భద్రాచలం వద్ద ఉగ్రరూపం దాల్చుతున్న గోదావరి.
* 9 లక్షల క్యూసెక్కులకు చేరనున్న వరద!
• ఎగువ నుంచి పోటెత్తుతున్న వరద ప్రవాహం
• ప్రభావిత జిల్లాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాల మోహరింపు
• ఉప్పొంగే వాగులు, కాజ్‌వేలు దాటొద్దని అధికారుల హెచ్చరిక
• లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన
భద్రాచలం,మహా.
భద్రాచలం వద్ద గోదావరి నది ఉగ్రరూపం దాల్చుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వస్తున్న వరద నీటితో నదిలో నీటిమట్టం అంతకంతకూ పెరుగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద వరద ఉద్ధృతి ఏకంగా 8 నుంచి 9 లక్షల క్యూసెక్కులకు చేరే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో గోదావరి పరీవాహక, లోతట్టు ప్రాంతాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
పెరుగుతున్న నీటిమట్టాలు ఇవే..
రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 40 అడుగులకు చేరింది. అలాగే కూనవరం వద్ద 14.8 మీటర్లు, పోలవరం వద్ద 9.98 మీటర్ల మేర నీటిమట్టం నమోదైంది. మరోవైపు ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ వద్ద ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 5.61 లక్షల క్యూసెక్కులుగా కొనసాగుతోంది. అయితే, వరద గరిష్ఠ స్థాయికి చేరిన అనంతరం క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు.
రంగంలోకి సహాయక బృందాలు
వరద ప్రభావిత జిల్లాల్లో ఎలాంటి విపత్కర పరిస్థితులు తలెత్తినా ఎదుర్కొనేందుకు, అత్యవసర సహాయక చర్యల నిమిత్తం ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచినట్లు ప్రఖర్ జైన్ వెల్లడించారు. లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉంటూ సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించారు. ముఖ్యంగా ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగులు, కల్వర్టులు, కాజ్‌వేల వద్ద ప్రమాదకరంగా ప్రయాణాలు చేయవద్దని, వరద ప్రవాహాన్ని దాటే ప్రయత్నం చేయవద్దని ఆయన ప్రజలను హెచ్చరించారు.







