Mahaa Daily Exclusive

  మన్మోహన్‌సింగ్‌కు భారతరత్న ఇవ్వాలి….

Share

మన్మోహన్‌సింగ్‌కు భారతరత్న ఇవ్వాలి.
* ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి.
హైదరాబాద్, మహా.

హైదరాబాద్‌లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ (విప్రో సర్కిల్) వద్ద మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. మన్మోహన్ సింగ్ జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. అలాగే, అక్కడ నూతనంగా ఏర్పాటు చేసిన మన్మోహన్ సింగ్ స్మారక పార్కును కూడా సీఎం ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. పరిపాలనలో మన్మోహన్ సింగ్ తీసుకున్న నిర్ణయాలు అత్యంత గొప్పవని, ఆయన దేశం గర్వించదగిన జాతిరత్నం అని కొనియాడారు. దేశానికి ఆయన చేసిన సేవలకు గాను ‘భారతరత్న’ పురస్కారం ఇవ్వకపోవడం శోచనీయమని అన్నారు. పార్టీలకు అతీతంగా మేధావులను గౌరవించుకోవాలని సూచిస్తూ, మన్మోహన్‌కు భారతరత్న ప్రకటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. దిల్లీలో ఆయన పేరిట ఒక విజ్ఞాన కేంద్రం, స్మారకాన్ని నిర్మించాలని కేంద్రాన్ని కోరారు. పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ కలిసి తెచ్చిన సరళీకృత ఆర్థిక విధానాల వల్లే నేడు దేశం ఆర్థికంగా బలపడిందని, అలాంటి ఆలోచనల వల్లే నేడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లు ఏర్పడ్డాయని సీఎం గుర్తుచేశారు. తెలంగాణ ఏర్పాటులో సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ పాత్ర చరిత్రలో సుస్థిరంగా నిలిచిపోతుందన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ.. దేశంలో విద్యా హక్కు , సమాచార హక్కు , ఉపాధి హామీ చట్టాలను తీసుకువచ్చింది మన్మోహన్ సింగే అని ప్రశంసించారు. ఆయన రాజ్యసభకు ఎంపికైన కొత్తలో తన కేసు వాదించేందుకు న్యాయవాదికి ఫీజు ఇవ్వలేని ఆర్థిక పరిస్థితిలో ఉండేవారని, ఆయన నిజాయితీ అలాంటిదని జస్టిస్ ఎన్వీ రమణ గుర్తుచేసుకున్నారు.
మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, ఆర్థిక కార్యదర్శిగా, ఆర్థిక మంత్రిగా, ప్రధాన మంత్రిగా దేశానికి మన్మోహన్ విశేష సేవలు అందించారని, తెలంగాణ ఏర్పాటు ప్రధాన కారకుల్లో ఆయన ఒకరని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.