- హుస్సేన్‌సాగర్ తీరాన 35 వేల మందితో ‘పింక్ పవర్ రన్ 3.0’
- రొమ్ము క్యాన్సర్‌పై అవగాహనకు కదలిన రన్నర్స్
- 21కే హాఫ్ మారథాన్‌కు పలు దేశాల నుంచి రన్నర్లు.. రూ.75 లక్షల నగదు బహుమతులు
- ప్రముఖులు, క్రీడాకారులు, సినీ తారలతో ఉత్సాహభరితంగా మూడో ఎడిషన్
హైదరాబాద్, మహా :రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన.. ముందస్తు గుర్తింపు ప్రాధాన్యంపై చైతన్యం.. మహిళల ఆరోగ్య సంరక్షణ, సాధికారతకు మద్దతుగా హైదరాబాద్ పరుగులు తీసింది. మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్), సుధారెడ్డి ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన ‘పింక్ పవర్ రన్ 3.0’కు ఆదివారం అపూర్వ స్పందన లభించింది. హుస్సేన్‌సాగర్ తీరంలోని హెచ్ఎండీఏ గ్రౌండ్స్ నుంచి ప్రారంభమైన ఈ మెగా కమ్యూనిటీ రన్లో దాదాపు 35 వేల మందికి పైగా పాల్గొన్నారు. ఆరోగ్యం, ఫిట్నెస్, ముందస్తు వైద్య పరీక్షలు, రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమం.. హైదరాబాద్‌లో అతిపెద్ద కమ్యూనిటీ ఫిట్నెస్ కార్యక్రమాల్లో ఒకటిగా నిలిచింది.
పింక్ పవర్ రన్లో నాలుగు విభాగాల్లో పోటీలు నిర్వహించారు. 21 కిలోమీటర్ల హాఫ్ మారథాన్, 10 కిలోమీటర్లు, 5 కిలోమీటర్లు, 3 కిలోమీటర్ల పరుగులు నిర్వహించారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అన్ని వయసుల వారు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఐదేళ్ల చిన్నారులతో పాటు 80 ఏళ్లకు పైబడిన వృద్ధులు, దివ్యాంగులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమం స్ఫూర్తిని చాటారు.
అంతర్జాతీయ రన్నర్లతో హాఫ్ మారథాన్
21 కిలోమీటర్ల హాఫ్ మారథాన్‌కు అంతర్జాతీయ స్థాయిలో స్పందన లభించింది. అమెరికా, ఇంగ్లాండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇథియోపియా, ఉగాండా, శ్రీలంక, ఐస్లాండ్, టాంజానియా, బోట్స్వానా, కెన్యా, కెనడా తదితర దేశాల నుంచి రన్నర్లు పాల్గొన్నారు. దేశ, విదేశాలకు చెందిన రన్నర్లతో నెక్లెస్‌రోడ్డుపై అంతర్జాతీయ క్రీడా వాతావరణం నెలకొంది.
పింక్ పవర్ రన్‌ను తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క), తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్, ఎంఈఐఎల్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ పీవీ కృష్ణారెడ్డి, సుధా రెడ్డి ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు సుధా రెడ్డి, హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ జనరల్ లారా విలియమ్స్, ఓలెక్ట్రా గ్రీన్‌టెక్ (ఈవీ ట్రాన్స్) ఉపాధ్యక్షుడు వీవీ లక్ష్మీనారాయణ తదితరులు జెండా ఊపి ప్రారంభించారు. సినీ నటుడు సిద్దు జొన్నలగడ్డ, మాజీ ప్రపంచ సుందరి ఓపల్ సుచేత, భారత ప్రొఫెషనల్ బాక్సర్ విజేందర్ సింగ్, నారాయణ గ్రూప్ విద్యాసంస్థల డైరెక్టర్ పునీత్, అవినాష్ గ్రూప్ సంస్థల చైర్మన్ అవినాష్ తదితరులు పాల్గొని రన్నర్లలో ఉత్సాహం నింపారు.
పింక్ పవర్ రన్లో మహారాష్ట్రకు చెందిన రమాబాయి రణ్వీర్ పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బీడ్ జిల్లా అంబాజోగైకి చెందిన 47 ఏళ్ల రమాబాయి.. తన పిల్లల చదువుల కోసం గతంలో చెప్పులు లేకుండా ఐదు కిలోమీటర్లు పరుగెత్తి వార్తల్లో నిలిచారు. ఆమె పింక్ పవర్ రన్లో పాల్గొనడం ద్వారా మహిళల పట్టుదల, ఆరోగ్యంపై అవగాహన, సామాజిక బాధ్యతకు ప్రతీకగా నిలిచింది.
విజేతలకు రూ.75 లక్షల బహుమతులు
వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు నిర్వాహకులు మొత్తం రూ.75 లక్షల విలువైన నగదు బహుమతులు అందించారు. నగదుతోపాటు మెడల్స్, ట్రోఫీలను నిర్వాహకులు, ముఖ్య అతిధులు అందజేశారు. 21కే హాఫ్ మారథాన్ పురుషుల విభాగంలో సునీల్ కుమార్ ప్రథమ స్థానంలో నిలవగా.. మహిళల విభాగంలో సోనమ్ విజేతగా నిలిచారు. 10కే రన్ పురుషుల విభాగంలో హరీష్ షరీన్ తొలి స్థానాన్ని సాధించగా.. మహిళల విభాగంలో వందన పటేల్ విజేతగా నిలిచారు. 5కే రన్ పురుషుల విభాగంలో లవ్ చౌధరి మొదటి స్థానంలో నిలవగా.. మహిళల విభాగంలో అంజలి విజయం సాధించారు.
ఆరోగ్యంపై చైతన్యం పెరగాలి: సీతక్క
మంత్రి దనసరి అనసూయ (సీతక్క) మాట్లాడుతూ.. ఆరోగ్య పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. హైదరాబాద్ మొత్తం ఈ కార్యక్రమానికి ఏకమైందని పేర్కొన్నారు. సుధా రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన పింక్ పవర్ రన్లో యువత పెద్ద సంఖ్యలో పాల్గొనడం అభినందనీయమన్నారు. సమాజంలో ఆరోగ్యంపై చైతన్యం పెంచేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని తెలిపారు.
*ఆరోగ్యమే నిజమైన సంపద: పీవీ కృష్ణారెడ్డి*
ఎంఈఐఎల్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ పీవీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. జీవనశైలి వ్యాధులను నివారించేందుకు రోజువారీ వ్యాయామం ఎంతో అవసరమన్నారు. క్రమం తప్పకుండా శారీరక వ్యాయామం చేయడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు. వ్యక్తిగత ఆరోగ్యమే కాకుండా ఆరోగ్యకరమైన జీవనశైలి నిజమైన సంపద అని పేర్కొన్నారు.
హైదరాబాద్‌కు ఉత్తమ అనుభవం ఇవ్వాలన్నదే లక్ష్యం: సుధా రెడ్డి
సుధా రెడ్డి ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు సుధా రెడ్డి మాట్లాడుతూ.. పింక్ పవర్ రన్ మూడో ఏడాదికి చేరుకోవడం ఆనందంగా ఉందన్నారు. హైదరాబాద్‌లో పెరిగిన తమకు నగరానికి అత్యుత్తమ కార్యక్రమాలను అందించాలన్నదే లక్ష్యమని తెలిపారు. పింక్ పవర్ రన్‌కు తరలివచ్చిన భారీ జనసందోహం చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందని.. కార్యక్రమం మొత్తం ఉత్సాహభరిత వాతావరణంలో సాగిందని చెప్పారు. గణేశ్ నిమజ్జన సందడితోపాటు నగరంలో పింక్ పవర్ రన్ ఉత్సాహం కనిపించిందన్నారు. ఫిట్నెస్, ఆరోగ్యానికి ప్రతి ఒక్కరూ అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ఆమె పిలుపునిచ్చారు. ఇక్కడి నుంచి తీసుకెళ్లే ఆరోగ్య స్ఫూర్తిని కుటుంబం, స్నేహితులు, సమాజంలోకి తీసుకెళ్లాలని కోరారు. పింక్ పవర్ రన్లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ఒక సెలబ్రిటీనే అని అభివర్ణించారు.
రెండోసారి పాల్గొన్న ఓపల్ సుచేత
మాజీ ప్రపంచ సుందరి ఓపల్ సుచేత చువాంగ్స్రీ వరుసగా రెండోసారి పింక్ పవర్ రన్లో పాల్గొన్నారు. రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కల్పించడం మంచి లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. 10కే, 5కే పరుగులను ప్రారంభించడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. రొమ్ము క్యాన్సర్ అవగాహనపై తాను పనిచేస్తున్నందున ఈ కార్యక్రమం తనకు ప్రత్యేకమైనదని తెలిపారు.
మహిళల సాధికారతకు వేదిక: విజేందర్ సింగ్
భారత ప్రొఫెషనల్ బాక్సర్ విజేందర్ సింగ్ మాట్లాడుతూ.. మహిళలను ఒకచోట చేర్చి వారికి సాధికారత కల్పించే కార్యక్రమంగా పింక్ పవర్ రన్ నిలుస్తోందన్నారు. సుధా రెడ్డి చేపట్టిన ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందని చెప్పారు. అద్భుతమైన వాతావరణం కనిపిస్తోందని.. అందరూ పరుగెత్తుతూ, నిరంతరం శ్రమిస్తూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
మంచి కారణం కోసం మంచి కార్యక్రమం: సిద్దు*
సినీ నటుడు సిద్దు జొన్నలగడ్డ మాట్లాడుతూ.. పింక్ పవర్ రన్ ఎంతో మంచి కారణం కోసం నిర్వహిస్తున్న కార్యక్రమమన్నారు. ప్రతి ఏడాది సుధా రెడ్డి, పీవీ కృష్ణారెడ్డి ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు.
రన్నర్లలో ఉత్సాహం నింపిన థమన్ సంగీతం
ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్.ఎస్. థమన్ నిర్వహించిన ప్రత్యక్ష సంగీత కార్యక్రమం పింక్ పవర్ రన్‌కు మరింత ఉత్సాహాన్ని జోడించింది. రన్ పూర్తిచేసిన రన్నర్లు సంగీత కార్యక్రమాన్ని ఆస్వాదిస్తూ సందడి చేశారు. ప్రముఖులు సైతం రన్నర్లతో సెల్ఫీలు దిగుతూ వారిని అభినందించారు.
10కే పరుగులో లారా విలియమ్స్
హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ జనరల్ లారా విలియమ్స్ స్వయంగా 10కే పరుగులో పాల్గొన్నారు. సుధా రెడ్డి, పీవీ కృష్ణారెడ్డి, ఓపల్ సుచేత తదితరులు 5కే, 10కే పరుగుల్లో పాల్గొని రన్నర్లతో కలిసి పరుగులు తీశారు.
ప్రతి ఒక్కరిలోనూ ఆరోగ్య స్ఫూర్తి
పింక్ పవర్ రన్ 3.0లో చిన్నారులు, యువత, మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు, న్యూరోడైవర్జెంట్ వ్యక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కల్పించడంతోపాటు ముందస్తు వైద్య పరీక్షల ప్రాధాన్యాన్ని ప్రజలకు తెలియజేయడంలో ఈ కార్యక్రమం వేదికగా నిలిచింది. రొమ్ము క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించడం, ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వంటి సందేశాలను సమాజంలోని అన్ని వర్గాలకు చేరవేయడమే లక్ష్యంగా పింక్ పవర్ రన్ ఉద్యమాన్ని మరింత విస్తరించేందుకు నిర్వాహకులు తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమానికి యాంకర్ సుమ వ్యాఖ్యాతగా వ్యవహరించారు.







