సిరిసిల్లకు సీఎం రేవంత్.. పర్యటనకు ముందే కేటీఆర్ సవాల్!
• భూ ఆరోపణలపై ఆధారాలు బయటపెట్టాలి.
• శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్.
• నేతన్నలు, రైతుల సమస్యలపై స్పష్టత ఇవ్వాలి.
• సీఎం పర్యటన నేపథ్యంలో కేటీఆర్ బహిరంగ లేఖ.
సిరిసిల్ల,మహా.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిరిసిల్ల పర్యటనకు సిద్ధమవుతున్న వేళ రాష్ట్రంలో రాజకీయ వేడి రాజుకుంది. సీఎం పర్యటనకు ముందుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఆయనకు బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖ ద్వారా నియోజకవర్గానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీశారు. గత అసెంబ్లీ సమావేశాల్లో సిరిసిల్ల భూములపై సీఎం చేసిన ఆరోపణలకు సంబంధించి పూర్తి ఆధారాలు ప్రజల ముందుంచాలని ఆయన డిమాండ్ చేశారు.
భూ ఆరోపణలపై శ్వేతపత్రం కోరుతూ..
సిరిసిల్లలో 8 వేల ఎకరాల భూమికి సంబంధించిన ఆరోపణలపై కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. అందులో 2,400 ఎకరాలను రికవరీ చేసినట్లు ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో.. ఆ భూములు ఏ మండలం, ఏ గ్రామం, ఏ సర్వే నంబర్ల పరిధిలో ఉన్నాయో ఖచ్చితమైన ఆధారాలతో సహా బయటపెట్టాలని ఆయన కోరారు. ఈ మొత్తం వ్యవహారంపై ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
నేతన్నలు, రైతుల సమస్యల ప్రస్తావన
సిరిసిల్ల ప్రాణాధారమైన చేనేత, జౌళి రంగాల సంక్షోభాన్ని కేటీఆర్ తన లేఖలో ప్రధానంగా ప్రస్తావించారు. నేతన్నలకు ప్రభుత్వం చెల్లించాల్సిన సుమారు రూ.60 కోట్ల బకాయిలను ఎప్పుడు విడుదల చేస్తారని ప్రశ్నించారు. ఉపాధి కల్పించే బతుకమ్మ చీరల పంపిణీ పథకాన్ని ఎందుకు నిలిపివేశారో కారణం చెప్పాలని, అలాగే యార్న్ సబ్సిడీ, నేతన్న బీమా వంటి పథకాలను పునరుద్ధరించాలని కోరారు. ఇక రైతుల విషయానికొస్తే, రూ.2 లక్షల రుణమాఫీ ప్రక్రియ, రైతుభరోసా బకాయిల విడుదలకు సంబంధించి స్పష్టమైన తేదీలు ప్రకటించాలని సీఎంను డిమాండ్ చేశారు.
ఆరు గ్యారెంటీల అమలుపై నిలదీత
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుపైనా కేటీఆర్ విమర్శలు గుప్పించారు. మహిళలకు నెలవారీ ఆర్థిక సాయం, ఆసరా పెన్షన్లు, కల్యాణలక్ష్మి, ఆటో డ్రైవర్లకు సాయం తదితర హామీలు ఎప్పుడు అమలవుతాయో తేదీలు ప్రకటించాలని కోరారు. అలాగే, సిరిసిల్ల నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ కళాశాల నిధులు, పాఠశాలలు, మౌలిక వసతులు, జౌళి రంగ ప్రాజెక్టుల అభివృద్ధి పనులపై సీఎం స్పష్టత ఇవ్వాలని కేటీఆర్ తన లేఖలో డిమాండ్ చేశారు. సీఎం పర్యటనకు ముందే కేటీఆర్ సంధించిన ఈ ప్రశ్నలతో సిరిసిల్ల పర్యటన రాజకీయంగా అత్యంత ఆసక్తికరంగా మారింది.







