Mahaa Daily Exclusive

  ఎన్నారైలకు శ్రీవారి హుండీ విదేశీ నాణేలు!

Share

ఎన్నారైలకు శ్రీవారి హుండీ విదేశీ నాణేలు!
• ఐదేళ్ల తర్వాత మళ్లీ ప్రారంభమైన ప్రత్యేక కార్యక్రమం
• ‘సెవెన్ హిల్స్ టు సెవెన్ కాంటినెంట్స్’ పేరుతో ఏపీఎన్ఆర్టీ పునరుద్ధరణ
• 25 డాలర్లకు.. 20 డాలర్ల విలువైన అమెరికా నాణేల బాక్సు
• తాడేపల్లి కార్యాలయంలో విక్రయాలు: ఏపీఎన్‌ఆర్‌టీ అధ్యక్షుడు వేమూరు రవికుమార్
తిరుమల, మహా.
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి హుండీలో భక్తులు కానుకగా సమర్పించిన విదేశీ నాణేలు.. విదేశాల్లో స్థిరపడిన తెలుగువారికి (ఎన్నారైలకు) మళ్లీ అందుబాటులోకి వచ్చాయి. ఐదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఏపీఎన్‌ఆర్‌టీ (ఆంధ్రప్రదేశ్ నాన్-రెసిడెంట్ తెలుగు) సొసైటీ.. ‘సెవెన్ హిల్స్ టు సెవెన్ కాంటినెంట్స్’ పేరుతో ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని పునరుద్ధరించింది. శ్రీవారి పాదాల చెంతకు చేరిన ఈ నాణేలను పవిత్రంగా భావించే ఎన్నారైల కోసం రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
అసలేంటీ కార్యక్రమం?
శ్రీవారిని దర్శించుకునే విదేశీ భక్తులు, ఎన్నారైలు హుండీలో విదేశీ కరెన్సీ నోట్లతో పాటు నాణేలను కూడా భారీగా కానుకగా సమర్పిస్తుంటారు. అయితే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిబంధనల ప్రకారం.. బ్యాంకులు కేవలం విదేశీ కరెన్సీ నోట్లను మాత్రమే స్వీకరిస్తాయి. నాణేలను తీసుకోవు. దీంతో టీటీడీ వద్ద భారీగా విదేశీ నాణేలు నిల్వ ఉండిపోతున్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా 2019కి ముందున్న టీడీపీ ప్రభుత్వం.. టీటీడీ నుంచి ఆ నాణేలను కొనుగోలు చేసి ఎన్నారైలకు అందించే వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది. అప్పట్లో సుమారు రూ. 10 లక్షల విలువైన అమెరికా నాణేలను ఏపీఎన్ఆర్టీ కొనుగోలు చేసింది. అయితే, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ కార్యక్రమం పూర్తిగా నిలిచిపోవడంతో ఆ నాణేలన్నీ సొసైటీ వద్దే ఉండిపోయాయి. తాజాగా కూటమి ప్రభుత్వం ఏర్పడటంతో ఈ కార్యక్రమానికి మళ్లీ ప్రాణం పోశారు.
అందుబాటులో అమెరికా నాణేలు..
స్వామివారి హుండీలోని ఈ విదేశీ నాణేలను ఆకర్షణీయమైన అందమైన బాక్సులలో ప్యాక్ చేసి ఏపీఎన్ఆర్టీ సిద్ధంగా ఉంచింది. ప్రస్తుతానికి అమెరికా డాలర్ నాణేలు మాత్రమే అందుబాటులో ఉన్నాయని ఏపీఎన్‌ఆర్‌టీ సొసైటీ అధ్యక్షుడు వేమూరు రవికుమార్ తెలిపారు. ఒక్కో బాక్సులో 20 డాలర్ల (అమెరికా) విలువైన నాణేలు ఉంటాయని, వాటిని 25 డాలర్లకు ఎన్నారైలకు అందిస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ పవిత్రమైన నాణేలు కావాలనుకునే ఎన్నారైలు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఏపీఎన్‌ఆర్‌టీ కార్యాలయాన్ని సంప్రదించి కొనుగోలు చేయవచ్చని సూచించారు. త్వరలో ఇతర దేశాలకు చెందిన నాణేలను కూడా అందుబాటులోకి తెచ్చే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు.