Mahaa Daily Exclusive

  మార్చి నాటికి ‘యంగ్ ఇండియా’ స్కూళ్ల నిర్మాణం పూర్తి కావాలి.: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Share

ఖమ్మం, మహా.
మధిర నియోజకవర్గం బోనకల్ మండలం లక్ష్మీపురంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్’ పనులను వచ్చే మార్చి నాటికి పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు అధికారులను, గుత్తేదారులను ఆదేశించారు. ఆదివారం ఆయన జిల్లా కలెక్టర్ టీఎస్ దివాకర, వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్‌తో కలిసి నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా నిర్మాణంలో ఉన్న తరగతి గదులు, హాస్టల్ సముదాయాలు, సైన్స్ మరియు కంప్యూటర్ ల్యాబ్‌లతో పాటు కిచెన్, డైనింగ్ హాళ్ల పనులను ఉప ముఖ్యమంత్రి నిశితంగా పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ స్ట్రక్చర్‌ నిర్మాణంతో పాటు, ఆకాడమిక్ 3, 4 బ్లాకుల ఫ్రంట్, బ్యాక్ వింగ్‌ల పనులు పూర్తయినట్లు ఆయన వెల్లడించారు. అలాగే 1, 2 బ్లాకుల్లో బ్యాక్ వింగ్ పూర్తి కాగా, ఫ్రంట్ వింగ్ పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. మొత్తం 9 సీనియర్ హాస్టళ్లకు గాను 3 పూర్తయ్యాయని, రెండు నిర్మాణ దశలో ఉండగా, మరో నాలుగు భవనాలు బేస్‌మెంట్ వరకు వచ్చాయని చెప్పారు. 4 జూనియర్ హాస్టళ్లు, పేరెంట్స్ వెయిటింగ్ హాల్ స్లాబ్ పనులు పూర్తయ్యాయని వివరించారు. పనుల్లో ఎలాంటి అలసత్వం, జాప్యం వహించకుండా కార్మికుల సంఖ్యను పెంచుకుని నిర్దేశిత గడువు (మార్చి)లోగా పనులన్నీ పూర్తి చేయాలని అధికారులకు, కాంట్రాక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని భట్టి విక్రమార్క ఉద్ఘాటించారు. విద్య ద్వారానే సమాజంలో గుర్తింపు, గౌరవం దక్కుతాయని, అక్షరాన్నే ఆయుధంగా మలచుకుని తెలంగాణ బిడ్డలు ఉన్నతంగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. చదువుతోనే అంతరాలు లేని సమాజ నిర్మాణం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. కుల, మత, వర్గ, ప్రాంతీయ, ధనిక, పేద తారతమ్యాలు లేకుండా అందరూ ఒకేచోట చదువుకోవాలన్న సత్సంకల్పంతోనే ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఈ ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను ఏర్పాటు చేస్తోందని స్పష్టం చేశారు. అన్ని వర్గాల విద్యార్థులు కలిసి ఒకేచోట విద్యను అభ్యసించడం ద్వారా వారిలో ‘వసుదైక కుటుంబ’ భావన పెంపొందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ పరిశీలన కార్యక్రమంలో సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, ఖమ్మం ఆర్డీవో శ్రీనివాస్, విద్యాశాఖ ఈఈ బుగ్గయ్య, విద్యుత్ శాఖ ఎస్ఈ శ్రీనివాసాచారి, ఆర్ అండ్ బీ ఎస్ఈ యుగంధర్ రావు, పీఆర్ ఎస్ఈ వెంకట్ రెడ్డి, సీపీవో ఏ. శ్రీనివాస్ తదితర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.