ముందుకు రావడం అభినందనీయమన్నారు. అలాగే, రానున్న గాంధీ జయంతిని పురస్కరించుకుని స్వచ్ఛత నినాదాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌లో పురాతన కోనేరులు, బావులకు పునర్‌ వైభవం తీసుకొచ్చే దిశగా జరుగుతున్న పరిశుభ్రత కార్యక్రమాలను, ఢిల్లీలో పొడి, తడి చెత్తను వేర్వేరుగా సేకరించే విధానాన్ని, మధ్యప్రదేశ్‌లో నదిని శుభ్రం చేసిన ఓ యువకుడి చొరవను ప్రధాని ప్రశంసించారు.
అశోక్ సింఘాల్‌కు ఘన నివాళి
విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) మాజీ నేత అశోక్ సింఘాల్ జయంతిని పురస్కరించుకుని ప్రధాని మోదీ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. సమాజంలో ఉంటూనే ఆయన సన్యాసిలా జీవించారని కొనియాడారు. రామజన్మభూమి ఉద్యమానికి సింఘాల్ అందించిన శక్తి, దిశానిర్దేశం మరువలేనివని, అయోధ్యలో నిర్మితమైన భవ్య రామ మందిరం ఆయన విశేష కృషికి దక్కిన ఫలితమేనని మోదీ ప్రశంసించారు.