- ఊరువాడా ఉత్సాహంగా అమ్మకు అక్షరమాల
- చదువుకు వయసు అడ్డంకి కాదని చాటిన 6 లక్షల వయోజనులు
- ఉల్లాస్ పరీక్ష రాసిన వయోజనులకు మంత్రి సీతక్క అభినందనలు
- లక్ష్యం చేరే వరకు అక్షరాస్యత ఉద్యమం కొనసాగిస్తాం – మంత్రి సీతక్క
- ఉల్లాస్‌లో ఉత్తీర్ణులైన వారికి పదో తరగతి పరీక్ష రాసే అవకాశం
- అర్హులైన ప్రతి ఒక్కరూ త్వరగా దరఖాస్తు చేసుకోవాలి – మంత్రి సీతక్క
హైదరాబాద్, మహా :
ఏళ్ల తరబడి అక్షరాలకు దూరంగా ఉన్న వయోజనులు ఇప్పుడు తమ జీవితాల్లో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతున్నారు. తెలుగు అక్షరాలను గుర్తించలేని స్థితి నుంచి చదవడం, రాయడం, లెక్కలు చేయడం నేర్చుకున్న లక్షలాది మంది ఆదివారం ‘ఉల్లాస్’ పరీక్ష రాశారు. అమ్మకు అక్షరమాల కార్యక్రమంలో బాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ అసెస్మెంట్ టెస్ట్‌కు 6.32 లక్షల మంది వయోజనులు హాజరయ్యారు. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో 5.32 లక్షల మంది మహిళలు, పట్టణ ప్రాంతంలో లక్ష మంది వరకు పరీక్ష రాశారు. రాష్ట్రంలోని 124 పట్టణ స్థానిక సంస్థల్లో, అలాగే పరిధిలోని సర్కిళ్లలో పరీక్ష నిర్వహించారు.ఈ పరీక్షకు 98,324 మంది స్వయం సహాయక సంఘాల సభ్యులు, 720 మంది వీధి వ్యాపారులు హాజరై పరీక్ష రాశినట్లు, వయోజన విద్యాశాఖ సమన్వయంతో ఈ పరీక్షను నిర్వహించినట్లు సెర్ప్ అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా పరీక్ష రాసిన స్వయం సహాయక సంఘాల మహిళలు, ఇతర వయోజన అభ్యాసకులకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క అభినందనలు తెలిపారు. “అక్షరం నేర్చుకోవడం అంటే కేవలం చదవడం, రాయడం రావడం కాదు.. అది ఆత్మవిశ్వాసాన్ని సంపాదించుకోవడం. ఇంతకాలం వేలిముద్రతో తమ అవసరాలను పూర్తి చేసుకున్న మహిళలు ఇకపై తమ పేరును తామే రాసుకునే స్థాయికి రావడం ఒక గొప్ప మార్పు. చదువుకు వయసు లేదు.. నేర్చుకోవాలన్న సంకల్పమే ముఖ్యం” అని మంత్రి సీతక్క అన్నారు.
చిన్న వయసులోనే పెళ్లిళ్లు, కుటుంబ బాధ్యతలు, ఆర్థిక ఇబ్బందులు, ఉపాధి కోసం ఎదురైన పరిస్థితులు తదితర కారణాలతో చదువుకు దూరమైన మహిళలు రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఉన్నారని మంత్రి పేర్కొన్నారు. జీవితంలో ఏ దశలో చదువు ఆగిపోయినా, మళ్లీ అక్కడి నుంచే విద్యను కొనసాగించే అవకాశం ప్రభుత్వం కల్పిస్తోందన్నారు.
“ఒక మహిళ అక్షరాస్యురాలైతే ఒక్క వ్యక్తి మాత్రమే చదువుకున్నట్టు కాదు.. ఒక కుటుంబానికి వెలుగు వస్తుంది. ఆమె తన పిల్లల చదువును పట్టించుకుంటుంది, బ్యాంకు లావాదేవీలను అర్థం చేసుకుంటుంది, ఆరోగ్యం గురించి తెలుసుకుంటుంది, ప్రభుత్వ పథకాలను స్వయంగా తెలుసుకుని వినియోగించుకోగలుగుతుంది. అందుకే మహిళా అక్షరాస్యతను కేవలం విద్యాశాఖ కార్యక్రమంగా కాకుండా సామాజిక మార్పు ఉద్యమంగా చూడాలి” అని సీతక్క స్పష్టం చేశారు.
గ్రామంలోనే చదువు.. ఖర్చు లేకుండా విద్య
తెలంగాణ ప్రభుత్వం ‘అమ్మకు అక్షరమాల’ పేరుతో అక్షరాస్యతకు ప్రత్యేక ప్రాధాన్యం కల్పిస్తూ అక్షరాస్యత కార్యక్రమాలను అమలు చేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో స్వయం సహాయక సంఘాల మహిళలను గుర్తించి, వారి నివాస ప్రాంతాల్లోనే విద్యను అందించేలా చర్యలు చేపడుతోంది. సెర్ప్ ఆధ్వర్యంలో ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంతో ఈ ప్రయత్నాలకు మరింత ఊతమిస్తోంది. విద్య కోసం మహిళలు ప్రత్యేకంగా ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేకుండా గ్రామాల్లోనే అభ్యసించే అవకాశం కల్పిస్తున్నారు. ఎటువంటి ఫీజు లేకుండా అక్షరాస్యతను అందించడం ద్వారా చదువు అందరికీ అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
2025-26 సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లక్షల మంది నిరక్షరాస్యులుగా అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా 13 లక్షల మంది వయోజన నిరక్షరాస్యులకు 100 రోజులపాటు విద్యా కేంద్రాల్లో ఈ ఏడాది శిక్షణ అందించారు. అభ్యాసకుల కోసం ప్రభుత్వం ‘అక్షర వికాసం’ పేరుతో ప్రత్యేక పుస్తకాలను రూపొందించి అందించింది. తెలుగు అక్షరాలు చదవడం, రాయడం, అంకెలను గుర్తించడం, కూడికలు, తీసివేతలతో పాటు రోజువారీ జీవితానికి అవసరమైన అనేక అంశాలను ఈ పుస్తకాల ద్వారా నేర్పించారు.
మార్చి పరీక్షలో 5.20 లక్షల మంది ఉత్తీర్ణత
ఈ కార్యక్రమంలో భాగంగా మార్చి నెలలో 6.29 లక్షల మంది చదవడం, రాయడం, లెక్కలపై పరీక్ష రాశారు. జూన్‌లో విడుదలైన ఫలితాల్లో 5.21 లక్షల మంది వరకు ఉత్తీర్ణులయ్యారు. వారికి జాతీయ సార్వత్రిక విద్యాపీఠం నుంచి అక్షరాస్యత ధ్రువీకరణ పత్రాలు అందాయి. కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం నాడు నిర్వహించిన ఉల్లాస్ పరీక్షకు 6.32 లక్షల మందికి పైగా హాజరుకావడం ద్వారా అక్షరాస్యత కార్యక్రమంపై వయోజనుల్లో పెరుగుతున్న ఆసక్తి స్పష్టమవుతోందని అధికారులు తెలిపారు.
అక్షరాస్యతతో పాటు తదుపరి విద్యకు అవకాశం
ఉల్లాస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారికి భవిష్యత్‌లో విద్యను కొనసాగించేందుకు అవకాశాలు కల్పిస్తున్నారు. వారు పదో తరగతి పరీక్ష రాసేందుకు అవకాశం కల్పిస్తున్నారు. 2026–27 విద్యా సంవత్సరానికి తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీలో ప్రవేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో, మహిళలు పెద్ద సంఖ్యలో ఓపెన్ స్కూల్ విద్యను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సీతక్క కోరారు.
తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ, హిందీ తదితర భాషల్లో సబ్జెక్టులను ఎంచుకునే అవకాశం ఉందని, కుట్టు, కంప్యూటర్, ఎలక్ట్రీషియన్, బ్యూటీషియన్ వంటి వృత్తి కోర్సులను కూడా అదనంగా నేర్చుకునే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. ఆసక్తి ఉన్నవారు సమీపంలోని మీసేవ కేంద్రం లేదా స్టడీ సెంటర్‌ను సంప్రదించడంతో పాటు telanganaopenschool.org వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని మంత్రి సూచించారు.
మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడం ఎంత ముఖ్యమో, వారిని విద్యావంతులుగా తీర్చిదిద్దడం కూడా అంతే ముఖ్యం. చేతిలో పొదుపు పుస్తకం ఉండాలి.. అదే సమయంలో దానిలో ఏముందో చదివే అక్షరజ్ఞానం కూడా ఉండాలి. ప్రభుత్వ పథకం ఏమిటో తెలుసుకునే హక్కు, తన హక్కులను చదివి అర్థం చేసుకునే శక్తి ప్రతి మహిళకు ఉండాలి అని మంత్రి పేర్కొన్నారు. మహిళల ఆర్థిక, విద్యా, సామాజిక సాధికారతను సమాంతరంగా ముందుకు తీసుకెళ్లడమే ఇందిరా మహిళా శక్తి లక్ష్యమని ఆమె తెలిపారు. అక్షరాస్యత ఉద్యమం ఆగదు.. లక్ష్యం చేరే వరకు కొనసాగుతుంది అని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.







